శనివారం 16 జనవరి 2021
Telangana - Feb 09, 2020 , 02:20:36

మిషన్‌ కాకతీయతో పెరిగిన సాగు పదిలక్షల ఎకరాలు

మిషన్‌ కాకతీయతో పెరిగిన సాగు పదిలక్షల ఎకరాలు
  • బ్రహ్మాండమైన ఫలితాలిస్తున్న చెరువుల పునరుద్ధరణ
  • ఏటా 15 లక్షల ఎకరాలకు సాగునీటి భరోసా
  • ప్రాజెక్టుల నీళ్లు తోడవడంతో పెరుగుతున్న సాగు విస్తీర్ణం
  • ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో అధిక ప్రయోజనం
  • నీటిపారుదలశాఖ నివేదికలో వివరాలు వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో చెరువులు చిరునవ్వులు చిందిస్తున్నాయి. మిషన్‌ కాకతీయ ఫలితాలు మొదలైనప్పటినుంచి చెరువుల కింద ఏయేటికాయేడు సాగువిస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. గత మూడేండ్లుగా 15 లక్షల ఎకరాలతో సాగు విస్తీర్ణం స్థిరంగా కొనసాగింది. తాజా నీటిసంవత్సరంలో ప్రాజెక్టుల నీళ్లు కూడా తోడవటంతో అదనంగా పది లక్షల ఎకరాలకు జీవం పోసినట్లయింది. దీంతో చినుకు పడకున్నా చెరువుల కింద ఏటా రెండు పంటలు పండించుకొనే బంగారు భవిష్యత్తు సమీపంలో ఉన్నదనే భరోసా రైతాంగంలో వ్యక్తమవుతున్నది. నిజానికి రాష్ట్రంలోని 46,571 చెరువులకింద 25,92,437 ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు ఉన్నది. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిన్న నీటివనరులను అప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో సాగువిస్తీర్ణం దారుణంగా తగ్గింది. చివరకు చెరువుల ఉనికే ప్రశ్నార్థకమైంది. తాజాగా రాష్ట్ర నీటిపారుదలశాఖ విడుదలచేసిన నివేదికలోని గణాంకాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత.. మిషన్‌ కాకతీయ అమలైన తర్వాత వచ్చిన మార్పును స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయి. 2008-09 నుంచి రాష్ట్రంలోని చెరువుల కింద ఏడాదికి సరాసరిన ఐదారు లక్షల ఎకరాలకు మించి సాగయ్యేది కాదు. అదికూడా మంచి వర్షాలు పడిన సంవత్సరాల్లోనే. యాసంగిలో అయితే లక్ష, లక్షన్నర ఎకరాలు మించిన దాఖలాలు లేవు. కొన్ని సంవత్సరాల్లో నామమాత్రంగా ఉన్న సందర్భాలూ ఉన్నాయి. 


మూడేండ్లుగా కనీవినీ మార్పు

తెలంగాణ ప్రభుత్వం 2015లో మిషన్‌ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు నాలుగు దశల్లో 27,625 చెరువులకు పూర్వ వైభవాన్ని కల్పించింది. పునరుద్ధరణ పనులు చేపట్టిన చెరువుల కింద 20.78 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. రూ.9,155.97 కోట్ల అంచనాతో నాలుగు విడుతలుగా చేపట్టిన పనులతో దాదాపు 22 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు ప్రభుత్వం మిషన్‌ కాకతీయ కింద రూ.4,352.18 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసింది. 


నాలుగు విడుతల్లో 2,384.35 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడికను తొలిగించారు. తద్వారా 8.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఏకంగా 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమైంది. 2016-17 నుంచి 2018-19 వరకు చెరువుల కింద సాగువిస్తీర్ణం పెరిగింది. 2008-09 నుంచి రికార్డులను పరిశీలిస్తే... రాష్ట్రవ్యాప్తంగా చెరువుల కింద సగటున పది లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా సాగవుతున్నట్లుగా నమోదయింది. ప్రధానంగా పాత ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో ఈ పెరుగుదల అధికంగా కనిపిస్తున్నది. ఉమ్మడి జిల్లాలను పరిగణనలోకి తీసుకొంటే.. ఆదిలాబాద్‌ పరిధిలో 2.45 లక్షల ఎకరాలు, వరంగల్‌ పరిధిలో 2.77 లక్షల ఎకరాలు సాగయ్యాయి. 


ఖమ్మంలో 2.25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే.. ఏకంగా 1,88,600 ఎకరాలు సాగవడం విశేషం. యాసంగి సీజన్‌లోనూ గతంలో ఎన్నడూలేనంత సాగు నమోదైంది. అన్ని జిల్లాల పరిధిలో 3,88,406 ఎకరాలు చెరువుల కింద సాగవగా... అందులో 2,81,629 ఎకరాల్లో వరి పంట పండటం మరో రికార్డు. ఇందులో ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో అత్యధిక స్థాయిలో వరి సాగయింది. 2018-19లో వానకాలం, యాసంగి కలిపి దాదాపు 15 లక్షల ఎకరాల వరకు చెరువుల కింద సాగయింది. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావటం, ప్రాజెక్టుల కాల్వలను చెరువులకు అనుసంధానించడంతో సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని నీటిపారుదలశాఖ అంచనావేస్తున్నది. 


తెలంగాణ ఏర్పడిన తర్వాత చెరువుల కింద సాగు విస్తీర్ణ ప్రస్థానమిలా..

సంవత్సరం
వానకాలం
యాసంగి
మొత్తం
2014-15
5,84,178
1,11,397
6,95,575
2015-16
2,82,987
49,475
3,32,462
2016-17
8,73,425
7,25,650
15,99,075
2017-18
9,41,411
4,24,011
13,65,422
2018-19
10,88,454
3,88,406
14,76,860