గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 01:51:13

కస్టమర్‌ కేర్‌గా కేటుగాళ్లు

కస్టమర్‌ కేర్‌గా కేటుగాళ్లు

  • లక్షలు కాజేస్తున్న సైబర్‌ నేరగాళ్లు
  • హైదరాబాద్‌ వాసి బ్యాంకుఖాతా ఖాళీ
  • రూ.5.4 లక్షలు కొట్టేసిన హై‘టెక్‌' దొంగలు
  • గూగుల్‌ చేసేముందు జాగ్రత్తలు తప్పనిసరి!

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఏ సందేహం ఉన్నా, ఏ అవసరం వచ్చినా, ఎక్కడికి వెళ్లాలన్నా గూగుల్‌ సెర్చ్‌ఇంజిన్‌లో టైప్‌ చేయగానే క్షణాల్లో సమాచారం అందుతుంది. పనులు చకచకా అయిపోతాయి. ఇది మనకున్న వెసులుబాటు. కానీ, ఇదే కొందరు సైబర్‌ కేటుగాళ్లకు వరంగా మారింది. సెర్చ్‌ఇంజిన్‌ సాయంతో లక్షలు, కోట్లు కాజేసే పన్నాగానికి తెరతీస్తున్నారు. ‘కస్టమర్‌కేర్‌' వల విసిరి అమాయకులను నిలువునా దోచేస్తున్నారు. అలా ఓ హైదరాబాదీ నుంచి రూ.5.4 లక్షలు కాజేశారు. ముసారాంబాగ్‌కు చెందిన రంజిత్‌రెడ్డి వృత్తిరీత్యా వ్యాపారి. తనకు తెలిసినవాళ్లకు గూగుల్‌పే ద్వారా రూ.15వేలు పంపించాడు. ఆ డబ్బు అవతలివాళ్లకు వెళ్లలేదు. దీం తో కంగారుపడి గూగుల్‌లో లభించిన ఓ నంబరుకు ఫోన్‌చేశాడు. అటు నుంచి తాము గూగుల్‌ పే ప్రతినిధులమని చెప్పి, డబ్బు వాపస్‌ రావాలంటే క్విక్‌సపోర్ట్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించారు. నమ్మిన బాధితుడు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశాడు.ఇంత కీ ఆ యాప్‌ ఏంటంటే.సెల్‌ఫోన్‌ లో ఏం చేసినా అ వతలి వాళ్లకు తెలిసిపోతుంది. నెట్‌బ్యాంకింగ్‌ నుంచి రూ.10 ప్రాసెసింగ్‌ ఫీ చెల్లించాలని రంజిత్‌రెడ్డిని కోరారు. అతడు అదే ఫోన్‌ నుంచి తన నెట్‌బ్యాంకింగ్‌ను ఓపె న్‌ చేశాడు. అంతే.. యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌  తెలుసుకొని అతడి ఖాతా నుంచి రూ. 5.4 లక్షలు దోచేశారు.

కస్టమర్‌ కేర్‌ నంబర్‌ స్థానంలో కేటుగాళ్ల నంబర్లు

సైబర్‌ నేరగాళ్లు వివిధ కంపెనీలు, సంస్థలు, దుకాణాల పేర్లతో ఆన్‌లైన్‌లో కొన్ని పేజీలు తయారు చేసి, కస్టమర్‌ కేర్‌ నంబర్‌ పేరుతో తమ నంబర్లను పొందుపరుస్తారు. గూగుల్‌లో టైప్‌ చేయగానే తమ నంబరు ముందుగా చూపించేలా చేస్తారు. హడావుడిలో అది అసలు నంబరో, కాదో తెలుసుకోకుండా మనం ఆ నంబరుకు కాల్‌ చేస్తాం. అప్పటి నుంచి సైబర్‌ దొంగ లు తమ ప్రతాపం చూపిస్తారు. అందుకే, కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసే సమయంలో అది నిజంగా బ్యాంకు కాల్‌సెంటరేనా?అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి.

గుడ్డిగా నమ్మొద్దు

ఏదైనా సమాచారం గూగుల్‌ చేస్తుంటాం. ఆ సమాచారంతో సంబంధిత సంస్థలకు ఫోన్‌ చేసినప్పుడు, బ్యాంకు ఖాతాలు, ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితులోను చెప్పొద్దు. అసలు సంస్థలు బ్యాంకుఖాతా, డెబిట్‌కార్డు వివరాలను అస్సలు అడగవు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరరు. సైబర్‌ నేరగాళ్లు మిమ్మల్ని  మాటల్లో పెట్టి అన్ని వివరాలు తెలుసుకుంటారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. డిజిటల్‌ పేమెంట్స్‌లో ఆయా యాప్‌లలోనే హెల్ప్‌ అనే ఒక ఆప్షన్‌ ఉంటుంది. అందులోకి వెళ్లి ఆయా సంస్థల సహాయాన్ని పొందటం మేలు.

-డీ ప్రశాంత్‌, సైబర్‌క్రైం ఇన్‌స్పెక్టర్‌


logo