యాసంగి మొదలు

- మొదలైన సాగు పనులు
- లక్ష్యం 65.68 లక్షల ఎకరాలు
- ఈసారీ అంచనాలకు మించి సాగు!
- సిద్ధంగా ఎరువులు, విత్తనాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా వానకాలం సాగును పూర్తిచేసుకున్న రైతులు యాసంగికి సిద్ధమవుతున్నారు. దుక్కిదున్ని నార్లుపోసుకుంటున్నారు. యాసంగిలోనూ నియంత్రిత సాగును అమలుచేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 65.68 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో దాదాపు 3 లక్షల ఎకరాల వరకు కూరగాయల సాగుకు ప్రోత్సహించింది. 50 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాలని సూచించింది. అయితే యాసంగిలోనూ సాగు విస్తీర్ణం అంచనాలకు మించే అవకాశం ఉన్నది. వానకాలంలో 1.25 కోట్ల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకుంటే ఏకంగా 1.32 కోట్ల ఎకరాల్లో రైతులు పంటలువేశారు. 70 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగు కావచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా వరిసాగులోనే గణనీయమైన వృద్ధి కన్పిస్తున్నది.
ఉరకలేస్తున్న ఉత్సాహం
గతంలో సాగునీరు సరిపడలేక యాసంగి సాగుకు వెనుకంజ వేసిన రైతులు.. ఈసారి ఉరకలెత్తే ఉత్సాహంతో ముందుకుసాగుతున్నారు. ఒకవైపు కాళేశ్వరం నీళ్లు, మరోవైపు విస్తారమైన వర్షాలతో చెరువులు, కుంటలన్నీ ఇప్పటికీ నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో బోర్లు, బావుల్లో పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉండటంతో రైతులు యాసంగి సాగుపై ధీమాతో ఉన్నారు.
విత్తనాలు, ఎరువులు సిద్ధం
యాసంగి సాగు లక్ష్యాన్ని ముందే నిర్దేశించిన ప్రభుత్వం ఆ మేరకు ఎరువులు, విత్తనాలను సిద్ధంగా ఉంచింది. సాగు ప్రణాళికకు అనుగుణంగా మొత్తం 17.68 లక్షల టన్నుల విత్తనాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్తగా 22.11 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంచేశారు. 18.30 లక్షల టన్నుల ఎరువులను కేంద్రం నుంచి తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో యూరియానే 10 లక్షల టన్నులు ఉన్నది. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి సుమారు 2.5 లక్షల టన్నుల యూరియాను ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచింది.
మక్కసాగు మళ్లీ వద్దు
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మక్కలకు డిమాండ్ లేకపోవడంతో రైతులు ఈసారి కూడా ఆ పంటను సాగుచేయవద్దని ప్రభుత్వం సూచించింది. యాసంగిలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ మక్కలు కొనుగోలు చేయదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ఇప్పటికే దేశంలో అవసరానికి మించి మక్కలు ఉన్నాయి. వానకాలంలోనూ మక్కలు వద్దని చెప్పినా కొంతమంది రైతులు సాగు చేశారు. చివరికి వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ మక్కల కొనుగోలుకు అనుమతిచ్చారు. కానీ, యాసంగిలో ఈ పరిస్థితి ఉండదని ముందుగానే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రైతులు మక్కసాగు జోలికి వెళ్లొద్దని అధికారులు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
- అమిత్‌షా ఖాతా ఎందుకు బ్లాక్ చేశారు?!
- 2021లో బైజూస్ కు మార్కెట్ ఎలా ఉందంటే..?
- ఫిలిప్పీన్స్‌లో భూకంపం:రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు
- హీరో@10 కోట్ల క్లబ్
- పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ మొఘల్ ‘వాటర్ ట్యాంక్’
- కపోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం
- పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
- చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల
- ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్
- టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!