గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 01:34:01

ఓ సైబర్‌ నేరగాడి ఆవేదన

ఓ సైబర్‌  నేరగాడి ఆవేదన

  • కరోనా, ప్రజల అప్రమత్తతతో సంపాదన తగ్గిందట!

కరోనా నేపథ్యంలో షాపింగ్‌ మాల్స్‌ ఆదాయం పడిపోయింది.. హోటళ్లకు నష్టాలే మిగిలాయి. రవాణారంగం కుదేలైంది.. అయితే, వైరస్‌ తమనూ వదల్లేదని సైబర్‌ నేరగాళ్లు తెగ బాధపడుతున్నారు. కరోనా, ప్రజల అప్రమత్తతతో తమ సంపాదన పడిపోయిందని ఆవేదన చెందుతున్నారు. గతంలో నెలకు రూ.15 లక్షలు సంపాదిస్తే.. ఇప్పుడది 5 లక్షలే వస్తుందని కుమిలిపోతున్నారు. అయినా దేశంలో చాలామంది అమాయకులున్నారని, మోసాలకు కొత్తదారులు వెతుకుతామని బాధితులతో ఫోన్లలో తెగేసి చెప్పేస్తున్నారు.

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రజల అప్రమత్తతకు తోడు కరోనా వైరస్‌ కష్టాలు తెచ్చిపెట్టిందని సైబర్‌ నేరగాళ్లూ తలలు పట్టుకుంటున్నారు. సగానికి పైగా సంపాదనను వైరస్‌ నాకేసిందని దిగులుచెందుతున్నారు. ఓటీపీ అడిగితే ఎందుకు చెప్పాలి? బ్యాంకు ఖాతా వివరాలు ఎందుకు ఇవ్వాలి? డెబిట్‌కార్డు నంబర్‌తో మీకేం పని? అంటూ ప్రజలు ఎదురుప్రశ్నలు వేస్తుండటంతో మోసపోయేవారు తగ్గి.. సంపాదన పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రుణాలిస్తామంటే కరోనా వేళ ఎవరూ నమ్మడంలేదని చెప్తున్నారు. మోసపోకుండా అప్రత్తమంగా ఉంటున్నవారితో ఫోన్లలోనే వారి మనోవేదనను వెల్లగక్కేస్తున్నారు. 

కెమెరా కొనేందుకు క్యూఆర్‌ కోడ్‌ పంపిస్తా

హైదరాబాద్‌కు చెంది సుధీర్‌ తన దగ్గర ఉన్న ఓ కెమెరాను ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాడు. ఆర్మీ అధికారిగా పరిచయం చేసుకున్న సైబర్‌ నేరగాడు కెమెరా కొనేందుకు ఫోన్‌లో మాట్లాడాడు. వివరాలు ఇలా..

సైబర్‌ నేరగాడు: నేను ఆర్మీ అధికారిగా పనిచేస్తున్నా. మీ కెమెరా నాకు నచ్చింది. కొంటాను.

సుధీర్‌: మీరు కెమెరా చూడకుండానే ఎలా కొంటారు?

సైబర్‌ నేరగాడు: మీ కెమెరా చాలా నచ్చింది. దాని ధర కూడా తక్కువగా ఉన్నది. చాన్స్‌ మిస్సవుతానేమోనని చూడకుండానే కొనేందుకు సిద్ధమయ్యా. మీకు అడ్వాన్స్‌ కింద నగదును క్యూఆర్‌ కోడ్‌ ద్వారా పంపిస్తున్నాను. ఆ కోడ్‌ స్కాన్‌ చేయగానే అడ్వాన్స్‌ కింద నగదు మీ ఖాతాలో జమవుతుంది.

సుధీర్‌: క్యూఆర్‌ కోడ్‌ వద్దు. నా ఖాతా వివరాలు పంపిస్తాను. దానికి డబ్బు పంపండి. లేదంటే మీరు నేరుగా వచ్చి నగదు ఇచ్చి కెమెరాను తీసుకోండి.

సైబర్‌ నేరగాడు: నా పోస్టింగ్‌ చాలా దూర ప్రాంతంలో ఉన్నది. బ్యాంకు ఖాతాకు డబ్బు పంపించాలంటే చాలా సమయం పడుతున్నది. మీకెందుకు భయం. నేను ఓటీపీ, పిన్‌ నంబరు, సీవీవీ నంబరు అడుగటం లేదు కదా.! 

సుధీర్‌: మా స్నేహితుడిని కూడా ఇలానే క్యూఆర్‌ కోడ్‌ పంపించి మోసం చేశారు.

సైబర్‌ నేరగాడు: ఇదేంటి. చెప్పింది వినరేంది.(అసహనానికి గురయ్యాడు)

సుధీర్‌: (సైబర్‌ నేరగాడని తెలిసిపోయింది) మీరేందుకు ఇలా మోసం చేస్తున్నారు? ఇలా ఆర్మీ అధికారినంటూ మోసం చేయడం కరెక్ట్‌ కాదు కదా!

సైబర్‌ నేరగాడు: (నవ్వుతూ) మేము బతకడానికే ఈ మోసాలు చేస్తుంటాం. 

సుధీర్‌: మీరు నెలకు ఎంత సంపాదిస్తారు? 

సైబర్‌ నేరగాడు: కరోనాకు ముందు సైబర్‌ క్రిమినల్‌ నెల సంపాదన దాదాపు రూ.15 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు కరోనా, సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తం కావడంతో నెల సంపాదన రూ.5 నుంచి 6 లక్షలకు పడిపోయింది. నువ్వు ఒక్కడివి స్కాన్‌ చేయకపోతే మాకేం నష్టం లేదు. దేశంలో చాలామంది అమాయకులు (ఫూల్స్‌) ఉన్నారు. ఎవడో ఒక్కడు చిక్కుతాడు. ఇది కాకపోతే ఇంకో విధంగా సైబర్‌ నేరం చేస్తుంటాం. నువ్వు మాట్లాడినంత సేపు నీ ఫోన్‌ హ్యాక్‌ చేసి నీ ఖాతాను ఖాళీ చేస్తాను ( బెదిరిస్తూ..).

సుధీర్‌: నువ్వు మాట్లాడినదంతా రికార్డు అయింది. మొత్తం సోషల్‌మీడియాలో పెడతాను. 

సైబర్‌ నేరగాడు: సోషల్‌మీడియా అయినా ఇంకెక్కడయినా పెట్టుకో నీ ఇష్టం. మేం మాత్రం సైబర్‌ మోసాలు ఆపేదిలేదు. మోసాలు చేస్తూనే ఉంటాం. (చివరకు సుధీర్‌ ఫోన్‌ కట్‌చేసి వారి సంపాదన తలుచుకుంటూ ఆశ్చర్యానికి గురయ్యాడు.)

  • సైబర్‌ మోసాలపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. 


logo