e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home Top Slides వ్యాపార లైసెన్సుల్లో రిజర్వేషన్లు

వ్యాపార లైసెన్సుల్లో రిజర్వేషన్లు

  • దళిత కాలనీల్లో స్థానిక యువతకే పనులు
  • దళితులందరికీ ఇండ్ల నిర్మాణం
  • భూసమస్యలన్నీ పరిష్కరించాలి

ఇప్పుడు ఊర్లల్ల ప్రేమ కొంత ఉన్నది, కొంత మేర ఈర్ష్య, ద్వేషం ఉన్నది. ఊర్లె ఎల్లయ్య బిడ్డ లగ్గం అయితుంటే.. ఎైట్లెతదో సూద్దాం వాని ఇజ్జత్‌ పోవాలె అని చూస్తున్నరు. మనోడే.. మన తమ్ముడే..మన అన్ననే.. అనుకొని సాయంచేద్దామన్న ముచ్చట తక్కువ ఉన్నది. అది పోవాలె.

హైదరాబాద్‌, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డబ్బు సంపాదించే వివిధ వ్యాపారమార్గాల్లో అవసరమైన మేరకు దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని యోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన దళితబంధు సదస్సులో సీఎం చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘రాష్ట్రంలో వైన్‌ షాపులున్నయి. దళితులకు ఎక్కడన్న ఉన్నయా? దళితులకు ఒక్క మెడికల్‌ షాపన్నా ఉన్నదా? ఇయ్యాల తెలంగాణ వాడే ఎరువులు 26 లక్షల టన్నులు. దళితుల్లో ఒక్కరికన్నా ఎరువుల దుకాణం ఉన్నదా? ఎందుకు లేవు? ఎందుకంటే ఇన్నాళ్లూ అవకాశం లేదు. ఇప్పుడు ఆ అవకాశం ప్రభుత్వం ఇస్తది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలల్ల ఒకప్పుడు ఒక్క దళితునికి కూడా అవకాశం రాకుండె. మనం రిజర్వేషన్లు కల్పించినంక అవకాశాలు వచ్చినయి. అట్ల్లనే డబ్బు సంపాదించే మార్గాల్లో రిజర్వేషన్‌ పెట్టే ఆలోచన ఉన్నది. వైన్‌షాపుల్లో కచ్చితంగా ఎస్సీలకు రిజర్వేషన్‌ పెడుతం. మెడికల్‌ షాప్‌లు, ఎరువుల దుకాణాల లైసెన్సులు ప్రభుత్వం చేతుల ఉన్నది. అందులో దళితులకు అవకాశం కల్పిస్తం. ఇట్ల ఏ రంగాల్లో రిజర్వేషన్లు పెట్టవచ్చో అధికారులకు చెప్పిన. ఒక సీఎం, మొత్తం ప్రభుత్వం కూసున్నంక ఇది ఎట్ల కాదు? డబ్బులు ఇచ్చి మీకు మీరే చేసుకోండ్రి అని గాలికి వదిలిపెట్టం.

- Advertisement -

మేము ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలె. ఒక షాప్‌ పెట్టేటప్పుడు రూ.10 లక్షలు చాలవని అనుకుంటే ఇద్దరు కలిసి పెట్టాలె. హుజూరాబాద్‌ జమ్మికుంటలో రైస్‌ మిల్లులు ఉన్నయ్‌. ఒక్కటన్న ఎస్సీలకు ఉన్నదా? ఎందుకు లేవు? డబ్బులు లేవు.. అవకాశం లేదు. ఐదుగురు కలిస్తే రూ.50 లక్షలు అయితయి. రైస్‌మిల్లు పెట్టొచ్చు. మనం కూడా కలిసికట్టుగా పైకి రావాల్ననే భావన గట్టిగ రావాలె. ఆ మేరకు ప్రేమ పెంచుకోవాలె. ఇప్పుడు ఊర్లల్ల ప్రేమ కొంత ఉన్నది, కొంత మేర ఈర్ష్య, ద్వేషం ఉన్నది. ఊర్లె ఎల్లయ్య బిడ్డ లగ్గం అయితుంటే.. ఎైట్లెతదో సూద్దాం వాని ఇజ్జత్‌ పోవాలె అని చూస్తున్నరు. మనోడే.. మన తమ్ముడే.. మన అన్ననే.. అనుకొని సాయంచేద్దామన్న ముచ్చట తక్కువ ఉన్నది. అది పోవాలె. మనం కూడా కలిసి పైకి రావాలనే తత్వం బాగా నేర్చుకోవాలె. హుజూరాబాద్‌కు వచ్చి దళితబంధు పెట్టాలని బండా శ్రీనివాస్‌ వాళ్లు అడిగిన్రు. కానీ అక్కడ పెడితే ఎక్కువమంది మోపైతరు. ఇట్ల వివరంగా చెప్పొస్తదా? ఇక్కడ మీరు సైలెన్స్‌గా ఉన్నరు కాబట్టి నేను చెప్పింది మీకు.. మీరు చెప్పేది నాకు అర్థమైతున్నది. అక్కడికొస్తే లొల్లి లొల్లి ఉంటది. ఆ బస్తీ బిడ్డలకు అర్థం కాదు. దాని కోసమే మిమ్ములను ఇక్కడికి పిలిపించుకొని చెప్తున్న. నేను చెప్పే విషయాలను మీరు రాసుకొని, మళ్లా ఊర్లల్ల అందరికీ అర్థమయ్యేటట్టు వివరించి చెప్పాలె.

దళిత యువతకే పనుల బాధ్యత..

దళితుల సమస్యలు ప్రాంతాల వారీగా వేర్వేరుగా ఉన్నా కొన్ని మాత్రం అందరూ, అన్ని చోట్ల ఎదుర్కొంటున్నవి ఉన్నాయి. ముందుగా వాటిని గుర్తించాలి. హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచే వాటి గుర్తింపు ప్రారంభం కావాలి. మిషన్‌భగీరథ ద్వారా ఇప్పటికే 96 శాతానికిపైగా ఆవాస ప్రాంతాలకు నీళ్లు అందిస్తున్నాం. కొన్నిచోట్ల నీరందడం లేదు. అందుకు వీణవంక మండలం కనపర్తి, హుజూరాబాద్‌ మండలం చెల్‌పూర్‌ గ్రామాలు ఉదాహరణ. మోరీలు, వీధిదీపాలు, రోడ్లు తదితర మౌలిక వసతులు లేని దళితవాడలున్నాయి. ప్రతి దళితవాడలో ఉన్న సమస్యలన్నింటినీ సేకరించాలి. హుజూరాబాద్‌లోని మొత్తం దళితవాడల మ్యాపును సిద్ధం చేయాలి. నెమ్మదిగానైనా సరే సమగ్ర వివరాలను సేకరించాలి. ఆ వివరాలను క్రోడీకరించి అర్బన్‌, రూరల్‌ ఏరియాల్లోని దళితుల మధ్య పేదరిక వ్యత్యాసాన్ని, కాలనీల్లో ఉన్న మౌలిక వసతుల్లోని తేడాలను గుర్తించాలి. ప్రాధాన్య క్రమంలో గ్రామపంచాయతీ, ఉపాధిహామీ, ఎస్సీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ వంటి వాటిద్వారా నిధులను సద్వినియోగం చేసుకొని దళితవాడల్లో సకల వసతులను కల్పించాలి. ఇందులో దళితవాడల్లోని యువకులను భాగస్వామ్యం చేయాలి. వారి కాలనీ పనులను వారికే అప్పగించాలి.

ఫ్రెండ్‌షిప్‌ బ్యాంకు పెట్టిన

నేను సిద్దిపేటలో ఉన్నప్పుడు ఫ్రెండ్‌షిప్‌ బ్యాంకు పెట్టిన. అమ్మాయి పెళ్లి ఉందనుకోండి. తలా ఇంత ఇస్తే మూడు లక్షలు అయితయి. పరస్పర సహకారం. ఇలా ఎన్నో ఆవిష్కరణలు ఉంటయి. ఐకమత్యం ఉండాలి. ఇందులో తప్పకుండా వంద శాతం విజయం సాధిస్తం. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ప్రభుత్వమే అండదండగా ఉంటుంది. మీ దగ్గర కావాల్సింది ఐకమత్యం, ప్రేమ గుణం ఉండాలి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. అందరం బాగుపడితే మనకు ఆనందమైతది. గొప్ప శక్తి అయితది. గొప్ప ఐక్యత ఉంటది. కొనసాగుతది. ఒక్క ఏడాది గట్టిగ పనిచేస్తే ఊరోళ్లు వచ్చి మీ దగ్గర అప్పు తీసుకుంటరు. చైతన్యం, విద్య, పద్ధతులు నేర్పి ఇలా తయారుకావడం పెద్ద విషయం కాదు. ఇలా అయినవి చాలా ఉన్నయి. ఎన్నో ఆలోచనలు ఉన్నయి. గొప్ప మార్గదర్శనం చేస్తం.

భూ సమస్యలు ఉండొద్దు

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఏ ఒక్క భూసమస్యా ఉండకూడదు. దళిత బంధు, దళితవాడల్లో వసతుల కల్పన ఏకకాలంలో కొనసాగడానికి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలి. అందుకోసమే సమర్థుడైన కలెక్టర్‌ కర్ణన్‌ను ఖమ్మం నుంచి బదిలీచేసి మరీ ఇక్కడికి తీసుకొచ్చాం. ఆయన సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలి. అసైన్డ్‌ పట్టా భూ యజమాని చనిపోతే ఆ భూమిని ఆయన వారసులకు రిజిస్టర్‌చేయాలి. గ్రామకంఠం పరిధిలో దళితుల ఆధీనంలో ఉన్న భూములపై సమగ్ర వివరాలను తయారుచేయాలి, వారి ఆధీనంలో ఉన్న వాటికి పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలి. లావుణి పట్టా పరిధి ఎన్ని సంవత్సరాలుండాలి? 10, 15 సంవత్సరాలకు అమ్ముకోవచ్చా, దానిని ఎలా చేయాలనే దానిపై ఆలోచిస్తున్నాం. ధరణితో 99% సమస్యలు పరిష్కారమయ్యాయి. ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ధరణిలో పేరు వచ్చిందంటే ఎవ్వరు మార్చలేరు. గ్రామ కంఠంలోని దళిత భూములను డిక్లేర్‌ చేయాలి. దళితులతో పాటు మిగతావారిది చేయాలి. ఓనర్‌షిప్‌ అందరికీ రావాలి. మఠంపల్లి అనే ఊరు ఉంది. రోజు గొడవలే, రోజు పోలీసు కేసే. 90 ఎకరాల భూమి 300 మందికి పట్టాలు. గందరగోళం. సర్వే చేయరు, పొజిషన్‌ చూపరు. ఇప్పుడు భూములా.. కొనిచ్చే పరిస్థితి కాదు. నేను సీఎం అయినంక రివ్యూ చేస్తున్నం. ఎస్సీలకు లేదా వేరే వారికి ప్రభుత్వ భూమి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కొనివ్వడం పద్ధతి. దీని మీద ప్రతిపక్ష నేతలు ఎందుకు భూములు ఇస్తవు అని అడిగారు. ప్రభుత్వం పర్పస్‌తో చేస్తది. ఆర్థిక, సామాజిక మద్దతు వారికి కావాలి అని ఇస్తున్నం అన్న. అప్పటి నుంచి భూమి కొనిచ్చినా, అసైన్డ్‌ ఇచ్చినా కనీసం మూడు ఎకరాలు ఉండేలా చూడాలని చెప్పిన. కానీ ప్రతిపక్షాలు మాత్రం కేసీఆర్‌ ప్రతి ఇంటికీ మూడు ఎకరాలు ఇస్తానన్నడు అని ప్రచారం చేశారు. అది తప్పు. ఎప్పుడు ఇచ్చినా మూడు ఎకరాలు ఇవ్వాలన్న. ఇప్పటికి పదహారున్నర వేల ఎకరాలు ఇచ్చినం. ఇచ్చిన ప్రతి ఒక్కరికీ 3 ఎకరాలు ఇచ్చినం. వారు బ్రహ్మాండంగా చేసుకుంటున్నరు.

ఇండ్లు లేకుండా ఒక్క కుటుంబం ఉండొద్దు

హుజూరాబాద్‌లో ఇల్లు లేకుండా ఒక్క దళిత కుంటుంబం ఉండవద్దు. ఎంతమందికి ఇండ్లు లేవు? అందులో సొంత జాగాలు ఉన్నది ఎంతమంది? లేనివారు ఎంతమంది? అనే జాబితా రూపొందించాలి. జాగలు లేని వారికి ప్రభుత్వమే డబుల్‌ బెడ్‌రూం ఇంటిని కట్టిస్తది. జాగలున్న దళితులకు ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం అందిస్తది. దళితుల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తెలంగాణ సర్కారు దేశంలో ఎక్కడాలేని విధంగా గతంలోనే కంటివెలుగు కార్యక్రమాన్ని అమలు చేసింది. అదే తరహాలో ఇప్పుడు కూడా దళితవాడల్లో ఉన్న వ్యాధిగ్రస్థులందరినీ గుర్తించాలి. ఎలాంటి వ్యాధి ఉన్నా, ఎంతఖర్చయినా సరే వారికి ప్రభుత్వమే చికిత్స చేయిస్తుంది. అన్ని కార్యక్రమాల కలయికగా దళితబంధును ముందుకు తీసుకుపోయినప్పుడే, అద్భుతమైన విజయం సాధిస్తాం.

రక్షణ నిధి ఏర్పాటు

గట్టిగ అనుకొని అందరం కలిసి చేస్తే కొన్ని పనుల్లో సక్సెస్‌ అవుతాం. కొన్నేమో మన చేతిలో లేవు. మనల్ని కాదని కూడా మన గురించి కొంత జరుగుతది. తొవ్వ పట్టుకొని పోతాంటే యాక్సిడెంట్‌ అయితది.. లేదా ఏదైనా జబ్బే వస్తది.. ఎప్పుడేం అయితదో చెప్పలేం కదా. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం దెబ్బ తింటది. కానీ అట్ల దెబ్బ తిననీయం. ఈ స్కీమ్‌లో రెండో మంచి బ్యూటిఫుల్‌ పద్ధతి అదే.

ఈ పథకంలో లబ్ధి పొందిన కుటుంబాలు పైకి రావాలి. మళ్లీ కిందికి పోవద్దు. ఈ స్కీంలో ఒక్కొక్కరు పది వేలు బ్యాంకులో జమచేయాలి. అంటే స్కీంను పది లక్షల పదివేలు చేసుడా.. పది లక్షల్లో నుంచే పదివేలు చెల్లించుడా చూడాలి. హుజూరాబాద్‌లో 20 వేల దళిత కుటుంబాలు లబ్ధిదారులుగా ఉన్నాయనే అనుకుందాం. ఒక్కొక్కరు రూ.10వేలు జమ చేస్తే, 20 కోట్లు అయితది. దీనికి తోడుగా ప్రభుత్వం రూ.20 కోట్లు జమ చేస్తది. మొత్తం రూ.40 కోట్లు అయితది. శాశ్వతమైన దళిత రక్షణ నిధి ఇది. ఇవి మీ దగ్గరే బ్యాంకులో ఉంటయి. నియోజకవర్గంలో కమిటీ ఉంటది. కలెక్టర్‌ మానిటరింగ్‌ ఉంటది. లబ్ధిదారులకు ఎవరికైనా బీమారు, ఆపద, యాక్సిడెంట్‌ అయితే వారికి ఈ రక్షణ నిధి పనికొస్తది. మీరు చేసే వ్యాపారం నుంచి సంవత్సరానికి ఒకసారి వెయ్యి రూపాయలు జమచేయాలి. ఇవి పర్మినెంట్‌గా మీకే ఉంటయి. మన సమాజంలో ఎవ్వరూ కిందికి పోవద్దు. పోనియ్యం. ఆపదలో ఆదుకుంటాం. ఎవరికి ఇవ్వాలనేది మీరు నిర్ణయించుకోవాలె. డబ్బులు హుజూరాబాద్‌ బ్యాంకులోనే ఉంటయి. ఇంతకంటే ఉన్నతమైన ఆలోచన ఉంటే చేద్దాం. బ్యాంకులో వేసిన వాటికి వడ్డీ కూడా వస్తుంది. ఇది వంద శాతం మంచిగా ఉంటది. హుజూరాబాద్‌ గొప్పగా చేస్తే హుస్నాబాద్‌ల అలకగా అయితది. ఒక దగ్గర జరిగిందంటే ఆగదు.

ఈ పథకం తప్పకుండా విజయవంతమైతది

రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబం బాగుండాలనే నా ఆకాంక్ష. అందరూ బాగుపడుతున్నప్పుడు దళితులెందుకు బాగుపడకూడదు. ఎందుకంటే ఇందుకు ఆర్థిక సహకారం కావాలంటరు. ఇప్పుడు ప్రభుత్వం అదే చేస్తుంది. ఇప్పుడిస్తున్న ఆర్థిక సహకారాన్ని ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి. వారి భవిష్యత్‌ను వారు నిర్మించుకోవాలి. ఈ స్కీంలో ఫలానా పనేచేయాలనే నిబంధనలేమీ లేవు. వారికి ఇష్టమున్న పని చేసుకోవచ్చు. ఎందులో పది రూపాయలు వస్తాయో మీకు తెలుసు. తొందరగా మనం పెట్టుబడి పెట్టిన డబ్బులు వచ్చే విధమైన పనులు చేసుకోవాలి. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఇంతకుముందు ఏ రకమైన పనిచేశారో ఏ రంగంలో అయితే అనుభవం ఉన్నదో, ఉద్యోగం చేశారో వాటికి సంబంధించిన వ్యాపారాలు పెట్టుకుంటే మీకు సులువు అవుతది. ఇవన్నీ జరగాలంటే ముఖ్యంగా కావాల్సింది.. మన ఐక్యమత్యం. మీకు తోడుగా రీసోర్స్‌ పర్సన్స్‌ ఉంటారు. వారికి కావాల్సిన గైడ్‌లైన్స్‌ ఇస్తారు. తెలంగాణలో దళితసమాజం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. రైతుబీమా, రైతుబంధు తరహాల్లో దళితబందుకు కూడా ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎవరు కూడా దళారులను ఆశ్రయించకుండా చేయాలి. అందుకు ఎలాంటి మెకానిజమ్‌ చేయాలో ఎస్సీ కార్పొరేషన్‌, మంత్రిత్వ శాఖ ఆలోచన చేయాలి.

సీఎం ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు

  • కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పేదవారిలో మెజార్టీ దళితులే ఉన్నారు.
  • దళితబంధుతో తెలంగాణ ఎకానమీ కూడా పెరుగుతుంది.
  • ఎస్సీ క్యాటగిరీలో ఉన్న అన్ని కులాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఉపకులాలవారిని కూడా దృష్టిలో పెట్టుకొని పథకాన్ని రూపొందించాం.
  • దళితుల కాలనీల్లో రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, ఆర్టీసీ బస్సుల సమస్యలు ఉన్నాయి. వీటిని కలెక్టర్‌ ఆధ్వర్యంలో అధికారులు పరిష్కరించాలి.

దళిత బీమాకు సానుకూలమే

  • తెలంగాణ దళిత బీమా పథకం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలమే. అయితే, ఎలా ఇవ్వాలి? అమలు ఎలా అన్నదానిపై మరింత చర్చ చేసుకుందాం. దళిత ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఇంటి పెద్ద చనిపోయినపుడు ఆ కుటుంబం వీధినపడకుండా ఉండాలంటే ఈ తరహాలో ఒక బీమా సౌకర్యం ఉండాలి. దీనిపై అధికారులు కసరత్తు చేస్తారు. పథకాన్ని అమలు చేసుకుందాం.
  • దళిత బంధు పథకాన్ని ఆషామాషీగా తీసుకోవద్దు. పథకం అమలు తీరుతెన్నులను అధికారులు ఎప్పటికప్పుడు ఫాలోఅప్‌ చేస్తారు. దళితబంధు లబ్ధిదారులకు ఒక చిప్‌కార్డును ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నది. ఈ కార్డుతో వారిని ట్రాక్‌ చేస్తాం.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana