గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 02:01:44

తగ్గిన కరోనా వ్యాప్తి

తగ్గిన కరోనా వ్యాప్తి

  • ఐసీఎమ్మార్‌- ఎన్‌ఐఎన్‌ రెండో సెరో సర్వే వెల్లడి
  • సరైన నియంత్రణ చర్యల వల్లే సాధ్యమైనట్టు వెల్లడి
  • మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి అని సూచన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వేగం చాలావరకు తగ్గిందని ఐసీఎమ్మాఆర్‌- జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నిర్వహించిన రెండోవిడుత సెరో సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా సాధారణ ప్రజల్లో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ఎంత ఉందో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఐసీఎమ్మార్‌ పరిశోధిస్తున్నది. ఈ క్రమంలో ఇప్పటికే మే నెలలో రాష్ట్రంలోని జనగామ, కామారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మొదటివిడుత ‘సెరో సర్వే’ నిర్వహించి వ్యాప్తి శాతాన్ని వివరించింది. ప్రస్తుతం ఆగస్టు చివరివారంలో వైరస్‌వ్యాప్తి గురించి తెలుసుకునేందుకు రెండోసారి ఆయా జిల్లాల్లో సర్వే నిర్వహించింది. 30 గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి ఐజీజీ ప్రతిరక్షకాల శాతాన్ని గుర్తించింది. దీని ఆధారంగా జనగామ జిల్లాలో 454 మందిలో 83 (18.2%) మందికి వైరస్‌ పాజిటివ్‌ ఉన్నట్టు గుర్తించగా, నల్లగొండ జిల్లాలో 422 మందిలో 47 (11.1%) మందికి, కామారెడ్డి జిల్లాలో 433 మందిలో 30 (0.9%) మందికి వైరస్‌ సోకినట్టు తేలింది. గత సర్వే ఫలితాలతో పోల్చితే, వ్యాప్తి వేగంలో తగ్గుముఖం పట్టిందని, ఇది తక్కువ వ్యాప్తి అని ఐసీఎమ్మార్‌ వెల్లడించింది. 

సరైన కొవిడ్‌ నియంత్రణ చర్యలు పాటించడం వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడింది. అయితే ఇప్పటికీ పెద్దసంఖ్యలో కరోనా బాధితులు ఉన్న నేపథ్యంలో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, పరిశుభ్రత పాటించడం వంటి చర్యలు కొనసాగించాలని ప్రజలకు సూచించింది. సర్వేలో ఐసీఎమ్మార్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఆవుల లక్ష్మయ్య, సీనియర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ బీ దినేశ్‌కుమార్‌, డాక్టర్‌ ఎన్‌ అర్లప్ప, డాక్టర్‌ జేజే బాబు, ఎన్‌ఐఎన్‌కు చెందిన 50 మంది శాస్త్రవేత్తలు, సాంకేతికత నిపుణులు పాల్గొన్నారు. సర్వేకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ అధికారులు పూర్తిస్థాయిలో సహకరించారని ఐసీఎమ్మార్‌ పేర్కొన్నది.


logo