శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 01:05:04

కాంగ్రెస్‌ హయాంలోనే కరెంట్‌ కష్టాలు

కాంగ్రెస్‌ హయాంలోనే కరెంట్‌ కష్టాలు

  • నాడు కాలిన మోటర్లు,  పేలిన ట్రాన్స్‌ఫార్మర్లు
  • l నేడు మోటర్లకు మీటర్లు పెడతమంటున్న బీజేపీ ప్రభుత్వం  
  • l దుబ్బాక అభివృద్ధి కోసం సుజాతక్కను గెలిపిద్దాం
  • l ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్‌ ఇవ్వక రైతులను ఇబ్బందులు పెట్టారు.. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాయిలు, బోర్ల కాడ మీటర్లు పెట్టి లెక్కలు తీస్తామంటూ భయాందోళనకు గురిచేస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో మోటర్లు కాలుడు, ట్రాన్స్‌ఫార్మర్లు పేలుడు.. దొంగ రాత్రులు కరెంట్‌ ఇచ్చి రైతులను సతాయించిండ్రని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చినంక కరెంట్‌ లేక ఒక్క మడి ఎండిందా?.. మోటర్లు కాలాయా?.. పైసా ఖర్చైందా? అని ప్రజలను అడిగారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్‌ను ఇచ్చి రైతాంగాన్ని కాపాడుకున్నదని స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం దౌల్తాబాద్‌ మండలం ముబారస్‌పూర్‌, అహ్మద్‌నగర్‌, తిర్మలాపూర్‌ గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత, ప్రభుత్వవిప్‌ గువ్వల బాలరాజ్‌, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డితో కలిసి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామా ల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసం వేస్తున్నదన్నారు. రైతులకు ఉచితంగా కరెంట్‌ ఇస్తూ.. పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.10 వేలు.. పండిన పంట కొనుగోలుకు రైతు ముంగిట్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి చివరి గింజా కొనుగోలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.  

కేంద్రం ఒక్క పైసా ఇవ్వదు.. కానీ ఓట్లు కావాలా?

‘కేంద్రం నుంచి ఒక్క పైసా ఇవ్వరు.. కానీ, ఇక్కడి ప్రజల ఓట్లు కావాలా మీకు?’ అని మంత్రి హరీశ్‌రావు బీజేపీ నాయకులను ప్రశ్నించారు. బీడీలు చేసే అక్కాచెల్లెళ్లకు ఇచ్చే పింఛన్‌ డబ్బుల్లో రూపాయైన బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పైసా ఇవ్వని బీజేపీ, కాంగ్రెస్‌ వాళ్లకు మా అక్క చెల్లెళ్లు ఓట్లు వేస్తారా? వేయరు గాక వేయరని చెప్పా రు. అన్ని ఇచ్చిన కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇంటి జాగ ఉన్న అర్హులైన వారికి సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు మంజారు ఇస్తామని చెప్పారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇప్పటికే చాలా గ్రామాల్లో ఇండ్లు కట్టించారనీ, ఇంక అర్హులైన వారందరికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఎన్నికల ముందు వచ్చి కాయకొరుకుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వెనుకట నిజాం కాలంలో శిస్తు కట్టకుంటే జనం వీపులపై రాళ్లు పెట్టేవారనీ, సమైక్య పాలనలోనూ భూమి శిస్తు, నీటి తీరువాతో వేధించేవారన్నారు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ రైతులకే పంట పెట్టుబడి సాయం ఇస్తూ వారి ఇబ్బందులను తొలగించడానికి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చారని చెప్పారు.  

కన్నీటి పర్యంతమైన సోలిపేట సుజాత

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత భావోద్వేగానికి లోనయ్యారు. శనివారం దౌల్తాబాద్‌ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రామలింగారెడ్డి పోతారని తాను కలలో కూడా ఊహించలేదనీ, ఆయనకు ఓట్లు వేయమని మీ వద్దకు వచ్చాను కానీ.. నాకు ఓట్లు వేయమని అడిగే రోజు వస్తదనుకోలేదు’ అంటూ బోరున విలపించారు. పక్కనే ఉన్న మంత్రి హరీశ్‌రావు, గువ్వల బాలరాజ్‌, పద్మాదేవేందర్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి ఆమెను ఓదార్చారు. ముబారస్‌పూర్‌, అహ్మద్‌నగర్‌, తిర్మలాపూర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రజలు జలపందిర్లు, మంగళహారతులు, బోనాలు, బతుకమ్మలతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి సోలిపేట సుజాతకు ఘన స్వాగతం పలికారు.

టీఆర్‌ఎస్‌కు ఫీల్డ్‌ అసిస్టెంట్ల బాసట

దుబ్బాక టౌన్‌: దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత విజయానికి తమవంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల రవి తెలిపారు. శనివారం దుబ్బాకలో రాష్ట్ర స్థాయి ఫీల్డ్‌ అసిస్టెంట్ల అసోసియేషన్‌ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు మేకల రవి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి  పనిచేస్తామన్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7,651 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారేనని, వీరందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని రవి విజ్ఞప్తి చేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల పునర్నియామకంపై త్వరలో శుభవార్త వెలువడుతుందని ఉపాధిహామీ టెక్నికల్‌ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లారెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

12 మంది నామినేషన్లు తిరస్కరణ..  19న సాయంత్రం తుది జాబితా 

దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి 12 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక్కడ మొత్తం 46 మంది 103 నామినేషన్లు దాఖలు చేయగా, శనివారం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నిర్వహించిన స్క్రూటినీలో 12 మంది నామినేషన్లు తిరస్కరించినట్లు ఆర్వో చెన్నయ్య తెలిపారు. ఇందులో కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితోపాటు చెరుకు విజయలక్ష్మి నామినేషన్‌ వేయగా విజయలక్ష్మి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. బహుజన రాష్ట్ర సమితి అభ్యర్థి రమేశ్‌, ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ అభ్యర్థి జగదీశ్‌రాజ్‌, తెలంగాణ జాగీర్‌ అభ్యర్థి భరతసింహరాయుడు, అన్నా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వడ్ల శ్యామ్‌, స్వతంత్ర అభ్యర్థులు రాధారమణి, డీ కిషన్‌రావు, మీసాల రాజసాగర్‌, దొడ్ల వెంకటేశం, కొల్కూరు ప్రతాప్‌, పోసాన్‌పల్లి మహిపాల్‌రెడ్డి, షేక్‌ సర్వార్‌ హుస్సేన్ల నామినేషన్లు తిరస్కరించినట్లు ఆర్వో తెలిపారు. కాగా, ఈ నెల 19న సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నట్లు చెన్నయ్య తెలిపారు.