ఆదివారం 24 మే 2020
Telangana - Mar 03, 2020 , 02:38:45

స్కల్‌బ్రేకర్‌.. ఖబడ్దార్‌

స్కల్‌బ్రేకర్‌.. ఖబడ్దార్‌
  • వైరల్‌గా మారుతున్న గేమ్‌తో జాగ్రత్త
  • కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ కమిషనర్‌ హెచ్చరిక

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సామాజికమాధ్యమాలు నేటి యువతకు ఎంత వినోదాత్మకంగా ఉంటున్నాయో అంతే ముప్పును కూడా కొనితెస్తున్నాయి. స్కల్‌బ్రేకర్‌ పేరిట వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో ఇటీవల వైరల్‌అయిన ఓగేమ్‌తో విద్యార్థులు, యువత తమ ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు. చాలామందికి నడుము లేదా కాళ్లు విరుగుతుండగా, తలపగిలి ప్రాణాలు పోగొట్టుకున్నవారున్నారు. కుటుంబాల్లో కలవరం రేపుతున్న ఈ గేమ్‌పై నిత్యం నజర్‌ పెట్టాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ పిల్లల తల్లిదండ్రులకు, పాఠశాల ప్రిన్సిపాళ్లకు, కాలేజీ యాజమాన్యాలకు సూచించారు.


స్కల్‌ బ్రేకర్‌ అంటే..

ఈ చాలెంజ్‌లో ముగ్గురు వ్యక్తులు వరుసగా నిలబడతారు. మధ్యలో ఉన్న వ్యక్తి గాల్లోకి ఎగిరినప్పుడు పక్కనఉండే ఇద్దరు తమ కాళ్లతో అతని కాళ్లను కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఎగిరిన వ్యక్తి తన్నులను తప్పించుకోవాలి. తప్పించుకోలేకపోతే కింద పడటం ఖాయం. ఆ సమయంలో తలకు, నడుముకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. నడుముకు తగిలే గాయాలతో అంగవైకల్యం, తలకుతగిలే గాయాలతో మెదడు నరాలు దెబ్బతిని శరీరం శాశ్వతంగా మొద్దుబారడం లేదా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది.

ఆ వీడియోలు చేస్తే కఠినచర్యలు: సీపీ

పిల్లలు ఇటువంటి ఆటలు ఆడకుండా తల్లిదండ్రులు, స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్‌ పోలీస్‌కమిషనర్‌ సజ్జనార్‌ కోరారు. ఎవరైనా ఆ ఆటలాడి వీడియోలు తీసినా, వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి వీడియోలు ఎవరిదృష్టికైనా వస్తే వెంటనే 100కు ఫోన్‌ చేయాలని లేదా 9490617444కు వాట్సప్‌ ద్వారా సమాచారమివ్వాలని కోరారు.
logo