శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:41:40

పల్లెప్రగతి, పారిశుద్ధ్య కార్యక్రమాల తీరుతెన్ను పరిశీలన

పల్లెప్రగతి, పారిశుద్ధ్య కార్యక్రమాల తీరుతెన్ను పరిశీలన

  • రోజూ చెత్తను తొలగిస్తున్నారా?
  • గ్రామస్తులతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాటామంతీ
  • సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు
  • సీఎం ఆదేశాలతో హుటాహుటిన హెలికాప్టర్‌లో పర్యటన

హైదనాబాద్‌/నిజామాబాద్‌, సంగారెడ్డి ప్రతినిధులు/ వికారాబాద్‌ నమస్తే తెలంగాణ : ఏమ్మా.. రోజూ చెత్తను తొలగిస్తున్నారా? పరిశుభ్రత పాటిస్తున్నారా? భగీరథ నీళ్లు వస్తున్నాయా? రోజుకు ఎంతసేపు నీళ్లు వదులుతున్నారు? అంటూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఆకస్మికతనిఖీలు చేపట్టారు. పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావుతో ప్రత్యేక హెలికాప్టర్‌లో ఉద యం 9 గంటలకే కామారెడ్డి చేరుకున్నారు. సదాశివనగర్‌ మండలం తిర్మన్‌పల్లి, కామారెడ్డి మండలం గర్గుల్‌ గ్రామాలను సందర్శించారు. అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం, కొండాపూర్‌ మండలం గుంతపల్లి, వికారాబాద్‌ జిల్లా పెండ్లిమడుగు, నవాబుపేట మండలంలోని దాతాపూర్‌ గ్రామాల్లో పర్యటించారు. పంచాయతీ భవనాలు, మురుగునీటి కాలువల నిర్వహణ, హరితహారం మొక్కల పెంపకం, నర్సరీలు, డంప్‌యార్డులు, వైంకుంఠధామాల నిర్మాణాలను పరిశీలించారు. రోడ్లను తనిఖీచేశారు.

ఆయాచోట్ల సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకే ఆకస్మికంగా పర్యటనలు చేస్తున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు అద్భుత ఫలితాలనిస్తున్నాయని చెప్పారు. రెండు విడుతలుగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెలు బాగుపడ్డాయని, మొక్కల పెంపకం ఉద్యమరూపంలో కొనసాగుతున్నదని అన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో పల్లెలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయని, ఈ క్రమంలోనే జ్వరాలు, వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు. పంచాయతీల అ భివృద్ధికి ప్రభుత్వం ప్రతినెలా రూ.308 కోట్లు విడుదల చేస్తున్నదని అన్నారు. ప్రతిగ్రామంలో ట్రాక్టర్‌, వాటర్‌ట్యాంకర్‌, చెత్త తొలగించడానికి డోజర్ల పంపిణీ జరిగిందని, పారిశుద్ధ్య నిర్వహణ కోసం గ్రామాలకు వాహనాలు అందించడం దేశంలోనే ఎక్కడా లేదని చెప్పారు. 

గ్రామాల్లోనూ పార్కులుండాలి

ప్రతిగ్రామంలో కొంత స్థలంలో గ్రీన్‌పార్క్‌ ఉండేలా చూడాలని సీఎస్‌ అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలో పచ్చటి మొక్కల ఉన్న చిన్నపార్క్‌ను చూసి బాగుందంటూ సర్పంచ్‌ను అభినందించారు. కామారెడ్డి జిల్లాలో తనిఖీల్లో భాగంగా ఓ గ్రామంలోని వైకుంఠధామంలో ఫ్రీజర్‌ను ఏర్పాటుచేశారని సీఎస్‌ చెప్పారు. ఆ జిల్లానుంచి చాలామంది గల్ఫ్‌దేశాలకు వెళ్తుంటారని.. ఎవరైనా మృతిచెందితే వారి కుటుంబసభ్యులు వచ్చేవరకు మృతదేహాన్ని భద్రపరిచేలా ఈ ఆలోచన రావడం అభినందనీయమన్నారు. logo