ఆదివారం 31 మే 2020
Telangana - May 21, 2020 , 19:26:48

మీ ఏరియాలో మ్యాన్‌హోల్స్‌ ధ్వంసమైతే..155313కి కాల్‌ చేయండి

మీ ఏరియాలో మ్యాన్‌హోల్స్‌ ధ్వంసమైతే..155313కి కాల్‌ చేయండి

 వర్షాకాలంలో నీళ్లు నిలిచే 185 ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లోని మ్యాన్‌హోళ్లకు సెఫ్టీగ్రిల్స్‌ ఏర్పాటు చేశామని జలమండలి ఎండీ దానకిశోర్‌ పేర్కొన్నారు. శివారు మున్సిపాలిటీల్లోని 1.5 మీటర్ల లోతు గల మ్యాన్‌హోళ్లకు సెఫ్టీగ్రిల్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్‌ మొదటి వారంలోగా ఈ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే నగరంలోని 1.5 మీటర్ల లోతు గల మ్యాన్‌హోళ్లకు సెఫ్టీగ్రిల్స్‌  ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వర్షం వచ్చే సమయంలో సివరేజి సూపర్‌ వైజర్లను నియమించి ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. లోతుగా ఉన్న మ్యాన్‌హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు.  క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బంది, అధికారి జలమండలి యూనిఫాం కోట్‌ ధరించాలని ఎండీ ఆదేశించారు.

వర్షాకాలంలో ధ్వంసమైన, మూతలు లేని మ్యాన్‌హోళ్లకు తక్షణమే మరమ్మత్తు పనులు చేపట్టాలని పేర్కొన్నారు. మంచినీటి పైపు నాలా క్రాసింగ్‌ వద్ద చెత్త చేరకుండా చూఋడాలని, ఈ విషయంలో జీఎంలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాకాలంలో అత్యవసర పనులు చేపట్టేందుకు ఈఆర్టీ (ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం) బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ ప్రకటించారు. నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాన్‌హోల్‌ మూతలను తెరవకూడదని ఎండీ దానకిశోర్‌ సూచించారు. ఎక్కడైనా మ్యాన్‌హోల్‌ మూత ధ్వంసమైన, తెరిచి ఉంచినట్లు తెలిస్తే జలమండలి కస్టమర్‌ కేర్‌ నంబరు 155313కి కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జలమండలి డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి. రవిలతో పాటు ఓ అండ్‌ ఎం సీజీఎం, జీఎంలు పాల్గొన్నారు. 


logo