బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 03:19:04

ఇంటర్నెట్‌తో పిల్లలు జాగ్రత్త!

ఇంటర్నెట్‌తో పిల్లలు జాగ్రత్త!

 • ప్రతిక్షణం ఓ కంట కనిపెడుతూ ఉండాలి
 •  సోషల్‌ మీడియా చాటింగ్‌లపై దృష్టి పెట్టాలి
 • సైబర్‌ నేరగాళ్లతో పొంచి ఉన్న ప్రమాదం
 • హెచ్చరిస్తున్న సైబరాబాద్‌ పోలీసులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనాతో ఆన్‌లైన్‌ విద్య ఇంట్లోకి చేరింది. పిల్లలకు కంప్యూటర్‌ కొనిచ్చి, ఇంటర్నెట్‌ పెట్టించి క్లాసులు వినేలా ఏర్పాట్లు చేయాల్సిన తరుణం వచ్చేసింది. తల్లిదండ్రులూ! ఒక్క నిమిషం ఆగండి.. ఇంటర్నెట్‌ పెట్టించడం వరకే మీ పని పూర్తి కాలేదు. చదువుకుంటారులే! అని అలసత్వం వహిస్తే అంతకుమించిన ప్రమాదం మరొకటి ఉండదు. ఇప్పటి నుంచే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి, ఆన్‌లైన్‌తో మన పిల్లలు ఎంతవరకు భద్రం? అని ప్రశ్నించుకోవాల్సిన సందర్భం వచ్చేసింది. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు తెరుచుకోకపోవడంతో పిల్లలంతా ఇండ్లకే పరిమితమై ఆన్‌లైన్‌లో పాఠాలు వింటూ.. రోజంతా ఇంటర్నెట్‌లోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇంటర్నెట్‌ వాడకం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, సైబర్‌ నేరగాళ్లతో ప్రమాదం పొంచి ఉన్నదని సైబరాబాద్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్‌ మాయగాళ్ల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సాధారణంగా బాలబాలికలపై జరిగే ఆకృత్యాలు, వేధింపులు ఇప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా కూడా పెరిగే అవకాశాలు లేకపోలేదు. దీంతో వారిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా ఇలాంటి సైబర్‌ మాయగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండేందుకు పిల్లలకు పలు జాగ్రత్తలు నేర్పించాల్సిన అవసరం ఉన్నదని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ కింది నేరాల ద్వారా పిల్లలను చెడు మార్గంలో నడిపేందుకు సైబర్‌ దుష్టశక్తులు పొంచి ఉంటాయని యూనిసెఫ్‌ గుర్తించిందని పోలీసులు తెలిపారు.

సైబర్‌ నేరాలు..

 • సైబర్‌ బిలుయింగ్‌- స్నేహం ముసుగులో వేధింపులు, అందం, భాష, వేషధారణ ఆధారంగా వేధించే అంశాలు. ఆన్‌లైన్‌ సెక్యూవెల్‌ అబ్యూజ్‌- అశ్లీల అంశాలకు సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తిచేయడం, లైంగిక వేధింపులు. ఆన్‌లైన్‌ ఎక్స్‌ప్లాయ్‌టేషన్‌- అశ్లీల లైంగిక అంశాలను అడ్డంపెట్టుకొని వేధించడం, మార్ఫింగ్‌ఫొటోలతో లొంగదీసుకోవటం.
 • ఆన్‌లైన్‌ కమర్షియల్‌ ఫ్రాడ్‌-డాటా అపహారణ, ఇంట్లోవాళ్ల ఆర్థికపరిస్థితి, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలు తెలుసుకోవటం.
 • గ్రూమింగ్‌- పిల్లలను అశ్లీల ప్రపంచానికి అలవాటుచేయడం. 

పిల్లలను కాపాడుకొనే మార్గదర్శకాలు

 • పిల్లలకు ఇంటర్నెట్‌ను అందించేప్పుడు అవసరం మేరకే సేవలను అందుబాటులో ఉంచాలి. మిగతావాటి జోలికి వెళ్లకుండా పాస్‌వార్డులతో లాక్‌లు పెట్టాలి.
 • పిల్లలకు సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన వర్క్‌షాపులను పాఠశాలల యాజమాన్యాలు నిర్వహించాలి. 
 • ఆన్‌లైన్‌లో చూస్తున్న అంశాలను, వారి ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలి. సోషల్‌మీడియా స్నేహాలపై నిఘా పెట్టాలి. 
 • కుటుంబసభ్యుల వివరాలు, ఆర్థిక పరిస్థితి, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలు ఇతరులకు చెప్పొద్దని తెలుపాలి.
 • గుర్తుతెలియనివారితో సోషల్‌మీడియాలో జాగ్రత్తగా ఉండాలని సూచించాలి.


logo