గురువారం 28 మే 2020
Telangana - May 18, 2020 , 00:25:40

రాష్ట్రంలో తగ్గిన శిశుమరణాలు

రాష్ట్రంలో తగ్గిన శిశుమరణాలు

  • జాతీయ సగటు 32 శాతం
  • తెలంగాణలో 27 శాతమే 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మాతా శిశు మరణాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలు ఫలిస్తున్నాయి. ప్రతియేటా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గుతున్నది. 2014లో రాష్ట్రంలో శిశు మరణాల రేటు 39 ఉండగా.. ఈ ఏడాది 27 శాతానికి చేరింది. దీనిని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (ఎస్సారెస్‌) సర్వే ఇటీవలే వెల్లడించింది. ప్రతి వెయ్యి జననాలకుగాను శిశు మరణాల రేటు జాతీయస్థాయిలో 32 శాతం ఉండగా.. తెలంగాణలో 27 శాతంగా నమోదైనట్టు తెలిపింది. గతేడాది తెలంగాణలో 29 శాతం శిశువులు మరణిస్తున్నట్టు గుర్తించగా.. ఈ ఏడాది రెండుశాతం మరణాలు తగ్గాయి. రాష్ట్రం మొత్తంలో శిశు మరణాల రేటు 27 ఉండగా, అందులో ఆడ శిశువుల్లో 26 శాతం, మగశిశువుల్లో 27 శాతంగా ఉన్నది. పట్టణప్రాంతాల్లో శిశు మరణాల రేటు 21 శాతం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతంగా ఉన్నట్లు సర్వే ద్వారా గుర్తించారు. గర్భిణుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూనే భవిష్యత్‌ తరాలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పిల్లల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నవజాత శిశువుల ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకొని సర్కారు దవాఖానల్లో 29 ఎస్‌ఎన్‌సీయూలు (సిక్‌న్యూబర్న్‌ కేర్‌ యూనిట్లు), 61 ఎన్‌బీఎస్‌యూ, 562 ఎన్‌బీసీసీలను ఏర్పాటుచేసింది. ఎస్‌ఎన్‌సీయూ సిబ్బందికి ఎఫ్‌బీఎన్సీ శిక్షణ అందించి అంతర్జాతీయ ప్రమాణాలతో చిన్నారులకు వైద్యం, వైద్యశాలల్లో వసతులు కల్పించారు. కేసీఆర్‌ కిట్లు, 102 అంబులెన్స్‌ వాహనాలు, రూ.13 వేలు (ఆడపిల్ల పుడితే రూ.14వేలు) ఆర్థిక సహాయం వంటి పథకాల కారణంగా సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫలితంగానే శిశుమరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది.


logo