హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఇన్నోవేషన్ అవార్డులకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ వరకు 18 ఏండ్లలోపు బాలబాలికలకు ఈ పోటీలను నిర్వహించనుండగా, ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. పోటీలు పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతాయని, గెలుపొందిన వారికి మొత్తం 15 బహుమతులను అందజేస్తామని తెలిపారు. మొదటి బహుమతిగా ఒకరికి ఒక లక్ష, రెండో బహుమతిగా ఇద్దరికి రూ. 50వేలు, మూడో బహుమతిగా ముగ్గురికి రూ. 30వేలు, నాలుగో బహుమతిగా నలుగురికి రూ. 20వేలు, ఐదో బహుమతిగా ఐదుగురికి 10 వేల చొప్పున నగదు బహుమతులు అందజేస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు రూపొందించిన నమునాలు, వాటి గురించి వివరణలతోపాటు, విద్యాసంస్థల ప్రాధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు అందజేసిన ధృవీకరణ పత్రాలను జతచేసి ciasc.ipu@niscair.res.in మెయిల్‌కు పంపించాలని సూచించారు. వివరాల కోసం www.cs ir.res.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.