సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 02:18:15

అన్నదాత ఆయుష్మాన్‌ భవ!

అన్నదాత ఆయుష్మాన్‌ భవ!

  • తెలంగాణలో తగ్గిన రైతుల ఆత్మహత్యలు 
  • తగ్గుదలలో దేశంలోనే మొదటి స్థానం
  • రైతన్నకు ఊపిరిపోస్తున్న ప్రభుత్వ పథకాలు 
  • ఐదేండ్లలో 64.35 శాతం తగ్గిన బలవన్మరణాలు
  • అప్పుల ఊబినుంచి ఐశ్వర్యంవైపు అడుగులు 

దుక్కి దున్నేందుకు ఏరువాక కష్టం.. సాగుకు పెట్టుబడి కష్టం.. విత్తనాలు, ఎరువుల కోసం తిరగలేక కష్టం.. పొలం పారడానికి కరెంట్‌ కష్టం.. పండిన పంటకు మద్దతు ధర కష్టం.. ఉమ్మడిరాష్ట్రంలో అన్నదాతకు అన్నింటా కష్టం.. కష్టాల సాగుకడలిని ఈదలేక తనువు చాలించిన కర్షకులెందరో.. వ్యవసాయరంగం విధ్వంసానికి గురైనా, అన్నదాతలు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నా పట్టించుకున్న పాలకుడు లేడు.

తెలంగాణ స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. అణచివేతకు గురైన అన్నదాతకు తెలంగాణ సర్కారు అగ్రతాంబూలమిచ్చింది. ఒక్కో సమస్యను ఒరుపుగా పరిష్కరిస్తూ సమస్యల సుడిగుండం నుంచి బయటపడేసింది. రైతు కేంద్రీకృతంగా అమలుచేస్తున్న పథకాలు ఊపిరిలూదాయి. ఏరువాక నుంచి పొలికట్టుదాకా ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసింది. దీంతో స్వరాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. ఈ తగ్గుదలలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో  గత ఐదేండ్లలో 64.35 శాతం రైతు ఆత్మహత్యలు తగ్గాయి. నేషనల్‌ క్రైం బ్యూరో రికార్డ్స్‌ (ఎన్సీఆర్‌బీ) ప్రకారం అన్నదాతల బలవన్మరణాల తగ్గుదలలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిఏడాది 2015లో 1,400 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా.. 2019లో ఈ సంఖ్య 499కి తగ్గింది. అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు 64.35 శాతానికి తగ్గాయి. తెలంగాణ తర్వాత గుజరాత్‌లో 60.79 శాతం తగ్గుదల నమోదైంది. రైతు బలవన్మరణాలు అధికంగా జరిగే మహారాష్ట్రలో కేవలం 8.48 శాతం మాత్రమే తగ్గుదల నమోదైంది. 2018తో పోల్చినా తెలంగాణలో ఈ ఏడాది రైతుల ఆత్మహత్యలు భారీగా తగ్గిపోయాయి. ఇందులోకూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలువడం విశేషం. 2018తో పోల్చితే 2019లో రైతుల ఆత్మహత్యల్లో ఏకంగా 45.04 శాతం తగ్గుదల నమోదైంది. తర్వాత కేరళ 28.90 శాతం, మధ్యప్రదేశ్‌ 17.40 శాతం, కర్ణాటక 17.17 శాతంతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్‌లో ఈ ఏడాది 10.60 శాతం మాత్రమే తగ్గుదల నమోదయింది. ఏపీలో 54.96 శాతం అధికంగా ఆత్మహత్యలు నమోదు కావడం గమనార్హం.

ఊపిరి పోసిన పథకాలు

తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో వ్యవసాయరంగం అస్తవ్యస్తంగా ఉన్నది. తెలంగాణలో రైతన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్‌.. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా వారి సమస్యలు పరిష్కరించేందుకు నడుం బిగించారు. రాష్ట్రం ఏర్పాటుకుముందే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే ప్రణాళికలకు ప్రాణంపోసిన కేసీఆర్‌.. రాష్ట్రం సిద్ధించాక వాటిని ఒక్కొక్కటిగా అమలుచేశారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో ఎక్కువగా రైతు కేంద్రీకృతమైనవే కావడం విశేషం. తెలంగాణ రైతును దేశంలోనే ధనిక రైతుగా చూడాలనే లక్ష్యంతో పథకాలను రూపొందించారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కలిగించారు. మిషన్‌ కాకతీయ ద్వారా వ్యవసాయానికి ఆధారమైన గొలుసుకట్టు చెరువులకు పూర్వవైభవం తెచ్చారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ను ప్రకటించారు. సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అతి తక్కువ సమయంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చి గోదావరి జలాలను బీడు భూముల్లో పరవళ్లు తొక్కించారు.

రైతుబంధుతో భరోసా

రైతుకు పెట్టుబడి భారం తగ్గించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రపంచంలోనే తొలిసారిగా రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఎకరాకు ఏడాదికి రూ.10వేల పంటసాయంతో ఈ పథకం అన్నదాతల్లో ఎంతో భరోసా నింపింది. సుమారు 60 లక్షలమంది రైతులు లబ్ధిపొందే ఈ పథకం కోసం ఏటా రూ.14వేల కోట్లు కేటాయిస్తున్నారు. దీంతో రైతుకు పంట పెట్టుడికోసం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన తిప్పలు తప్పాయి. అదేవిధంగా ప్రభుత్వం మద్దతు ధరకే రైతుల పంటలను కొనుగోలు చేస్తున్నది. ఇక ఈ సీజన్‌లో నియంత్రిత సాగు విధానాన్ని ప్రవేశపెట్టి మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే పండించేలా రైతులకు మార్గనిర్దేశం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు రైతుకు ఊపిరి పోశాయని నిపుణులు, మేధావులు పేర్కొంటున్నారు.