e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home Top Slides కొన ముట్టేదాకా ముందుకు పోవాలె

కొన ముట్టేదాకా ముందుకు పోవాలె

  • దేశానికి ఆదర్శంగా దళితబంధు కావాలి
  • సమస్యలను అధిగమిస్తూ గెలవాలి
  • ప్రభుత్వం, అధికారులు మీవెంటే: సీఎం కేసీఆర్‌

దళిత సమాజంలోని పిల్లలు చాలామంది హాస్టళ్లలో, అక్కడా ఇక్కడా ఉంటూ కష్టపడి చదువుకున్నరు. అర్థంచేసుకొనే స్థాయిలో ఉన్నరు. ఇప్పుడు మన పని ఇంకా సులభమవుతది. నేను చెప్పిన విధంగా ఆ రోజు ఉన్నటువంటి దుర్మార్గం ఇప్పుడు లేదు. మనం కూడా బలవంతులమే.. మనకూ శక్తి ఉన్నదని మనోళ్లకు గుర్తు చేయాలి. యూత్‌, చదువుకున్న వాళ్లు కొంత స్ట్రగుల్‌ పడుతున్నరు. ఇక్కడ అన్నిటికంటే ముందు ఆత్మవిశ్వాసం పాదుకొల్పాలె.. అది నిరూపితం కావాలె. ఇంకో పది మందికి మార్గం చూపెట్టాలె.

హైదరాబాద్‌, జూలై 26 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకాన్ని విజయవంతం చేయడానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన దళితబంధు సదస్సులో సీఎం చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘మనం పెట్టుకున్న కథేందంటే.. పైకి వద్దామా? వద్దా? మన రాష్ట్రంలో కూడా చేసి చూపిద్దామా? వద్దా? ఎప్పటికైనా గిట్లనే ఉందామా? కాదు గిట్ల చేసుకోవాలని ఓ మోడల్‌గా చూపిద్దామా? మీకు మళ్లొక్కసారి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా! మీరు పాల్గొంటున్నది ఉద్యమం. మీరు ఏమన్న ఎటమటం చేసినారంటే మొత్తం కొంప ముంచుకుంటది సుమా! మీరు ఎవరెవరైతే పనిచేయడానికి నడుం బిగించి ముందుకొచ్చిండ్రో.. నచ్చకపోతే ఇప్పుడే వెనక్కి పోవాలె. లేదంటే ధైర్యంగా ముందుకు పోవాలె. ఎత్తుకున్నమంటే ఎనక్కి చూడొద్దు. సిపాయిలా ఎత్తుకున్నమంటే అది ఏమన్నగానీ.. కొనముట్టేదాక పోవాలే. చాలా మొండిగా.. దృఢ సంకల్పంతోని.. ధైర్యంగా ముందుకు పోవాలె. చిన్న చిన్న సమస్యలుంటయి. కొన్ని శక్తులు కాచుకొని ఉంటయి. ఇంతకుముందు అలవాట్లన్నీ వేరుగా ఉండెకదా. గవర్నమెంట్‌ ఏదైనా కార్యక్రమం ప్రారంభించిందంటే చాలు.. ఆ ఇగ మనిషికో ఐదువేలు తియ్యండి అంటరు. అన్ని ఊర్లలో ఉంటరు కదా పైరవీకారులు. ప్రతి బస్తీల.. ప్రతి ఊర్ల ఉన్నరు ఈ దోపిడీగాళ్లు. ఆ పథకాన్ని ముందటపడనియ్యరు. మొదలు మనం ఆ దుర్మార్గుల బారి నుంచి బయటపడాలి.

సర్కారే మీ వెంట ఉంటది. భయం వద్దు

- Advertisement -

మనం గట్టిగా ఓ నిర్ణయానికి రావాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యం సాధించవచ్చు. సర్కారే మీ వెంట ఉంటది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మనలో మనకు గొప్ప శక్తి ఉన్నది. కానీ మనకు తెలియదు. ఏ.. మన కర్మ గింతే. బాగుపడతమా.. అయ్యేదా.. పొయ్యేదా.. ఏ.. మత్తుగంటరు కానీ చేస్తన్రా.. అని అనుకోవద్దు. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఏ ఊరికి పోయినా జీతగాళ్ల పైసలు ఇప్పియ్యాలని దరఖాస్తు పెట్టుకొనేవారు. ఇదేందని తెలుసుకొని మా కలెక్టర్‌ను పిలిచి మా నియోజకవర్గానికి ఈ బానీలివర్‌ సిస్టం వద్దని చెప్పి బావులు తవ్వుకునేందుకు పైసలు ఇవ్వాలని చెప్పి, ఆ స్కీంను ప్రవేశపెట్టిన. ఆ తర్వాత గ్రామాలకు వెళ్లి దళితులతో మాట్లాడిన. ఇగ జీతగాళ్ల పైసలు బందయినయి.. బావులు తవ్వుకోండి అని చెప్పిన. ‘ఆ ఇగ బాయిలు తవ్వి పటేళ్లం అయితం తియ్‌’ అని అన్నరు. బాయిలు తవ్వనే తవ్వబోమని నిర్ణయానికి వచ్చిండ్రు. మా కర్మ గింతేలా అనే ఒక రకమైన నిర్వేదానికి, నిరాశకు గురయ్యారు. ఇది 30 ఏండ్ల కిందటి ముచ్చట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దళిత సమాజంలోని పిల్లలు చాలామంది హాస్టళ్లలో, అక్కడా ఇక్కడా ఉంటూ కష్టపడి చదువుకున్నరు. అర్థంచేసుకొనే స్థాయిలో ఉన్నరు. ఇప్పుడు మన పని ఇంకా సులభమవుతది. నేను చెప్పిన విధంగా ఆ రోజు ఉన్నటువంటి దుర్మార్గం ఇప్పుడు లేదు. మనం కూడా బలవంతులమే.. మనకూ శక్తి ఉన్నదని మనోళ్లకు గుర్తు చేయాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో వాడొగడు వీడొగడు నన్ను తిట్టిండ్రు. కేసీఆర్‌ ఏం చేసిండని అన్నరు.

ఆత్మవిశ్వాసం పాదుకొల్పాలే

యే మనం గింతే లే.. అది మనకు ఏడ అయితది. మనం ఏడ ఎదుగుతం.. మనం గింత వరకే చదువుకోవాలే.. అనే లెక్కల కొందరున్నరు. కొందరు యువకులేమో పోరాడుదాం. పైకి వచ్చే ఉపాయం చేద్దాం అని తండ్ల్లాడుతున్నరు. యూత్‌, చదువుకున్న వాళ్లు కొంత స్ట్రగుల్‌ పడుతున్నరు. ఇక్కడ అన్నిటికంటే ముందు ఆత్మవిశ్వాసం పాదుకొల్పాలె.. అది నిరూపితం కావాలె. ఇంకో పది మందికి మార్గం చూపెట్టాలె. ఎట్ల ఉండాలె ఈ స్కీం? ఇవాళ పాల డెయిరీ చాలా లాభం ఉన్నది. సపోజ్‌ నాకు 10 లక్షలు వచ్చినయి. నేను ఓ 12 బర్లు తెచ్చి పెట్టుకున్నా. ఊరువాళ్లు సులభంగా చేసుకునే పని. మీ దగ్గర చాలా బలమైన డెయిరీ ఉన్నది. కరీంనగర్‌ డెయిరీ అని. రూ.365 కోట్లు ఆదాయం వస్తున్నది. దానికి పాలుపోసే రైతులకు లీటరుకు డబ్బులు ఎక్కువ ఇస్తున్నరు. రైతు ఇంట్లో ఆడపిల్ల పెండ్లికి పుస్తెమట్టెలు, చదువుకునే పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, రైతు చనిపోతే ఇన్సూరెన్స్‌.. ఇట్ల మస్తు స్కీములు ఉన్నాయి. నేను ఈ మధ్యలనే వాళ్లతో మాట్లాడిన. హుజూరాబాద్‌ నుంచి పెద్ద ఎత్తున పాలు వస్తే తీసుకుంటరా? అని అడిగిన. దానికి వాళ్లు ఇంకో 50 వేల లీటర్ల పాలు వచ్చినా తీసుకుంటం అని చెప్పిన్రు. అక్కడ పాలు పోసేది దళితులు కాబట్టి ప్రోత్సహించాలని కోరితే, తప్పకుండా డబ్బు ఎక్కువ వచ్చేలా చూస్తమన్నరు. ఆ డెయిరీకి పాలు పోస్తున్న రైతులకు కూడా మంచి సంపాదన ఉన్నది. ఒకాయిన నెలకు రూ.లక్ష సంపాదిస్తున్న అని చెప్పిండు.

ఏం చేయాల్నో నువ్వే నిర్ణయించుకోవాలె

ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల్లో పది పైసలు కూడా వేస్ట్‌ కావొద్దు. అట్లా కావొద్దంటే ఇంతకుముందటి లెక్క కొద్దిగా భిన్నంగా జరుగాలె. పైసలు ఇచ్చి అవతల పడుడు కావొద్దు. ఆ డబ్బుతో కుటుంబం మొత్తం బాగుపడాలె. ఇటు ప్రభుత్వ అధికారులు కరెక్ట్‌గా పనిచేయాలె. అటు బస్తీలల్ల ప్రజలు కాపలాదారుల లెక్క ఉండాలె. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించుడే తప్ప ఫెయిల్‌ కావొద్దని చూస్తున్నం. హైదరాబాద్‌ల మార్వాడీవోళ్లకు రూ.10 లక్షలు ఇస్తే రెండేండ్లల్ల రూ.30 లక్షలు చేస్తరు. ఎందుకంటే.. ఇది చెయ్యి అని వాళ్లకు చెప్పే అక్కర లేదు. వాళ్ల దగ్గర ఆ విద్య ఉన్నది. మరి మనోళ్లకు ‘ఆ రూ.10 లక్షలు తీసుకోని ఏం చేయాలె?’ అనేది పెద్ద బలహీనతగా ఉన్నది. దాన్ని మనం అధిగమించాలె. నువ్వు ఏం చేయాల్నో నువ్వే నిర్ణయించుకోవాలె. ఉదాహరణకు ఒకాయిన బట్టల దుకాణంల పనిచేస్తున్నడు. మంచి అనుభవం ఉన్నది. బట్టల దుకాణం పెడితే బాగైతం అనుకుంటే పెట్టుకోవాలె.

మీకిచ్చే పది లక్షలు పిల్లలు పెడుతాయ్‌..

ఇందాక చెప్పినట్లు పది లక్షలతో ఓ డజన్‌ బర్లు తెచ్చుకున్నా. అందులో సగం కడుతయ్‌. సగం పాలు ఇస్తయ్‌. ఒక ఆరు బర్లు పొద్దున మాపు కలిసి ఐదు లీటర్లు ఇచ్చినా.. మొత్తం 30 లీటర్ల పాలు వస్తయి. 30 లీటర్లు నేను డెయిరీకి పోసిన అనుకో.. లీటర్‌కు రూ.40 అయినా రూ.1200 వస్తయి. ఇంతకుముందు బ్యాంకు కిస్తీలు కట్టాలె. కానీ ఇప్పుడు రోజుకు రూ.1200 వస్తే ఆ మొత్తం నీకే ఉంటది. బ్యాంకుల వేసుకుంటవ్‌. నెలకు ఓ 36 వేలు వస్తయి. ఇంకేం కావాలె? ఒక ఏడాది గట్టిగ పని చేసిన్రనుకో 4 లక్షలు అయితయి. ఈ పది లక్షలు 4 లక్షల పిల్లలు పెడుతున్నయి. నువ్వే నాలుగు లక్షలకు అధిపతి అయితవ్‌. అప్పుడు నమ్మకం పెరుగుతది. ఆ పరిస్థితి రావాలె. ఏ పనులు పెట్టిచ్చినా కూడా అలాంటి పనులకు పెట్టియాలె. మీ దగ్గర వ్యవసాయం బాగున్నది. మీ దగ్గర ఎట్ల ఉందో రాష్ట్రం అంత అట్లనే ఉన్నది. దండిగ పైసలు దొరుకుతున్నయి వ్యవసాయ యంత్రాలపై. హార్వెస్టర్లు, ట్రాక్టర్లు రకరకాలు కొనుక్కోవచ్చు. మనం సూచనలు చేసి ఐడియా ఇవ్వాలె. ఒకాయనకు ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ వస్తది కావచ్చు. సొంతంగ లేదు. డ్రైవర్‌గా పని చేస్తే కొంత జీతం వస్తే బతకాలె. ఆయన బండి ఆయనకే ఉంటే. నెలకో రూ.15 వేలు, రూ.20 వేలు పని దొరికినా సంతోషంగా చేసుకుంటడు. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతడు. మన బస్తీలోల్లను కూస పెట్టుకొని మాట్లాడితే అనేక ఆలోచనలు వస్తయి. వాటిని క్రోడీకరించి అధికారులకు చెప్పాలి.

బ్యాంకుల గోస ఉండదు..

దళితుల్లో విశ్వాసం రావాలె. నిజంగా ముందుకు పోవాలి. ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్‌ స్కీమ్‌లు ఉండేది. కానీ అక్కడ బ్యాంకు లింకు ఉండేది. నాలుగు రూపాయలు వస్తయని అనుకుంటే, రుణం తీసుకున్న తెల్లారే కిస్తీ కట్టాలే. డబ్బు లేకపోతే వాడు గుంజుకపోతడు. దళితబంధు పథకంలో బ్యాంకు లింకు ఉండదు. పది లక్షలు నేరుగా ప్రభుత్వం మీకే ఇస్తది. ఈ స్కీమ్‌ ఫలితం ఎట్ల ఉండాలె? మీరే ఆలోచన చేయాలి. మీరు పోయినంక మీరు చెప్పింది విని మీ బస్తీల్లో వాళ్లు గొప్పగా ఆలోచించాలి. బ్యాంకు లంపటం లేదు కాబట్టి. వారం పది రోజుల్లోనే ఆదాయం వచ్చే స్కీమ్‌లను మనం ఎంచుకోవాలె.

ప్రతి పైసా సద్వినియోగం

దళితబంధు ప్రతి పైసా సద్వినియోగం కావాలి. అందరు ఒక్కటై రావాలి. పథకం వినియోగం సంపూర్ణంగా జరగాలి. దళిత వాడల్లో మౌలిక సదుపాయాల కల్పన జరగాలి. డబ్బులు చాలా ఉన్నాయి. ఎందుకు ఇంకా ఆ డబ్బులు దళిత వాడలకు పోతలేవు? పంచాయతీ, నరేగా, స్టేట్‌ డబ్బులు, ఫైనాన్స్‌ కమిషన్‌ ఇలా చాలా ఉన్నాయి. దీనిపై క్యాబినెట్‌లో చర్చిద్దాం. అవకాశం ఉన్న తర్వాత కూడా పనులు ఆగిపోవడం బాధాకరం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana