పద్మవ్యూహంలా లోన్ యాప్

- అప్పు తీర్చేందుకు మరో అప్పు
- ఒక్కొక్కరూ 50 యాప్‌ల నుంచి రుణాలు
- లోన్‌యాప్స్ కేసులో ఏడుగురి అరెస్టు
- నిందితుల్లో ఒకరు చైనీయుడు
- 2 ల్యాప్‌టాప్‌లు..4 సెల్ఫోన్లు స్వాధీనం
- రూ. 2 కోట్ల బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్
- 24కు చేరిన అరెస్టుల సంఖ్య
హైదరాబాద్ సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ: మొబైల్ యాప్స్ నుంచి రుణాలు పొందిన కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. సరదాగానో, అవసరం కోసమో ఓ అప్పు చేయడం.. ఆ యాప్ తాలూకు వాళ్లు ఒత్తిడి చేస్తే తీర్చేందుకు మరో అప్పు చేశారు. ఇలా కొందరు ఒక అప్పు తీర్చేందుకు ఏకంగా 50 యాప్‌ల నుంచి రుణాలు తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. లోన్ యాప్స్ కేసు దర్యాప్తును హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ కేసులో సైబరాబాద్ పోలీసులు ఢిల్లీలో నలుగురిని, హైదరాబాద్ పోలీసులు బెంగళూరులో ముగ్గురిని అరెస్టు చేశారు. తాము అరెస్టు చేసిన వ్యక్తుల్లో ఒక చైనీయుడు ఉన్నట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ కేసుల్లో ఇప్పటి వరకు 24 మందిని అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, బెంగళూరుల్లోని కాల్సెంటర్లపై దాడులు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని కుబెవో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో స్కైలైన్ ఇన్నోవేషన్స్ టెక్నాలజీస్ ఇండియాకు అనుబంధంగా కొనసాగుతున్న కాల్‌సెంటర్‌పై ఇటీవల దాడి చేసి పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఢిల్లీలోని స్కైలైన్ ఇన్నోవేషన్స్‌పై దాడి చేసి చైనాకు చెందిన ఇబాయ్ అలియాస్ డెన్నిస్, రాజస్థాన్‌కు చెందిన సత్యపాల్ ఖాలియా, హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ మల్హోత్రా, కడపకు చెందిన మురతోటి రిచీ హేమంత్ సేథ్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 ల్యాప్‌టాప్‌లు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
స్కైలైన్ కంపెనీకి చెందిన రూ.2 కోట్ల డిపాజిట్ ఉన్న ఓ బ్యాంక్ అకౌంట్‌ను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అదే సమయంలో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు బెంగళూర్‌లోని అన్నియు ప్రైవేట్ లిమిటెడ్ , తృతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్వహిస్తున్న రెండు కాల్సెంటర్లపై దాడి చేసి అడ్మిన్‌గా పనిచేస్తున్న ఈశ్వర్‌తో పాటు, సీనియర్ మేనేజర్లు మధుసూదన్, సతీశ్‌కుమార్‌లను అరెస్ట్ చేశారు. వీటిలో 350 మంది పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలాఉండగా హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో చైనాకు చెందిన క్యూయోన్ అనే మహిళ ప్రస్తావన వచ్చింది, ఆమె ఫిబ్రవరిలోనే ఇక్కడి నుంచి తమ దేశానికి వెళ్లిపోయినట్టు గుర్తించారు. చైనాకు చెందిన ల్యాంబో అనే వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు యత్నిస్తున్నారు.
116 యాప్‌లను తొలగించండి
ఎలాంటి అనుమతుల్లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్న 116 యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించాలని గూగుల్ సంస్థకు లేఖ రాసినట్టు సీపీ తెలిపారు. కంపెనీ డైరెక్టర్లుజిషియాజాంగ్(చైనా), ఉమాపతి అలియాస్ అజయ్(ఢిల్లీ) పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోనే 27 కేసులు
- హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 27 కేసులు నమోదయ్యాయి. 42 యాప్‌లు.. లిఫాంగ్, పిన్ ప్రింట్, హాట్పుల్, నాబ్లూమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థల ద్వారానే నడుస్తున్నాయి.
- ఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, బెంగళూర్‌లో ఇప్పటి వరకు అరస్టైన నిందితుల కస్టడీ కోసం పలు రాష్ర్టాల పోలీసులు పీటీ వారెంట్లతో వేచి చూస్తున్నారు. వీరిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని హైదరాబాద్ పోలీసులు విచారించాల్సి ఉంది.
- అప్పుల యాప్‌లలో చైనీయులతో చెట్టపట్టాలేసుకొని కాల్సెంటర్లను ఏర్పాటు చేయడంలో కర్నూల్‌కు చెందిన నాగరాజు ప్రధాన భూమిక పోషించాడు. బెంగళూరులో అరెస్టయిన ఈశ్వర్ అతడి సోదరుడే.
- ఈ కంపెనీలకు సంబంధించి 350 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వీటికి రోజర్‌పే గేట్వేగా ఉంది. ఈ ఖాతాల్లో రూ. 87 కోట్ల వరకు నగదును ఫ్రీజ్ చేశారు.
- జగిత్యాల, రాజేంద్రనగర్‌లో బలవన్మరణాలకు పాల్పడిన కేసుల్లో హైదరాబాద్ పోలీసులు గుర్తించిన 42 యాప్‌లలో రెండు యాప్‌లకు, సిద్దిపేటలో ఆత్మహత్య చేసుకున్న మహిళ కేసులో 6 యాప్‌లకు సంబంధాలున్నాయి.
తాజావార్తలు
- 20 లక్షల టీకాలు పంపిన భారత్.. ధన్యవాదాలు చెప్పిన బొల్సనారో
- గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్ కేసులు
- పదవి నుంచి తప్పుకున్న వుహాన్ మేయర్
- జార్ఖండ్ సీఎంను కలవనున్న తేజస్వీ యాదవ్
- తమిళనాడులో దోపిడీ.. హైదరాబాద్‌లో చిక్కిన దొంగలు
- ట్రంప్ అభిశంసన.. ఫిబ్రవరిలో సేనేట్ విచారణ
- వరుణ్ ధావన్- నటాషా వివాహం.. టైట్ సెక్యూరిటీ ఏర్పాటు
- సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు
- ఎలుక మూతి ఆకారంలో చేప.. ఎక్కడో తెలుసా?
- సంప్రదాయానికి స్వస్తి.. తైవాన్ జామతో దోస్తీ..!