బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 02:38:27

గ్రేటర్‌వరంగల్‌లో రోజూ తాగునీరు

గ్రేటర్‌వరంగల్‌లో రోజూ తాగునీరు

  • ఉగాది నుంచి సరఫరా ప్రారంభం
  • త్వరలో 800 డబుల్‌ ఇండ్ల ప్రారంభం
  • నల్లా కనెక్షన్‌ లేనివారికి కొత్త కనెక్షన్‌
  • పట్టణప్రగతి ద్వారా నగరానికి 81 కోట్లు
  • సమీక్షలో మంత్రి కే తారకరామారావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రానున్న ఉగాది నుంచి వరంగల్‌ గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రజలకు ప్రతిరోజు తాగునీటిని సరఫరాచేస్తామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన మౌలిక వసతుల పనులు వేగవంతంచేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ కార్యక్రమాలపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ అర్బన్‌ ద్వారా వరంగల్‌ నగరంలో తాగునీటి సరఫరాకు అనేక చర్యలు తీసుకొన్నట్లు తెలిపారు. ఇందుకోసం వెయ్యి కోట్లను ఖర్చుచేశామని పేర్కొన్నారు. గతంలో కేవలం 30 ఎంఎల్‌డీల నీటి సరఫరా నగరానికి ఉంటే, ప్రస్తుతం 168 ఎంఎల్‌డీకి పెరిగిందన్నారు.

గతంలో 1,400 కిలోమీటర్ల పైపులైన్లు ఉంటే దీనికి అదనంగా మరో 1,400 కిలోమీటర్లు పైప్‌లైన్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ఇంకో 500 కిలోమీటర్ల పైప్‌లైన్ల నిర్మాణం కూడా త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు. 2,048 వరకు వరంగల్‌ నగర ప్రజల తాగునీటి డిమాండ్‌ను తట్టుకొనేలా రూపొందించినట్టు అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. నీటి సరఫరా వ్యవస్థ బలోపేతానికి 200 మందిని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ సహాయంతో రిక్రూట్‌ చేసుకోవాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. మున్సిపల్‌శాఖ ఇంజినీరింగ్‌ ఈఎన్సీ, ఇతర ఉన్నతాధికారులు ప్రతివారం తాగునీటి సరఫరా పనుల పురోగతిని వరంగల్‌ వెళ్లి సమీక్షించాలన్నారు. వరంగల్‌ నగరంలో సుమారు 1.70 లక్షల గృహాలకు నల్లా కనెక్షన్లు ఉన్నాయని, మిగిలిన ఇండ్లకు కూడా ఒక రూపాయికి నల్లా కనెక్షన్‌ ఇవ్వాలని.. ఇందుకోసం ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. 

త్వరలో 800 ఇండ్లు అందజేత

వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలో చేపడుతున్న సుమారు 3,700 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ పురోగతిని కూడా మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. ఇప్పటికే 800 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, మెజార్టీ ఇండ్లు నిర్మాణాన్ని పూర్తిచేసుకొనే దశలో ఉన్నాయని జిల్లా కలెక్టర్‌, నగర కమిషనర్‌ మంత్రులకు తెలిపారు. త్వరలోనే పూర్తయిన 800 ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రులు తెలిపారు.  వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌తోపాటు మోడల్‌ జూనియర్‌ కాలేజీ వంటి భవనాలు నిర్మాణాలు పూర్తయి.. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 

పట్టణప్రగతికి 81 కోట్లు

పట్టణప్రగతిలో భాగంగా చేపట్టిన వైకుంఠధామాలు, అర్బన్‌ పార్కులు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వంటి నిర్మాణాలను కార్పొరేషన్‌ పరిధిలోనే కొనసాగించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఇప్పటికీ ఈ కార్యక్రమం కింద చేపట్టిన పార్కుల అభివృద్ధి , టాయిలెట్ల నిర్మాణం పూర్తయిందని, పట్టణ ప్రగతి ద్వారా ప్రభుత్వం ప్రతి నెల కార్పొరేషన్‌కు రూ.7.33 కోట్లు ఇస్తున్నదని, ఇప్పటిదాకా రూ.81 కోట్ల వరకు పట్టణ ప్రగతి నిధుల ద్వారా అందాయని తెలిపారు. ఇప్పటిదాకా 440కి పైగా పనులు పూర్తికావడం లేదా పురోగతిలో ఉన్నాయని అధికారులు చెప్పారు. స్మార్ట్‌సిటీ కార్యక్రమాలతోపాటు చారిత్రక కట్టడాల పరిరక్షణ, నగర పారిశుద్ధ్యం, రోడ్డు నెట్‌వర్క్‌ బలోపేతం వంటి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. త్వరలోనే వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోనూ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు

వరంగల్‌ కార్పొరేషన్‌కు ఏటా బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించి నగరాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిస్తున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో వరంగల్‌ వేగంగా తన రూపు రేఖలు మార్చుకొంటూ అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నదన్నారు. ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌లు దాస్యం వినయ్‌భాస్కర్‌, బీ వెంకటేశ్వర్లు, ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్‌, ఆరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు , జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ, వరంగల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీ శ్రీధర్‌, సీఈ ధన్‌సింగ్‌ పాల్గొన్నారు.

త్వరలో 800 ఇండ్లు అందజేత

వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలో చేపడుతున్న సుమారు 3,700 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ పురోగతిని కూడా మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. ఇప్పటికే 800 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, మెజార్టీ ఇండ్లు నిర్మాణాన్ని పూర్తిచేసుకొనే దశలో ఉన్నాయని జిల్లా కలెక్టర్‌, నగర కమిషనర్‌ మంత్రులకు తెలిపారు. త్వరలోనే పూర్తయిన 800 ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రులు తెలిపారు.  వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌తోపాటు మోడల్‌ జూనియర్‌ కాలేజీ వంటి భవనాలు నిర్మాణాలు పూర్తయి.. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 


logo