శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 03:33:12

శ్రీరాజరాజేశ్వర జలాశయానికి డ్యాం బ్రేక్‌ విశ్లేషణ

శ్రీరాజరాజేశ్వర జలాశయానికి డ్యాం బ్రేక్‌ విశ్లేషణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన శ్రీరాజరాజేశ్వర జలాశయానికి డ్యాంబ్రేక్‌ విశ్లేషణ (డీబీఏ) చేయాలని నీటిపారుదలశాఖ నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రాజెక్టుకు ఇలాంటి సర్వే చేపట్టడం ఇదే తొలిసారి. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు పూణెలోని సెంట్రల్‌ వాటర్‌, పవర్‌ రిసెర్చి స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌)కు లేఖ రాశారు. ఈ జలాశయం కాళేశ్వరం ప్రాజెక్టులో ఓ జంక్షన్‌లా మారనున్నది. ముఖ్యంగా ఇలాంటి కీలకమైన ప్రాజెక్టులపై పలు రకాల సర్వేలు, సమగ్ర విశ్లేషణలు అందుబాటులో ఉంచుకోవడం వల్ల భవిష్యత్తులోనూ ఉపయుక్తంగా ఉంటాయి. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ఈ జలాశయ నిర్మాణ పనులు లోపభూయిష్టంగా మారడంతో నీటి నిల్వ చేసేందుకు సిద్ధమైన తొలినాళ్లలో గండి కూడా పడింది. అందుకే డ్యాం బ్రేక్‌ విశ్లేషణ సర్వే చేయించాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ సర్వే, పరీక్షలకు ఎంత వ్యయం అవుతుందనే వివరాలు పంపాల్సిందిగా సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌కు రాసిన లేఖలో అధికారులు కోరారు.


logo