ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:30:59

పత్తికి జై.. కందికి సై!

పత్తికి జై.. కందికి సై!

  • సోయాసాగుకూ అన్నదాత మొగ్గు 
  • మక్కజొన్న వేసింది 6 శాతమే 
  • సీఎం సూచనతో మారిన ఆలోచన
  • నియంత్రిత సాగువైపు రైతు అడుగు 
  • ఇప్పటికే 63 లక్షల ఎకరాలకుపైగా సాగు పూర్తి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర రైతాంగం నియంత్రితసాగుకు సై అంటున్నది. డిమాండ్‌ ఉన్న పంటలను పండించేందుకు ఆసక్తి చూపుతున్నది. నియంత్రితసాగులో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన పంటలనే వేస్తున్నది. రైతులు మక్కజొన్న సాగుకు బదులుగా పత్తిసాగుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది ఇప్పటికి మక్కజొన్న సాగు 3.69 లక్షల ఎకరాల్లో సాగైతే ఈ సీజన్‌లో ఇది కేవలం 68 వేలకే పరిమితమైంది. అది కూడా పౌల్ట్రీ, డెయిరీఫాం రైతులే. వారు కూడా ప్రభుత్వ అనుమతి తీసుకొని మక్క సాగుచేస్తున్నారు. నియంత్రిత సాగులో ప్రభుత్వం ఈ సీజన్‌లో పత్తికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దీనికి అనుగుణంగానే రైతులు పత్తిని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇప్పటివరకు రికార్డుస్థాయిలో 45.02 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేయడం విశేషం. ఈ సీజన్‌లో పత్తిసాగు ప్రభుత్వ లక్ష్యాన్ని దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యవసాయరంగ నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం సూచించిన కంది పంట సాగుపైనా రైతులు ఆసక్తి కనబర్చుతున్నారు. 

గత ఏడాది ఈ సమయానికి 3.35 లక్షల ఎకరాల్లో కంది సాగవగా.. ఈ ఏడు ఇప్పటికే 6.87 లక్షల్లో వేయడం విశేషం. ఇది గతంతో పోల్చితే రెట్టింపుగా ఉన్నది. సోయా పంటను సైతం ఉత్సాహంగా సాగుచేస్తున్నారు. వరిసాగు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది. గత ఏడాది ఈ సమయానికి 1.26 లక్షల ఎకరాల్లో వరి వేయగా.. ప్రస్తుత సంవత్సరం ఇప్పటి వరకు 3.85 లక్షల ఎకరాల్లో సాగైంది. మొత్తం ఆహార పదార్థాలకు సంబంధించి ఇప్పటి వరకు 1.58 లక్షల ఎకరాల్లో సాగు పూర్తయింది. పప్పు ధాన్యాలకు సంబంధించి ఇప్పటి వరకు 8.21 లక్షల ఎకరాల్లో సాగు పూర్తయింది.

సగానికైగా లక్ష్యం పూర్తి 

నియంత్రితసాగులో భాగంగా ఈ సీజన్‌లో 1,25,45,061 ఎకరాల్లో పంటలను సాగు చేయాలని భావించగా బుధవారం వరకు 63,18,769 ఎకరాల్లో సాగు పూర్తయినట్టు వ్యవసాయ శాఖ పేర్కొంది. గతేడాది ఇప్పటి వరకు కేవలం 37.36 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగవడం గమనార్హం. అంటే గతేడాదితో పోల్చితే ఈ యేడాది ఏకంగా 25.82 లక్షల ఎకరాల్లో అధికంగా సాగు కావడం విశేషం.  

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ టాప్‌

ఈ సీజన్‌ సాగులో కుమ్రంభీంఆసిఫాబాద్‌ జిల్లా ఇప్పటివరకు అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో ఇప్పటికే టార్గెట్‌కు మించి సాగు పూర్తికావడం విశేషం.ఈ సీజన్‌లో 3,25,327 విస్తీర్ణంలో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 3,40,458(105శాతం) సాగు పూర్తయింది. ఆ తర్వాత ఆదిలాబాద్‌ జిల్లా 98 శాతంతో, నారాయణపేట జిల్లా 96 శాతంతో సాగులో దూసుకెళ్తున్నాయి. వనపర్తి, జగిత్యాల, ములుగు తదితర జిల్లాల్లో మినహా మెజార్టీ జిల్లాల్లో 70-90 శాతం సాగు పూర్తయింది.

సాకారం దిశగా నియంత్రిత లక్ష్యం

పంట వివరాలు
నియంత్రిత సాగు లక్ష్యం(లక్షల ఎకరాల్లో)
గత ఏడాది ఈ సమయానికి (లక్షల ఎకరాల్లో)
ఈ ఏడాది ఇప్పటి వరకు(లక్షల ఎకరాల్లో)
పత్తి60.16
24.27
45.02
కంది
12.31
3.35
6.87
సోయాబీన్‌
4.68
2.10
3.63


logo