గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 00:37:03

పాల ఉత్పత్తి పెంపుదల ముఖ్యం

పాల ఉత్పత్తి పెంపుదల ముఖ్యం
  • చర్యలు చేపడుతామన్న మంత్రి తలసాని

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.  మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్‌లోని మంత్రి కార్యాలయంలో శుక్రవారం పాలసేకరణ పెంపునకు చేపట్టాల్సిన చర్యలు, కృత్రిమ గర్భధారణ అమలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాల సేకరణ పెంచేందుకు పశుసంవర్ధక, పశుగణాభివృద్ధి, డెయిరీ అధికారులతో జిల్లాలవారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటుచేయాలని చెప్పారు. డెయిరీలో దీర్ఘకాలం ఒకేచోట ఉన్నవారిని 10 రోజుల్లో బదిలీచేయాలని ఆదేశించారు. గోపాలమిత్రల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. నవంబర్‌ 2014 నాటికి విజయ డెయిరీ పాల సేకరణ 1.27 లక్షల లీటర్లుంటే, సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో లీటరుకు రూ.4 ప్రోత్సాహకం ప్రకటించడంతో రోజుకు 4.7 లక్షల లీటర్లకు పాలసేకరణ పెరిగిందని అన్నారు. 


ఇటీవల తగ్గడంపై మంత్రి అసహనం వ్యక్తంచేశారు. కృత్రిమ గర్భధారణ ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని, నాణ్యమైన పాడిబర్రెల ఉత్పత్తికి 8 లక్షల డోసుల వీర్యం కరీంనగర్‌ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నట్టు మంత్రి వివరించారు. పశువుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి 37.16 లక్షల ఆరోగ్యకార్డులను పంపిణీచేసినట్టు చెప్పారు. 22 లక్షల గేదెలకు జియోట్యాగ్‌ చేసినట్టు  తెలిపారు. సమావేశంలో డెయిరీ కార్పొరేషన్‌ చైర్మన్‌ లోక భూమారెడ్డి, టీఎస్‌ఎల్డీఏ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనితారాజేంద్రన్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ వీ లక్ష్మారెడ్డి, టీఎస్‌ఎల్డీఏ సీఈవో  మంజువాణి, డెయిరీ ఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>