మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 02:13:17

బండి కిందే బతుకు

బండి కిందే బతుకు

  • లక్ష రూపాయలు లాక్కొని..
  • వృద్ధురాలిని రోడ్డుపై వదిలేసిన కోడలు
  • నాలుగు రోజులుగా రోడ్డుపైనే నరకం

భువనగిరి: అన్నీ ఉన్నా అనాథగా మారిందా వృద్ధురాలు.. నాలుగు రోజులుగా చాట్‌ బండి కిందే బతుకు వెళ్లదీస్తున్న దీనస్థితి..  యాచిస్తూ సంపాదించిన సొమ్మును తీసుకొని వృద్ధురాలన్న కనికరమే లేకుండా ఆమెను కుటుంబసభ్యులు రోడ్డుపై వదిలేసిన అమానవీయ ఘటన ఆదివారం భువనగిరిలో వెలుగుచూసింది.  వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అన్నోజీగూడ సమీపంలోని క్వారీలో కూలీపనులు చేసుకుంటున్న మధు తల్లి కిష్టమ్మ కొన్నేళ్లుగా యాచకురాలిగా బతుకు వెళ్లదీస్తున్నది. అలా కూడబెట్టుకొన్న దాదాపు లక్ష  రూపాయలను పలుదఫాలుగా ఆమె కోడలు పద్మ తీసుకొన్నది. అచేతన స్థితికి చేరుకున్న కిష్టమ్మను ఎలాగైనా వదిలించుకోవాలని పద్మ నిశ్చయించుకున్నది. 

ఈ క్రమంలో కిష్టమ్మ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని భర్త మధుకు చెప్పింది. దవాఖాన కంటూ చెప్పి నాలుగు రోజుల క్రితం తీసుకువెళ్లింది. భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ కళాశాల సమీపంలో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కోడలు పద్మ కోసం ఎదురుచూసిన వృద్ధురాలు కిష్టమ్మ దిక్కుతోచని స్థితిలో బస్టాండ్‌ పక్కన ఉన్న ఓ చాట్‌బండార్‌ బండి కిందే నాలుగురోజులుగా ఉంటున్నది. వృద్ధురాలి ఎవరికీ తెలియకుండా ఆమె వద్ద ఉన్న కాగితాలను పద్మ తీసుకెళ్లింది. వృద్ధురాలిని గమనించిన అమ్మ ఒడి అనాథాశ్రమ నిర్వాహకుడు జెల్ల శంకర్‌ పట్టణ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానికులు వృద్ధురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు.


logo