బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 01:57:50

కిరాయికి సాగు యంత్రాలు

కిరాయికి సాగు యంత్రాలు

  • రైతుల కష్టం తీర్చేలా సెర్ప్‌ కొత్త నిర్ణయం
  • జిల్లాకు ఒక మండలంలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ 
  • గ్రామాల్లో 2,620 టూల్‌ బ్యాంకులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒకటి, రెండు ఎకరాల భూమిని సాగు చేసుకొనే చిన్న, సన్నకారు రైతులకు సొంతంగా వ్యవసాయ యంత్రాలు, పరికరాలు ఉండవు. పొలం పనులు ఎక్కువగా సాగే సీజన్‌లో కూలీలు దొరకడం కూడా కష్టం. సమయానికి అటు పరికరాలు లేక, ఇటు కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) సరికొత్త నిర్ణయానికి తెరతీసింది. వ్యవసాయ పరికరాలు, యంత్రాలను కిరాయికి ఇస్తున్నది. ప్రతి జిల్లాలో ఓ మండలాన్ని ఎంపిక చేసి కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, కలుపుతీత యంత్రాలు, రోటవేటర్లు.. ఇలా వ్యవసాయ పరికరాలన్నింటినీ అందుబాటులోకి తెచ్చింది. గ్రామాల్లో 2,620 టూల్‌ బ్యాంకులను ఏర్పాటు చేసి పవర్‌ బ్రీడర్లు, స్ప్రేయర్లు, టర్మరిక్‌ బాయిలర్స్‌ మొదలైన చిన్న వ్యవసాయ పరికరాలను కూడా కిరాయికి ఇస్తున్నది.

రైతులెవరికైనా కిరాయికి..

సెర్ప్‌ పరిధిలోని ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్లు, మండల సమాఖ్యలు, గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని ఎఫ్‌పీవోలు వీటిని నడుపుతున్నాయి. ప్రస్తుతం జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. కేవలం సమాఖ్యల్లో సభ్యులే కాకుండా, రైతులెవరైనా తమకు కావాల్సిన యంత్రాలు, పరికరాలను తీసుకోవచ్చు. కిరాయిని ఎఫ్‌పీవో బోర్డులు నిర్ణయిస్తాయి. ఈ మేరకు తీర్మానాన్ని చేస్తాయి. ప్రతి జిల్లాలో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలతో సీహెచ్‌సీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందుకోసం రూ.7.80 కోట్లు ఖర్చుచేశారు. స్త్రీనిధి సైతం మరిన్ని సీహెచ్‌సీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

రైతులను ఆదుకొనేందుకే..

రైతు సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. చిన్న రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో సెర్ప్‌ ఆధ్వర్యంలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను అందుబాటులోకి తెచ్చాం. జిల్లాల వారీగా స్థానిక రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకొని యంత్రాలు, పరికరాలను కొన్నాం. రాబోయే రోజుల్లో ఈ కేంద్రాల సంఖ్యను పెంచేందుకు కృషిచేస్తాం.

- సందీప్‌కుమార్‌ సుల్తానియా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి