శనివారం 11 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:25:52

నమో వేంకటేశ!

నమో వేంకటేశ!

  • 82రోజుల తర్వాత శ్రీవారి దర్శనం
  • ఉదయం7.30 నుంచి రాత్రి 7.30 వరకే దర్శనం

తిరుమల, నమస్తే తెలంగాణ: సప్తగిరుల్లో 82 రోజుల తర్వాత భక్తుల సందడి నెలకొన్నది. తిరుమల శ్రీవారి దర్శనం గురువారం తిరిగి ప్రారంభమైంది. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో టీడీపీ అధికారులు తీసుకున్న చర్యలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లుచేశారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అభినందించారు. తెలంగాణ నుంచి 143 మంది, తమిళనాడు నుంచి 141 మంది, కర్ణాటక నుంచి 151 మంది, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, అరుణాచల్‌ప్రదేశ్‌, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌ రాష్ర్టాల భక్తులు కూడా గురువారం శ్రీవారిని దర్శించుకున్నారని చైర్మన్‌ తెలిపారు. దర్శనానికి అన్నిప్రాంతాలవారి అనుమతిస్తున్నామని, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే భక్తులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరిగా తెచ్చుకోవాలని కోరారు. టైంస్లాట్‌, ప్రత్యేక దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నామని చెప్పారు. ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటల నుంచే భక్తులు భౌతికదూరం పాటిస్తూ క్యూలైన్లలో నిలబడేలా చూస్తున్నామన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా శ్రీవారి మెట్లమార్గం అనుమతిని నిషేధించామని, అలిపిరి నడకమార్గంలోనే రావాలని సూచించారు. ఈ నెల 30 వరకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులు ఆన్‌లైన్‌లో ఇప్పటికే బుక్‌ చేసుకున్నారని చెప్పారు. ఆఫ్‌లైన్‌ ద్వారా ఈ నెల 17 వరకు టైంస్లాట్‌ టికెట్లను టీటీడీ జారీచేసిందని చైర్మన్‌ వెల్లడించారు. కంటైన్మెంట్‌ జోన్లలోని భక్తులు తిరుమలకు రావొద్దని విజ్ఞప్తిచేశారు. అవకాశాన్ని బట్టి దర్శనం టికెట్ల సంఖ్య పెంచుతామన్నారు. అలిపిరి వద్ద భక్తులకు ర్యాండం పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. 


logo