శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 03:23:30

ఉమ్మడిగా కరోనాను గెలిచిన కుటుంబం

ఉమ్మడిగా కరోనాను గెలిచిన కుటుంబం

  • ఇంట్లో మొత్తం 15 మందికీ పాజిటివ్‌
  • బాధితుల్లో చిన్నారి, 90 ఏండ్ల వృద్ధురాలు
  • వైద్యుల సలహాలు పాటించి పూర్తి స్వస్థత

హైదరాబాద్‌/ షాద్‌నగర్‌, నమస్తే తెలంగాణ: ఇంట్లో ఒకరికి కరోనా వస్తే పుట్టే కంగారు అంతాఇంతా కాదు. అందులోనూ చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాల్లోనైతే మరీ ఆందోళన ఉంటుంది. అలాంటిది.. ఏడాదిన్న చిన్నారి మొదలుకుని.. 90 ఏండ్ల వృద్ధురాలి వరకూ.. 15 మంది ఉన్న కుటుంబం మొత్తం కరోనాబారిన పడితే! కానీ.. ఆ కుటుంబం కలవరపడలేదు. వైద్యుల సూచనలు తీసుకుంటూ ఇంట్లోనే ఉండి.. పదిహేను రోజుల్లోనే కరోనాను జయించింది. సంకల్పం ముందు కరోనా ఏమీ చేయలేదని కలిసికట్టుగా నిరూపించింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య కుటుంబం నెలరోజుల క్రితం కరోనా బారిన పడింది. కుటుంబంలోని 15 మందికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బాబయ్యతోపాటు ఆయన భార్య, ముగ్గురు కుమారులు, మనుమలు, తల్లి వైరస్‌ బారిన పడినవారిలో ఉన్నారు. బాబయ్య తల్లి చంద్రకళకు 90 ఏండ్లు, ఆ ఇంట్లో మరో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉన్నది.

కరోనా సోకిందిలా..

అందె బాబయ్య వ్యాపార నిమిత్తం ఓవ్యక్తితో మాట్లాడారు. ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తెలియడంతో తాను పరీక్షలు చేయించుకున్నాడు. పాజిటివ్‌ వచ్చింది. ఒకింత షాక్‌కు గురైన బాబయ్య తన కారు డ్రైవర్‌తోపాటు ఇంట్లోని వారందరికీ పరీక్షలు చేయించాడు. అందరికీ పాజిటివ్‌ వచ్చింది. బాబయ్య రెండో కుమారుడు నర్సింహ రెండు మూడు రోజులు జ్వరంతో ఇబ్బంది పడ్డా హోం ఐసొలేషన్‌లో వెంటనే కోలుకున్నాడు. 90 ఏండ్ల వృద్ధురాలైన చంద్రకళ ఆయాసం లేకుండా కొవిడ్‌ ను జయించడం విశేషం. కొవిడ్‌ బారినపడ్డ 15 మందిలో కొందరు 12 రోజుల్లో కోలుకోగా.. మరొకొందరు కోలుకునేందుకు 15 రోజుల సమయం పట్టింది.  

ధైర్యంతోనే జయించాం

‘మా ఇంట్లో వారికి కరోనా అనగానే టెన్షన్‌ పడ్డం. ఆ తర్వాత ధైర్యంతో ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది చెప్పినట్టు చేసినం. రోజూ యోగా చేయాలని, కషాయం తాగాలని, కోడిగుడ్లతోపాటు పౌష్టికాహారం తినాలని, వేడి నీళ్లు తాగాలని చెప్పారు. వాళ్లు చెప్పినట్లు చేసినం. మనోధైర్యంతోనే కరోనాను జయించాం. కరోనా వస్తే భయపడొద్దు.

- అందెబాబయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి logo