న్యూయార్క్ : అమెరికాకు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ (బీసీఎం) భాగస్వామ్యంతో హైదరాబాద్ కు చెందిన బయలాజికల్ ఈ రూపొందిస్తున్న వ్యాక్సిన్ పలు కొవిడ్ వేరియంట్లను దీటుగా ఎదుర్కొంటుందని బీసీఎం నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ డీన్ ప్రొఫెసర్ పీటర్ హాట్జ్ పేర్కొన్నారు. జూన్ ప్రదమార్ధంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు వెళ్లనున్న ఈ వ్యాక్సిన్ వివిధ కొవిడ్ వేరియంట్ల నుంచి ప్రజలకు దీటైన రక్షణ ఇస్తుందని వెల్లడవుతోందని చెప్పారు. లేబొరేటరీ ఫలితాలు అద్భుతంగా వచ్చాయని వెల్లడించారు.
ఇక బీసీఎం-బయలాజికల్ ఈ వ్యాక్సిన్ మూడో దశ పరీక్షల్లో భాగంగా భారత్ లోని 15 కేంద్రాల్లో 360 మందికి 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తామని బీసీఎం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకూ నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ పూర్తి భద్రతతో కూడినదని, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తోందని వెల్లడైందని తెలిపింది.