శనివారం 04 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:16:34

సమగ్ర వివరాలతో అపెక్స్‌ కౌన్సిల్‌

సమగ్ర వివరాలతో అపెక్స్‌ కౌన్సిల్‌

  • కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులపై సీడబ్ల్యూసీ ఆరా
  • నాలుగు రాష్ర్టాల నుంచి వివరాల సేకరణ
  • బోర్డు భేటీ వివరాలపై నేడు జల్‌శక్తి కార్యదర్శి సమీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలుగురాష్ర్టాల మధ్య పెండింగ్‌లో ఉన్న జల సంబంధిత అంశాలను ప్రభుత్వాల స్థాయిలో చర్చించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది. కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటూ తెలంగాణ, ఏపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇద్దరు ముఖ్యమంత్రులతో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి కసరత్తు చేస్తున్నది. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆదేశాలతో ఇప్పటికే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు రెండు రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించాయి. దీంతో కేంద్ర జల్‌శక్తి అధికారులు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీపై దృష్టిసారించారు. 

ఇద్దరు సీఎంలు పాల్గొనే సమావేశం కావడంతో ఉన్నతాధికారులు సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు సోమవారం కేంద్ర జలసంఘం చైర్మన్‌ ఏకే సిన్హా తెలుగురాష్ర్టాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర సీడబ్ల్యూసీ అధికారులు, కృష్ణానదీ యాజమాన్య బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కృష్ణాబేసిన్‌లో నీటి లభ్యత మొదలు బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులు, ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలపై నిర్మించిన ప్రాజెక్టులు, వాటి అనుమతులపై వివరాలు తెలుసుకున్నారు. ఏయే రాష్ట్రం ఎన్నిప్రాజెక్టులు నిర్మించింది? వాటికి సంబంధించిన అనుమతులు, ప్రధానంగా హైడ్రాలజీ క్లియరెన్స్‌లపై అన్ని కోణాల్లో ఆరాతీశారు. ఇందులోభాగంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ (ఎన్‌ఐహెచ్‌) అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చినట్టు సమాచారం. కృష్ణాతోపాటు, నాలుగు ఉపనదుల్లో నీటి లభ్యత, గత పదేండ్లలో వరద, నాలుగు రాష్ర్టాల మధ్య పంపిణీ తదితర అంశాలను ప్రజెంటేషన్‌లో వివరించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ తర్వాత కృష్ణాజలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్మాణంపైనా వివరాలు అడిగారు. 

రెండువారాల్లో అపెక్స్‌ భేటీ 

నదీ యాజమాన్య బోర్డు సమావేశాలు ముగిసిన నేపథ్యంలో వీలైనంత త్వరగా అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ నిర్వహించేందుకు కేంద్ర జల్‌శక్తి ఉన్నతాధికారులు యత్నిస్తున్నారు. రెండువారాల్లో అపెక్స్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఇందుకుగాను ఈ నెల 4న నిర్వహించిన కృష్ణాబోర్డు సమావేశం వివరాలను సేకరించేందుకు జల్‌శక్తి కార్యదర్శి యూపీ సింగ్‌ మంగళవారం బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్న అధికారులు.. రెండు రాష్ర్టాల నుంచి ఎజెండా అంశాలు వచ్చాక అపెక్స్‌ భేటీపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.


logo