మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 02:06:48

నల్లసూరీడుకు దసరా బొనాంజా

నల్లసూరీడుకు దసరా బొనాంజా

  • ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.60 వేలు
  • లాభాల్లో 28 శాతం వాటా 
  •  సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో అందనున్న భారీ మొత్తం
  • తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెరుగుతున్న లాభాలు 
  •  ఉత్పత్తిలోనూ గణనీయమైన పెరుగుదల  

కార్మికుడైనా, కర్షకుడైనా కడుపు నిండా తినాలి.. కష్టానికి తగ్గ ఫలితం దక్కాలనే  సంకల్పంతో ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నది. ఈ కోవలోనే సింగరేణి కార్మికుల కష్టానికి తగ్గ ఫలం అందించాలన్న ఉద్దేశంతో లాభాల్లో వాటా అందించాలని గతంలోనే సీఎం కేసీఆర్‌ నిర్ణయం  తీసుకున్నారు. తాజాగా సంస్థ లాభాల్లో 28 శాతం వాటాను అందజేయాలని ఆదేశాలిచ్చారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సింగరేణి కార్మికులకు దసరా పండుగకు భారీ బొనాంజా దక్కనున్నది. సంస్థ లాభం వాటా కింద ఒక్కో కార్మికుడు దాదాపు రూ.60 వేలకు పైగా అందుకోనున్నాడు. కార్మికులకు ఈ ఏడాది కూడా 28 శాతం లాభాల వాటాను పంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవటంతో కార్మిక కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది. లాభాల వాటా పంచాలని ఇప్పటికే సీఎంవో నుంచి ఇంధనశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి, సింగరేణి సీఎండీకి ఆదేశాలు అందాయి.  లాభాల వాటా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ ఆదేశించారు. 2019-20 ఏడాదికి 64.04 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా అన్ని రకాల పన్నులను మినహాయించాక సుమారు రూ.994 కోట్ల మొత్తం సింగరేణికి లాభం వచ్చింది. ఇందులో నుంచి 28 శాతం వాటా అంటే సుమారు రూ. 278 కోట్లకుపైగా కార్మికులకు అందించనున్నట్టు తెలుస్తున్నది. దీనితో సగటున ఒక్కో కార్మికుడికి రూ. 60 వేలకుపైగా ఈ దసరాకు అందనున్నది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో సంస్థ ప్రకటించే అవకాశమున్నది. గతేడాది (2018-19 సంవత్సరానికి) కూడా 28 శాతం లాభాల వాటాను ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఈసారి కూడా అదే స్థాయిలో లాభా ల వాటాను ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. నిజానికి 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో సింగరేణిపై కరోనా ప్రభావం పడింది. నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. అయినా, తెలంగాణకు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో అండగా నిల్చుంటున్న సింగరేణి సంస్థపై, సంస్థలోని కార్మికులకు లాభాల వాటాను గత ఏడాది మాదిరే 28 శాతం ప్రకటించారు.


తెలంగాణ వచ్చాక  పెరుగుతున్న  ఉత్పత్తి, లాభాల వాటా

సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు సింగరేణిపై సవతి తల్లి ప్రేమను చూపెట్టేవి. కానీ తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడంతోపాటు, భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలను కల్పించారు. కావాల్సిన సౌకర్యాలు, వసతులను ఏర్పాటు చేశారు. అదే స్థాయిలో పనిచేయాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కార్మికులను కోరారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కార్మికులు పనిచేశారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. సింగరేణి సీఎండీగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎన్‌ శ్రీధర్‌ పగ్గాలు చేపట్టాక సంస్థ, ప్రభుత్వం, కార్మికుల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. దీని ప్రభావం బొగ్గు ఉత్పత్తిలోనూ, రవాణా, లాభాల్లోనూ స్పష్టంగా కనిపించింది. అదే స్థాయిలో ప్రభుత్వం లాభాల వాటా శాతాన్ని ప్రకటించటం, సగటున కార్మికుడికి అందే మొత్తంలోనూ కనిపిస్తూ వస్తున్నది.logo