శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 00:25:07

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు

  • కల్వర్టును ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మరణం
  • సహాయ చర్యలు చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన డీసీఎం 
  • మరో ఇద్దరు మృతి.. పది మందికి గాయాలు 
  • ఐదు కుటుంబాల్లో తీరని విషాదం 

సిద్దిపేట టౌన్‌: వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు చేపడుతున్న వారిపైకి ఓ డీసీఎం మృత్యువులా దూసుకొచ్చింది. రాజీవ్‌ రహదారిపై సిద్దిపేట శివారులో జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. సహాయ చర్యల్లో పాల్గొన్న నలుగురు పోలీసులతోపాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఐదు కుటుంబాల్లో తీరని విషాదం నింపిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్‌కు చెందిన బయ్యపు నరేందర్‌రెడ్డి (39) హుజురాబాద్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు రాజిరెడ్డి(62), విజయ(56)లకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్య పరీక్షల కోసం కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. సిద్దిపేట శివారులోని తెలంగాణ హోటల్‌ వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట టూటౌన్‌ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను తీసేందుకు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. 

అదుపుతప్పిన డీసీఎం..

ప్రమాద స్థలంలో స్థానికులతో కలిసి పోలీసులు సహాయక చర్యలు చేపట్టడంతో రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఈ క్రమంలో కరీంనగర్‌ వైపు నుంచి వేగంగా వస్తున్న ఓ డీసీఎం వీరిపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో సిద్దిపేట అర్బన్‌ మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన రేషన్‌ డీలర్‌ ఎల్లారెడ్డి(50), చిన్నకోడూరు మండలం రామునిపట్లకు చెందిన కూలీ అనరాసి మల్లేశం(35) మృతిచెందారు. వీరితోపాటు సిద్దిపేట టూటౌన్‌ సీఐ పరశురామ్‌గౌడ్‌ తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు పోలీసులతోపాటు సహాయక చర్యల్లో పాల్గొన్న 12 మంది గాయపడ్డారు. వీరందరినీ సిద్దిపేట దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించిన దుర్గారెడ్డి అనే వ్యక్తిని వైద్యులు హైదరాబాద్‌కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, సహాయక చర్యల్లో పాల్గొన్న ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యు ల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌, ఏసీపీ రామేశ్వర్‌ ఘటన స్థలానికి చేరుకొని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.  

మంత్రి హరీశ్‌రావు విచారం..

రాజీవ్‌ రహదారిపై జరిగిన ప్రమాద ఘటనపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. తీవ్రంగా గాయపడి సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఫోన్‌లో ఆదేశించారు.  logo