e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home Top Slides పేదరికానికి చెల్లు

పేదరికానికి చెల్లు

పేదరికానికి చెల్లు
  • దళితబంధు కుటుంబంలో కడగండ్ల మాటే ఉండదు
  • ఆ పది లక్షలకు కుటుంబ పెద్దే ఓనరైతడు
  • బ్యాంకు కిస్తీలు, ఈఎంఐలు కట్టనక్కరలేదు
  • దళితబంధుకు సపోర్టివ్‌ స్ట్రక్చర్‌ ఉంటుంది
  • ఆ పైసలు ఎందుకు, ఎట్ల ఖర్చు చేసిండో చూస్తం
  • ప్రత్యేకంగా జిల్లాకో రక్షణ నిధి ఏర్పాటు చేస్తం
  • ప్రభుత్వం, లబ్ధిదారుల కంట్రిబ్యూషన్‌ ఉంటది
  • రైతుబంధు మాదిరిగానే ఇదీ సక్సెస్‌ అయితది
  • కౌశిక్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్తు ఉంటది: సీఎం

దళితబంధులో రూ.10 లక్షలు తీసుకున్న వారికి ఒక కార్డు ఇస్తాం. అందులో ఓ చిప్‌, బార్‌ కోడ్‌ ఉంటది. తీసుకున్న వాళ్లను వదిలిపెట్టేదే లేదు.. ఆ పైసలతో ఆయన ఏం చేస్తుండు.. అవి ఉన్నయా? లేదా పప్పు పుట్నాలకు అయిపోయినయా? చూస్తాం. ఆ కుటుంబం ఎట్టి పరిస్థితుల్లోనూ కిందికి పోవద్దు. అటువంటి స్కీం డిజైన్‌ అవుతుంది. ఇక్కడ సపోర్టివ్‌ సిస్టమ్‌ తయారవుతుంది.

మన పుట్టుక అనేది ఇన్సిడెంటల్‌ (యాదృచ్ఛికం). ఎవడన్నా ఫలానా కులంలో పుట్టాలని దరఖాస్తు చేసుకొని పుడతడా? నేను ఫలానా కులంలో పుట్టాలని దేవునికి దరఖాస్తు పెడతనా? మనం పెట్టినమా? ఎక్కడ పుడతమనేది భగవంతుని దయ. కానీ మనం మనుషులం కదా.. పుట్టిన ప్రతివాడికి దుఃఖం ఉంటది. బాధ ఉంటది.. సంతోషం ఉంటది. ఓ కులపాయన ఓ తీరుగా. ఇంకో కులపాయిన ఇంకో తీరుగా నవ్వుతడా.. పుట్టుకకు.. కులానికి నిమిత్తం లేదు. మనుషులం ఎవరమైనా సరే పరస్పరం గౌరవించుకొని..ప్రేమించుకొని గొప్పవాళ్లం కావాలె.

- Advertisement -

-దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, జూలై 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ దళిత బంధులో భాగమైన కుటుంబం జన్మలోకూడా పేదరికంలోకి పోదని, ఏ ఇబ్బంది వచ్చినాసరే కిందికి పోకుండా ఉండేలా పథకాన్ని తయారుచేస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఎంతో ఆలోచించి, ఎంతోమంది మేధావులతో చర్చించి దీనిని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. రైతుబంధు మాదిరిగానే దళితబంధు పథకం సక్సెస్‌ అవుతుందని చెప్పారు. ప్రభుత్వం అందించే పది లక్షలకు దళితుడే ఓనరవుతాడని అన్నారు. ఆ డబ్బులతో ఏమి చేయాలో మార్గం చూపిస్తామని, అతడికి చేతనైన పనిచేసుకుంటడని చెప్పారు. ‘10 లక్షలతో ఒకాయన డజను పాడి పశువులను తెచ్చుకున్నడు అనుకుందాం. ఈఎంఐ కట్టాలే.. బ్యాంకు కిస్తీ కట్టాలే.. వానికింత వీనికంతా కట్టాలే అనే రంది ఉండదు. పాడి పశువులను తెచ్చిపెట్టుకున్న తెల్లారి నుంచి 20 లీటర్ల పాలు వస్తే.. ఆ పైసలు ఆయన బ్యాంకుల పడతయి.. ఎవరికీ ఇచ్చేది లేదు.

ఇదీ ఆ స్కీంలో ఉన్నటువంటి బ్యూటీ (గొప్పతనం)’ అని తెలిపారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ కాంగ్రెస్‌నేత పాడి కౌశిక్‌రెడ్డి బుధవారం తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. హుజూరాబాద్‌ నుంచి వచ్చిన వందలమంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, సింగిల్‌విండో చైర్మన్లు తదితరులు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వవిప్‌ బాల్క సుమన్‌, మాజీ ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌, కౌశిక్‌రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం, స్వరాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అందుకోసం పడిన తపన, తదితర అంశాలను వివరించారు. నేటి యువతదే రేపటి తెలంగాణ అని ఈ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..

రైతుబంధు సక్సెస్‌

రైతుబంధు పథకం తెచ్చినప్పుడు ఆర్నెళ్లు తలపగులగొట్టుకున్న.. రైతులకు ఏ విధంగా సహాయం చేయాలి? ఎట్ల చేయాలె? ఢిల్లీలో ఉండే ఫేమస్‌ ఆగ్రోఎకనామిస్ట్‌ అశోక్‌ గులాటీని సంప్రదించిన. చాలామంది మిత్రులు ఇంపోజ్‌ చేయొద్దని సలహా ఇచ్చిన్రు. అంటే ఎరువు బస్తాలిస్తా. పురుగు మందులిస్తా. విత్తనాలిస్తా అంటే అవి ఆ సమయంలో అక్కర ఉండకపోవచ్చని చెప్పిన్రు. పది రూపాయలిస్తవా.. పది పైసలిస్తవా.. ఎంతిత్తవో.. కానీ పైసలే ఇయ్యి అని సూచించారు. డబ్బులిస్తే ఆ రైతు దానికి ఓనరైతడు. అక్కరున్నది కొనుక్కుంటడు. ఎట్ల అవసరమో అట్ల వాడుకుంటరు అని చెప్పినారు. ఎక్జాక్ట్‌గా సక్సెస్‌ అయింది. ఇయ్యాల తెలంగాణ రైతులు కాలర్‌ ఎగురవేసి ‘ఏస్‌.. ఐయామ్‌ తెలంగాణ’ రైతు అని చెప్పుకుంటున్నరు. అట్లనే దళితుల గురించి కూడా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా చెప్పుకుంటరు.

నన్ను తిట్టినన్ని తిట్లు ఎవర్నీ తిట్టకపోవచ్చు

ఈ ప్రపంచంలో నన్ను తిట్టినన్ని తిట్టు ఎవర్నీ తిట్టకపోవచ్చు. నేను తెలంగాణ జెండా పట్టిననాడు ఈ బక్కపాణపోడు.. వీడేడ తెస్తడు తెలంగాణ అన్నరు. ఎవ్వడు ఏమన్నా అనుకోనీ.. ప్రస్థానం కొనసాగించుకుంటూ పోయినం. వాళ్ల కండ్లముందే.. వాళ్లందరి సాక్షిగా తెలంగాణ వచ్చింది. ఇయ్యాల కూడా ముందుకుపోయేట్టు మాట్లాడటంలేదు. రైతుబంధు పెట్టేటప్పుడు ఇది ముందరపడ్డప్పుడు చూద్దాంతీయ్‌ అన్నరు. ఇప్పుడది ముందర పడ్డదా? వెనక్కి అయిందా? ఎకరానికి 10 వేలు సక్కగ వచ్చి రైతు ఖాతాలో జమైతున్నయ్‌. అట్లనే అనేక రంగాల్లో మనం తీసుకున్న చర్యలు మంచి ఫలితాన్నిస్తున్నాయి.

దేవునికి దరఖాస్తు చేసుకొని పుట్టం

యాదవ, నాయిబ్రాహ్మణ, రజక, మైనార్టీ సోదరులు ఎవరైనా కావొచ్చు.. మనపుట్టుక అనేది ఇన్సిడెంటల్‌ (యాదృచ్చికం). పలానా కులంలో పుట్టాలి, పలానా మతంలో పుట్టాలి అని ఎవడన్నా దరఖాస్తు చేసుకొని పుడతడా? ఎక్కడ పుడతామనేది భగవంతుని దయ. పుట్టిన ప్రతివాడికి బాధ ఉంటది.. సంతోషం ఉంటది. పుట్టుకకు, కులానికి నిమిత్తం లేదు. ఎవరమైనా సరే పరస్పరం గౌరవించుకొని.. ప్రేమించుకొని గొప్పవాళ్లం కావాలే. ఓసారి సూరత్‌లో పెద్ద కలరా వచ్చింది. అక్కడున్న పెద్దపెద్ద వ్యాపారులు చార్టెడ్‌ ప్లయిట్లు తెప్పిచ్చుకొని, బిస్తరు సర్దుకొని పారిపోయిండ్రు. ఎక్కడిదక్కడ సల్లపడ్డంక మళ్లా వచ్చిండ్రు. అక్కడ మున్సిపల్‌ కమిషర్‌గా ఉన్న వెంకటేశ్వర్‌రావు అనే మన తెలుగాయన వాళ్లందర్ని పిలిచి సమావేశం పెట్టిండు. 15 అంతస్తుల బంగ్లా ఉండే.. అన్ని వదిలి పిచ్చోని లెక్క పారిపొయినవ్‌.. నీ బంగ్లా ఏం చేసింది.. నీ ఆస్తి ఏం చేసింది.. నీ వజ్రాలు ఏం చేసినయ్‌ అని అడిగిండు. ఊరినిండ దోమలుంటే గుడిసెల ఉన్నోన్ని మాత్రమే కుట్టి బంగ్లాలో ఉన్నవాన్ని కుట్టకుండా పారిపోతదా? ఊరు నిజంగా మంచిగుంటే ఆ ఊళ్ల మనం ప్రశాంతంగా ఉంటం. మొత్తం సమాజం మంచిగుంటే దేశమంతా సంతోషంగా ఉంటం.

ప్రతీపశక్తులు ఎప్పుడూ ఉంటాయి

రాజకీయాలు, ఎన్నికలు అన్నీ చిల్లర ముచ్చట్లు. ఓసారి గెలుస్తం. ఓసారి ఓడుతం. అదికాదు ఇక్కడ ఇంపార్టెంట్‌. రాజకీయపార్టీలో చేరడమనేది సామాజిక బాధ్యత. ఆ బాధ్యతను మనం ఎప్పుడైతే తలకెత్తుకుంటామో.. ఏ పాత్రయినా రావొచ్చు. రాజకీయపార్టీ అంటనే ఒక పెద్దపవర్‌. కొంతమంది సాంకేతికంగా పార్టీ అధికారంలో ఉండటమే గొప్ప అని అనుకుంటరు. దానికోసం అతిచేష్టలు చేస్తరు. అడ్డగోలుగా మాట్లాడుతరు.. ఏ రోజుకైనా మంచి మంచైతది. మనకు ఒర్రరాదా? తిట్టరాదా? ఇయ్యాల మొదలుపెడితే రేపటి దాకా తిట్టొచ్చు. సంస్కారవంతులు, బాధ్యతగలవారు, సంయమనం పాటించేవాళ్లు అట్ల తిట్టరు. ఏదైనా చెడుచేస్తే.. అట్ల కాదయ్యా ఇట్ల చెయ్యాలే అని విమర్శ చేస్తరు. అట్ల కాకుండా అడ్డగోలుగా ప్రతిదాన్ని విమర్శించి, వక్రీకరించి కోడిగుడ్డుమీద ఈకలు పీకరు. వీళ్లు ఎప్పటికీ ఉంటరు. వీటిని ప్రతీప శక్తులు (నెగిటివ్‌ ఫోర్సెస్‌) అంటరు. ఇవి ఆనాడు ఉన్నయి, ఇప్పుడు ఉన్నయి, రేపు కూడా ఉంటయి. మంచివారు, నిర్మాణాత్మకంగా పనిచేసేవారు ఇలాంటి వాళ్లకోసం తమ ప్రస్థానాన్ని ఆపరు. అదేపద్ధతిలో జరుగుతున్న తెలంగాణలో మేంకూడా పాత్ర వహిస్తాం.. మా శక్తిని కూడా దీనికితోడు చేస్తామనే మంచి ఆలోచన కౌశిక్‌రెడ్డి, ఆయన మిత్రులుచేయడం మంచి పరిణామం.

కరీంనగర్‌ సెంటిమెంట్‌ జిల్లా

కరీంనగర్‌ జిల్లా అంటే నాకు సెంటిమెంట్‌. మొట్టమొదటి సింహగర్జననే అక్కడ చేసినం. ఆ సభ నుంచే మన ప్రస్థానం మొదలైంది. రైతుబంధు పథకం కూడా అక్కడే ప్రారంభించినం. కరీంనగర్‌ టౌన్‌లో జరిగిన రైతు సదస్సులోనే రైతుబీమా ప్రకటించా. ఆ పథకాలు చాలా విజయవంతంగా, గొప్పగా జరుగుతున్నాయి. ఇప్పుడు చాలామంది కయ్య.. కయ్య.. కయ్య.. అని ఒర్లుతున్నరు. మరి మీ పార్టీ ప్రభుత్వాలు, మీ ముఖ్యమంత్రులు లేకుండేనా అధికారంలో? అప్పుడు ఎందుకు చెయ్యలేదు? మీ ప్రభుత్వాలల్ల పెట్టిన ఆపద్భంధులో రూ.50 వేలు ఇస్తే అందులో రూ.30 వేలు దొంగలే కొట్టేసేవాళ్లు. ఆర్నెల్లయినా డబ్బులు రాకపోయేది. మరి మేము ఇచ్చేది రూ.5 లక్షలు. దానికోసం దరఖాస్తు చేసుకునేది లేదు.. దఫ్తర్‌ పొయ్యేది లేదు. ఎవ్వరికీ రూపాయి ఇచ్చేది లేదు. స్ట్రెట్‌గా వచ్చి రైతుల ఖాతాలోనే పడ్తయి. ఆ కుటుంబానికి ఆ డబ్బులు ఎంతధీమా? ఇంట్లో ఒక అమ్మాయి పెండ్లి ఉన్నా, లక్ష రూపాయల అప్పు ఉన్నా, ఇంకోటి ఉన్నా అవి తీర్చుకుని దర్జాగా ఉంటారు. ఇప్పుడు మీ అదృష్టం.. దళితబంధు పథకం మీ దగ్గర వస్తున్నది.

అప్పుడు కానిది.. ఇప్పుడెట్లా మారింది

అవే ఊర్లు.. అదే మనుషులు.. అదే అధికారులు. మునుపు ఊర్లల్ల చెత్త తీద్దురా? పదేండ్లయినా అట్లే ఉండేది. బోరింగులు కూడా పూడ్చరు. అందులో పోరగండ్లు పడుడు. ఊర్ల ఒక్క చెట్టు ఉండెనా.. కొట్టుడు తప్ప పెట్టుడే లేకపాయే.. నౌకరి (ఉద్యోగం) పోతది బిడ్డా అని చెప్పిన. ఇప్పుడు పెడ్తలేరూ.. ఇయ్యాల చెట్లు నా కన్నా ఎత్తైయినయి. 12,769 పంచాయతీల్లో ట్రాక్టర్‌ ఉన్నది. ట్రాలీ ఉన్నది. నీళ్ల ట్యాంకర్‌ ఉన్నది. ప్రతిరోజూ చెత్త పోతుంది. ఏంది ఇయ్యాల చెత్తకు రాలేదని మహిళలే అడుగుతున్నరు. తారకరామారావుకు ఫోన్‌ చేస్తా అని అంటున్నరు. గ్రామాలన్ని పరిశుభ్రంగా ఉంటున్నయి.. దరిద్రపు డెంగీ, బెంగీ వ్యాధులు వస్తలేవు. ఇప్పుడు అన్ని గ్రామాల్లో 100 శాతం వైకుంఠధామాలు తయారైనయి. ఈ కనీస వసతులు కూడా కల్పించడంలో ఇంతకు ముందున్నవారు విఫలమైనరు. నేర్పడంలో, బుద్ధి చెప్పడంలో విఫలమయ్యారు కాబట్టే పల్లెలు మురికికూపాల లెక్క ఉండే. ఇప్పుడు పచ్చదనంతో, సీసీ రోడ్లతో ఎంత మంచిగున్నయి.

టీఆర్‌ఎస్‌ సన్నాసుల మఠం కాదు..రాజకీయ పార్టీ

దళితబంధు అమలుకు హుజూరాబాద్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకోవడం నియోజకవర్గ ప్రజల అదృష్టం. హుజూరాబాద్‌లో ఎలక్షన్‌ ఉన్నదనే హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టు పెట్టినవంట’ అని నిన్న ఒకడు నాతో అన్నడు. పెట్టమా మరి? గమ్మతున్నది. టీఆర్‌ఎస్‌ ఏమన్నా సన్నాసుల మఠమా? రాజకీయపార్టీనే కదా? కేసీఆర్‌ ఇవాళ పెద్ద పథకం తెచ్చి నడుపుతున్నడు అంటే, ఏశక్తి ఉంటే నడుపుతున్నడు? ముఖ్యమంత్రి పదవి ఉంటేనే కదా? టీఆర్‌ఎస్‌కు అధికారం ఉంది కాబట్టే కదా? రాజకీయంలో ప్రజలల్లో ఉన్నాం. డెఫినెట్‌గా మాది రాజకీయ పార్టీనే. కచ్చితంగా రాజకీయంగా లాభం జరిగేలా పెడతాం. ఎందుకు ఊరుకోవాలండి. ఏమీ చెయ్యనోడు లాభం జరగాలని కోరుకుంటాడు. కానీ, చేసినవాడు కోరుకోకూడదా? ఇదెక్కడి పంచాయితీ. ఎక్కడో ఒక నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టు కింద తీసుకోవాలి. మరి నేను అంత స్వార్థపరుడినే అయితే గజ్వేల్‌లోనే పెట్టుకునేవాడిని కదా?

జిల్లాకో ప్రత్యేక రక్షణ నిధి

దళితబంధు కింద ఇచ్చిన పైసలతో ఏం చేస్తున్నరు. అవి ఉన్నయా లేదా పుట్నాలకు అయిపోయినయా చూస్తూనే ఉంటాం. ఒక్కసారి డబ్బులిచ్చాక కుటుంబం పరిస్థితి కిందికి పోవద్దు. అటువంటి స్కీం డిజైన్‌ అవుతున్నది. రూ.10 లక్షలు ఇచ్చిన వారికి ఒక కార్డు ఇస్తం. అందులో ఓ చిప్‌ ఉంటుంది.. బార్‌కోడ్‌ ఉంటది. ఇక్కడ సపోర్టివ్‌ సిస్టమ్‌ తయారవుతుంది. ఎలాంటి ప్రమాదాలు వచ్చినా, ఆటంకాలు ఎదురైనా ఆ కుటుంబం కిందికి పోకండా నడిపించేందుకు ప్రత్యేక రక్షణ నిధిని ఏర్పాటుచేస్తున్నం. ప్రతి జిల్లాకు పెద్దమొత్తంలో డబ్బు ఉంటది. అందులో ప్రభుత్వంతోపాటు, వాళ్ల కంట్రిబ్యూషన్‌ ఉంటది. దీనిపై అజయాయిషీకి కమిటీ ఉంటది.. ఎవరికీ ఏ ఆపతి వచ్చినా వారు చూసుకుంటరు. ఈ పథకంలో ఒక్కసారి చేరిన ఫ్యామిలీ జన్మలో కూడా పేదరికంలోకి పోదు. పోనివ్వం. ఇలాంటి మంచి పనులు ఎవరు డిమాండ్‌చేసినా, చేయకున్నా.. పెద్దలు, మేధావులతో మాట్లాడి, ప్రభుత్వ అధికారులతో చర్చించి ఇంప్లిమెంట్‌ చేస్తున్నాం. 100 శాతం ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తున్న తెలంగాణ ఉజ్వలంగా ముందుకుపోతుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేదరికానికి చెల్లు
పేదరికానికి చెల్లు
పేదరికానికి చెల్లు

ట్రెండింగ్‌

Advertisement