శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 14:02:12

గొర్రెకుంట మృత్యుబావి కేసు.. సంజ‌య్‌కు ఉరిశిక్ష ఖ‌రారు

గొర్రెకుంట మృత్యుబావి కేసు.. సంజ‌య్‌కు ఉరిశిక్ష ఖ‌రారు

వ‌రంగ‌ల్ రూర‌ల్ : రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన గొర్రెకుంట మృత్యుబావి కేసులో వ‌రంగ‌ల్ జిల్లా సెష‌న్స్ కోర్టు బుధ‌వారం తుదితీర్పు వెల్ల‌డించింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు సంజ‌య్ కుమార్ యాద‌వ్‌(24)ను కోర్టు దోషిగా తేల్చింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయ‌మూర్తి జ‌య‌కుమార్ తీర్పు వెల్ల‌డించారు. నిందితుడిపై అభియోగాల‌ను ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ నిరూపించారు. ఈ కేసును నెల రోజుల్లో ద‌ర్యాప్తు చేసిన పోలీసులు.. అనంత‌రం కోర్టులో ఛార్జిషీట్ దాఖ‌లు చేశారు. నిందితుడిపై 7 సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. హ‌త్య కేసులో 67 మందిని జిల్లా సెష‌న్స్ కోర్టు న్యాయ‌మూర్తి విచారించారు. ఒక హ‌త్య‌ను క‌ప్పి పుచ్చుకోవ‌డానికి 9 మందిని సంజ‌య్ హ‌త్య చేశాడు. బీహార్‌కు చెందిన సంజ‌య్ కుమార్ ఈ ఏడాది మే 21న తొమ్మిది మందిని హ‌త్య‌చేసి వరంగల్ శివారులోని గీసుకొండలోని గొర్రెకుంట బావిలో పడేసి జ‌ల‌స‌మాధి చేశాడు.  

కేసు పూర్వ‌ప‌రాలు.. 

పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా వరంగల్‌కు వలస వచ్చాడు. నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతంలో వీరంతా అద్దె ఇంట్లో ఉండేవారు. ఇక డిసెంబర్ నుంచి వీరు గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గోనె సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌ కుటుంబం ఉంటోంది. భర్తతో విడిపోయిన మక్సూద్ భార్య చెల్లెలు బుస్రా ఆలం కూడా తన మూడేళ్ల కుమారుడితో వారి వద్ద ఉంటోంది. వీరితో పాటుగా గన్నీ సంచుల గొదాం పక్కనే ఉన్న పైభవనంలో బీహార్‌కి చెందిన శ్రీరాం, శ్యాంలు ఉన్నారు. ఇక నగరంలోని సంజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తితో బుస్రాకు వివాహేతర సంబంధం ఉండగా.. ఈ విషయంలో తరచుగా మక్సూద్ ఇంట్లో గొడవలు జ‌రిగాయి. ఇక ఇంటిపై ఉంటున్న శ్రీ రాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకుని బుస్రాపై కన్నేశారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ కుమార్ పథకం ప్రకారం తొమ్మిది మందిని హతమార్చాడు.

మృతులెవరంటే..

గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్‌ స్టోరేజీ సమీపంలోని బార్‌దాన్‌ కుట్టే గోదాంలో పనిచేసే మహ్మద్‌ మక్సూద్‌ ఆలం (55), అతడి భార్య నిషా ఆలం (45), కూతురు బుష్రా ఖాతూన్ ‌(20), మక్సూద్‌ కుమారులు షాబాజ్‌ ఆలం (19), సోహిల్‌ ఆలం (18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బిహార్‌ వలస కార్మికులు శ్యాం కుమార్‌షా (21), శ్రీరాం కుమార్‌షా (26) , మక్సూద్‌కు సన్నిహితుడైన మహ్మద్‌ షకీల్ ‌(30) అనే డ్రైవర్  ఉన్నారు.