బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 02:33:48

నిద్రలేని భారతం!

నిద్రలేని భారతం!
  • నగరాల్లో తగ్గిపోతున్న నిద్ర సమయం
  • కంటినిండా నిద్రకు నోచుకోని భాగ్యనగరం
  • సెంచరీ మ్యాట్రెస్సెస్‌, వీవ్‌మేకర్‌ సంస్థల సర్వేలో వెల్లడి
  • నేడు ప్రపంచ నిద్ర దినోత్సవం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మానసిక, శారీరక ఆరోగ్యానికి తగినంత నిద్ర అత్యంత అవసరం. ప్రతి మనిషి రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. కానీ, నాగరిక జీవితంలో నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువ నిద్రపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. మార్చి 13 ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సెంచరీ మ్యాట్రెస్సెస్‌, వీవ్‌మేకర్‌ సంస్థలు దేశంలోని  పది ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, పుణె, కొచ్చి, అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌, ఇండోర్‌, విశాఖపట్నం, రాయ్‌పూర్‌ నగరాల్లో సర్వే చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. 


2018లో వారాంతపు దినాల్లో రోజుకు సగటు నిద్ర సమయం 7.66 గంటలు ఉండగా,  2019లో  6.85 గంటలకు పడిపోయినట్టు సర్వే నిర్ధారించింది. మిగిలిన వారంరోజుల్లో రోజుకు సగటున 7.48లపాటు నిద్రించగా ప్రస్తుతం అది 6.76 గంటలకు పడిపోయిందనేది సర్వే సారాంశం. 25 నుంచి 35 ఏండ్ల వయస్సు మహిళల్లో నిద్రలేమి సమస్య మరింత పెరిగినట్టు సర్వే తేల్చింది. మహిళలు 2018లో వారాంతపు దినాల్లో సగటున 7.70 గంటలు నిద్రించగా 2019లో 6.60 గంటలకు పడిపోయినట్టు పేర్కొంది.  పురుషులు 2018లో వారాంతపు దినాల్లో సగటున 7.66 గంటలు నిద్రించగా 2019లో 6.58 గంటలకు తగ్గినట్టు గుర్తించింది. 


హైదరాబాదీలకూ నిద్ర కరువే!

హైదరాబాద్‌ నగరంలోనూ నిద్రలేమి సమస్య పెరుగుతున్నది. 2018తో పోల్చుకుంటే 2019లో హైదరాబాద్‌లో నిద్రకు కేటాయించిన సమయం 21శాతం తగ్గినట్టు సర్వే వెల్లడించింది.  హైదరాబాద్‌లో వీకెండ్స్‌లో 2018లో సగటున 8.13 గంటలు నిద్రించగా 2019లో 6.88 గంటలకు పరిమితమైంది. మిగిలిన వారం రోజుల్లో 2018లో రోజుకు సగటున 7.88 గంటలుగా ఉన్న నిద్ర సమయం 2019లో 5.08 గంటలకు కుదించుకుపోయిందనేది సర్వే సారాంశం.


పది నగరాల్లో వారాంతపు దినాల్లో మనిషి సగటు నిద్ర

2018 :7.66 గంటలు

2019 :6.85 గంటలు


పది నగరాల్లో వర్కింగ్‌ డేస్‌లో మనిషి సగటునిద్ర

2018 :7.48 గంటలు

2019 :6.76 గంటలు


హైదరాబాద్‌లో 

వారాంతాల్లో మనిషి సగటు నిద్ర

2018 :8.13 గంటలు

2019 :6.88 గంటలు


వర్కింగ్‌ డేస్‌లో మనిషి సగటునిద్ర

2018 :7.88 గంటలు

2019 :5.08


41% 
మంది నగరవాసులు నిద్ర నుంచి లేవడానికి నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. విశ్రాంతి చాలలేదని ఫీలవుతున్నారు.
26% 
మంది బెడ్‌ మీదకు వెళ్లిన తర్వాత కూడా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు వినియోగించడం వల్ల నిద్రచాలడం లేదని చెప్తున్నారు. 
51%
 మంది క్రమం తప్పిన నిద్ర, పరుపుల తయారీలో శాస్త్రీయత లేకపోవడం వల్ల వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారు.logo