బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 03:33:12

మన సచివాలయం.. మన వారసత్వం

మన సచివాలయం.. మన వారసత్వం

  • తెలంగాణతనానికి నిలువుదర్పణం
  • డిజైన్‌లోనే పూర్వపురాజుల శిల్పకళారీతులు
  • ఘన చరిత్రకు ప్రతిరూపంగా అపూర్వ నిర్మాణం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చరిత్ర మరువదు మన చతురత. ఎన్నటికీ.. ఎప్పటికీ మరువదు.. ఎందుకంటే మన వారసత్వం అలాంటి ది. ఘనమైన నిర్మాణ చాతుర్యం కలిగిన శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు, విష్ణుకుండినులు, ఇస్లాంరాజుల పరంపర మనది. వెయ్యేండ్లకు పైగా చెక్కు చెదరకుండా నిలబడ్డ నిర్మాణాలు, సాటిలేని శిల్పవైచిత్రి మనకు మాత్రమే సొంతం. నీటి పునాదులపై నిర్మించిన త్రికూటాలయాలు, తేలే ఇటుకలతో నిర్మించిన గోపురాలు, శత్రుదుర్భేద్యమైన కోటలు, ప్రాకారాలు మనవాళ్లకు మాత్రమే సాధ్యం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతున్న సచివాలయం ఈ అపూర్వమైన వారసత్వానికి కొనసాగింపు. మరో వెయ్యేండ్లపాటు ప్రపంచం ఈ నిర్మాణవైభవాన్ని కథలుగా చెప్పుకొనేలా సాగనున్న నిర్మాణం. ఒక్కమాటలో చెప్పాలంటే ‘తెలంగాణతనం’ ఉట్టిపడనున్నది. తెలంగాణలోని ఆధ్యాత్మిక, చారిత్రక నిర్మాణాలపై మూడు వంశా ల ప్రభావం కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతాన్ని మొదట్లో చాళుక్యులు పాలించారు. ఆ తర్వాత కాకతీయులు ఏలారు. చివరగా ముస్లిం రాజులు అధికారంలో ఉన్నారు. ఈ మూడు రాజవంశాలదీ భిన్నమైన నిర్మాణశైలి. దేనికదే ప్రత్యేకం. తెలంగాణ సచివాలయాన్ని దక్కన్‌ కాకతీయుల శైలిలో, దక్షిణ భారతదేశ సంప్రదాయాల కలబోతగా డిజైన్‌ చేసినట్టు ఆస్కార్‌ అండ్‌ పొన్ని సంస్థ చెప్తున్నది. 

ప్రారంభంలోనే చాళుక్యుల స్ఫూర్తి 

చాళుక్యుల కాలంలో తెలంగాణలో నిర్మించిన ఆలయాలను పరిశీలిస్తే.. చాలామటుకు ఆలయాలకు ముందు పోడియం కనిపిస్తుంది. శిఖరం అంతస్తుల మాదిరిగా ఉంటుంది. దీంతోపాటు పోడియం మొదలు శిఖరం వరకు శిల్పకళ ఉట్టిపడుతుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నవబ్రహ్మ ఆలయాలే ఇందుకు ఉదాహరణ. ఇదే తరహాలో తెలంగాణ నూతన సచివాలయానికి మధ్యలో పెద్ద పోడియం ఏర్పాటు చేయనున్నా రు. ఇది ఉపరితలానికి రెండు మీటర్ల ఎత్తులో కనిపిస్తుంది. ఇలా సచివాలయం ప్రవేశమార్గం వద్దే చాళుక్యుల స్ఫూర్తి కనిపించనుంది.

కాకతీయుల శైలి ఆదర్శం 

కాకతీయుల నిర్మాణశైలిలో ప్రధానమైనవి స్తంభాలు. వంద స్తంభాలు.. వెయ్యి స్తంభాలు.. ఇలా స్తంభాలతోనే ఆలయాన్ని నిర్మించిన ఘన చరిత్ర కాకతీయులది. ఆలయంలోనికి గాలి, వెలుతురు బాగా ప్రసరించేలా వాటికి రూపకల్పన చేశారు. ఈ లక్షణాలు రామప్ప గుడిలో కనిపిస్తాయి. ఇదే మాదిరిగా తెలంగాణ నూతన సచివాలయం డిజైన్‌లోనూ నిలువెత్తు స్తంభాలు ఉంటాయని తెలుస్తున్నది. అన్ని అంతస్తుల్లోనూ గాలి, వెలుతురు ధారాలంగా ప్రసరించేలా ఏర్పాట్లున్నాయి. 

నవాబులను స్ఫురణకు తెచ్చేలా..

మన ప్రాంతంలోని నిర్మాణాలపై ముస్లిం రాజుల ముద్ర ఎక్కువగా కనిపిస్తుంది. గోళాకార డోముల నిర్మాణం వీరి ప్రత్యేకత. తెలంగాణ సచివాలయంలోనూ మధ్యలోని ప్రధాన డోమ్‌తోపాటు మిగతా డోమ్‌ల నిర్మాణం నవాబుల నిర్మాణ శైలిని స్ఫురణకు తేనుంది.

తెలంగాణకు కలికితురాయిగా..

ఎన్నో చారిత్రక కట్టడాలకు తెలంగాణ ప్రసిద్ధి. భవిష్యత్తులో సచివాలయం సైతం వీటి సరసన చేరే అవకాశాలున్నాయి. శిల్పకళలోనే కాదు.. నాణ్యతలోనూ చారిత్రక కట్టడాలకు ఏమాత్రం తీసిపోకుండా నిర్మాణం జరుగనున్న ది. సచివాలయాన్ని స్థూలంగా చూసినప్పుడే ఒక రాజమహల్‌ను తలపిస్తుంది. గంభీరమైన నిర్మాణం, ఎదురుగా పెద్ద ఫౌంటెన్లు, ల్యాండ్‌ స్కేపింగ్‌.. ఇలా అందంతో కట్టిపడేయనున్నది. పోడియం నుంచి చివరి వరకూ శిల్పకళతో అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. ముఖ్యంగా ప్రవేశ మందిరాన్ని తెలంగాణ ఘనచరిత్రకు ప్రతీకగా మలుచనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. దశాబ్దాలు గడిచినా ఏమాత్రం చెక్కుచెదురని రీతిలో, తెలంగాణ కీర్తికిరీటంలో ఓ కలికితురాయిగా ఈ నిర్మాణం నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. 

తెలంగాణ శిల్పకళపై వివిధ వంశాల ప్రభావానికి నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌లో ఉన్న వంద స్తంభాల గుడి ఓ ప్రతీక. చరిత్ర ప్రకారం దీనిని రాష్ట్రకూటుల కాలంలో నిర్మించారు. తర్వాత చాళుక్యరాజు సోమేశ్వరుడి హయాంలో పునరుద్ధరించారు. కాకతీయులు దానికి మరింత శిల్పకళను జోడించి, వారి శైలికి తగ్గట్టు మార్పులు చేశారు. మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ కాలంలో ఈ ఆలయాన్ని మసీదుగా మార్చారు. ఆలయంపై గోపురాల స్థానంలో డోమ్‌లను ఏర్పాటు చేశారు. అందుకే ఈ ఆలయాన్ని ‘దేవల్‌ మసీదు’ అని కూడా పిలుస్తుంటారు. 


logo