శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 29, 2020 , 02:15:24

ప్రాజెక్టుల కింద సాగు మురిపెం

ప్రాజెక్టుల కింద సాగు మురిపెం

  • కృష్ణా, గోదావరి బేసిన్లలో జలాశయాలు కళకళ
  • ప్రాజెక్టుల కింద 41.09 లక్షల ఎకరాలసాగుకు ప్రణాళిక
  • ఎగువన వర్షాలతో కృష్ణా బేసిన్‌లో ముందుగానే ఇన్‌ఫ్లోలు
  • ఎస్సారెస్పీకి వరద రాకున్నా సిద్ధంగాఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు
  • నిజాంసాగర్‌, సింగూరు ఆయకట్టుపై వీడని సందిగ్ధం

ఎగువన భారీవర్షాలు కురుస్తున్నాయి. స్థానికంగానూ మంచి వర్షపాతం నమోదవుతున్నది. దీంతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కింద సాగునీటి మురిపెం కనిపిస్తున్నది. వానకాలంలో భారీస్థాయి సాగువిస్తీర్ణం నమోదయ్యేందుకు మార్గం సుగమమైంది. రెండుబేసిన్లలో 421 టీఎంసీల కృష్ణా, గోదావరి జలాలతో ఏకంగా 41.09 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందాయి. ఇప్పటివరకు ప్రాజెక్టుల కింద వానకాలం, యాసంగి సీజన్లు కలిపి గరిష్ఠంగా 47.54 లక్షల ఎకరాలకు సాగునీరందించారు. ఈసారి సాగువిస్తీర్ణం రికార్డుస్థాయిలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కృష్ణాబేసిన్‌లో ఎగువ నుంచి వరద కొనసాగుతున్నది. గతేడాదితో పోలిస్తే ముందుగానే ఇన్‌ఫ్లోలు ప్రాజెక్టులను పలుకరిస్తున్నాయి. ఇప్పటికే జూరాల కింద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు నీటివిడుదల కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయంలో 854 అడుగులవద్ద 99.5 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. జలాశయానికి 40వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. అక్కడి నుంచి కరెంట్‌ ఉత్పత్తిద్వారా నాగార్జునసాగర్‌కూ నీటిని పంపుతుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం 543 అడుగులకు చేరింది. ఎడమకాలువకు ఆగస్టు మొదటివారంలో నీటిని విడుదలచేసే అవకాశం ఉండటంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. 

మరోవైపు గోదావరి బేసిన్‌లోనూ వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీరాంసాగర్‌తోపాటు కడెం, ఎల్లంపల్లికి కూడా వరద వస్తున్నది. ప్రాణహిత నుంచి వరద ఉద్ధృతిమొదలైంది. శ్రీరాంసాగర్‌లో ప్రస్తుతం 39 టీఎంసీలు నిల్వ ఉండగా.. శ్రీరాజరాజేశ్వర జలాశయంలో ఆరు టీఎంసీలు, ఎల్లంపల్లిలో ఆరున్నర, కడెంలో ఆరు, ఎల్‌ఎండీలో 12 టీఎంసీల వరకు నీటినిల్వలు ఉన్నాయి. ఎగువ నుంచి వరద సరళినిబట్టి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మోటర్లు నడిపేందుకు అధికారులు సిద్ధంగా ఉండటంతో గోదావరి బేసిన్‌లో ఆయకట్టుకు ఢోకా లేకుండాపోయింది. 

ఎస్సారెస్పీ పరిధిలోనే 140 టీఎంసీలకు పైగా 

రాష్ట్రంలోని అన్ని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతోపాటు, వివిధ లిఫ్టుస్కీంలకింద 421.72 టీఎంసీల కృష్ణా, గోదావరిజలాల వినియోగంతో 41,09,850 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటిపారుదలశాఖ ప్రణాళిక రూపొందింది. ఇందులో భారీప్రాజెక్టుల కింద 36.55 లక్షల ఎకరాల వరకు ఉండగా.. మధ్యతరహా కింద మరో 3.25 లక్షల ఎకరాలు ఉన్నది. ఐడీసీ ప్రాజెక్టుల కింద 1.30 లక్షల ఎకరాల వరకు సాగవుతుందని అంచనావేస్తున్నారు. ముఖ్యంగా శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు పరిధిలో 140 టీఎంసీలు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. లోయర్‌ మానేరు ఎగువన 4.62 లక్ష ల ఎకరాలు, దిగువన 5.05 లక్షల ఎకరాలతోపాటు ఎస్సారెస్పీ -2 కింద మరో 4లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందనున్నది. ఉమ్మడి పాలమూరులోనే జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా, ఆర్డీఎస్‌ కింద 7.5 లక్షల ఎకరాలకుపైగా నీళ్లివ్వాలని ప్రణాళిక వేశారు. ఇప్పటికే ఎగువ నుంచి నాగార్జునసాగర్‌ వరకు ఇన్‌ఫ్లోలు కొనసాగుతున్నాయి. అయితే అధికారులు రూపొందించిన ప్రణాళికలో ఇప్పటివరకు నిజాంసాగర్‌, సింగూరుకు మాత్రమే ఇన్‌ఫ్లోలు మొదలుకాలేదు. మంచి వర్షపాతం నమోదైతే.. చెరువుల కింద కూడా అదనంగా సాగు అందుబాటులోకి రానున్నది.

2014-15 నుంచి ప్రాజెక్టుల కింద సాగువిస్తీర్ణం

ఏడాది
వానకాలం - యాసంగి కలిపి (ఎకరాల్లో)
2014-15
16,50,188
2015-16
3,35,975
2016-17
31,78,668
2017-18
28,13,387
2018-19
33,37,960
2019-20
47,54,595


logo