శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:22

పిల్లలకు యువత ప్రేరణనివ్వాలి

పిల్లలకు యువత ప్రేరణనివ్వాలి

  • చదివించండి- ఆడించండి-పిల్లలతో మమేకంకండి
  • యువతకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ పిలుపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘చదివించండి- ఆడించండి- సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించండి- చిన్నారులతో మమేకం కండి’ అని తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో బాలల స్థితి, విద్యావకాశాలపై సోమవారం జూమ్‌ యాప్‌ వేదికగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాలల హక్కుల పరిరక్షణకోసం పౌరుల సంఘం పేరిట ఇక సంస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ కరోనా కాలంలో చిన్నపిల్లలను తీర్చిదిద్దే కార్యక్రమాలలో యువత పెద్దఎత్తున పాల్గొని, ప్రేరణగా నిలవాలని చెప్పారు. పిల్లలతో ఆటలాడుతూ, పాటలు పాడుతూ, చదివించాలని అన్నారు. గ్రామీణప్రాంతాల్లోని బాలల విద్యాకేంద్రాల్లో ప్రత్యేక శిక్షణఇస్తూ స్వచ్ఛందంగా పనిచేసే యువతీ యువకులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు పాఠ్యపుస్తకాలు, కథల పుస్తకాలు, స్టేషనరీ విద్యాకమిటీలకు అందించేలా చూస్తానని హామీఇచ్చారు. 

పిల్లల్లో బడిపట్ల తగ్గుతున్న మక్కువ

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ ప్రొఫెసర్‌ శాంతాసిన్హా మాట్లాడుతూ పిల్లలకోసం చేసే కార్యక్రమాలన్నీ బాలకార్మికులుగా మారకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలుగానే పరిగణించాలన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంవీ ఫౌండేషన్‌ నేషనల్‌ కన్వీనర్‌ వెంకటరెడ్డి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ కారణంగా పిల్లల్లో బడికివెళ్లే అలవాటు తగ్గిపోతున్నదని, వారు క్రమంగా లేబర్‌ మార్కెట్‌వైపు మళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో యూనిసెఫ్‌ విద్యాధికారి సుకన్య, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ శోభారాణి, మాజీ ఐఏఎస్‌ అధికారి జగదీశ్వర్‌రావు, విద్యాపరిశోధనా మండలి మాజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఉపేందర్‌రెడ్డి, ఎంవీ ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. 


logo