గురువారం 28 మే 2020
Telangana - May 21, 2020 , 00:53:11

స్వస్థలాలకు లక్షమంది

స్వస్థలాలకు లక్షమంది

  • వలస కార్మికులను పంపిన రాష్ట్ర ప్రభుత్వం
  • 74 ప్రత్యేక రైళ్ల కోసం 8.5 కోట్లు చెల్లింపు
  • అధికారులతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సమీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌లో ఇప్పటివరకు రాష్ట్రంనుంచి స్వస్థలాలకు వెళతామన్న వివిధ రాష్ర్టాలకు చెందిన 1,01,146 మంది వలస కార్మికులను తెలంగాణ ప్రభుత్వం 74 ప్రత్యేక రైళ్ల ద్వారా పం పించింది. ఇందుకోసం రైల్వేకు రూ.8.5 కోట్లు చెల్లించింది. ఇంకా ఎవరైనా సొంతూళ్లకు వెళ్తామని చెప్తే పం పించేందుకు ఇబ్బందులు అన్ని ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించింది. వలస కార్మికుల తరలింపు ఏర్పాట్లపై బుధవారం బీర్కేభవన్‌లోని సచివాలయంలో డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌.. అధికారులతో సమీక్షించారు. వలసకూలీలను స్వరాష్ట్రాలకు పంపించిన నోడల్‌ అధికారుల బృం దం, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్‌, రంగారెడ్డి పోలీస్‌ కమిషనర్లు, రైల్వే తదితరశాఖల అధికారులకు అభినందనలు తెలిపారు.  సమావేశంలో దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా, పం చాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఎస్సీశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఆర్థికశాఖ కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌, పోలీస్‌శాఖ అదనపు డీజీ జితేందర్‌, పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్‌, మహేశ్‌భగవత్‌, సజ్జనార్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు వాసం వెంకటేశ్వర్లు, అమయ్‌కుమార్‌పాల్గొన్నారు.

గడువులోగా రోడ్ల నిర్మాణం

నిర్ణయించిన గడువులోగా రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌ సమస్యలను జిల్లాలవారీగా తయారుచేయాలని, కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. బుధవారం బీర్కే భవన్‌లో హైవేలనిర్మాణంపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. హైవేల నిర్మాణానికి భూసేకరణ, అటవీ అనుమతులతోపాటు మెట్రో వాటర్‌వర్క్స్‌, జీహెచ్‌ఎంసీ, ట్రాన్స్‌కో, మిషన్‌భగీరథ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించారు.  సమావేశంలో రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, పీసీసీఎఫ్‌ శోభ, రోడ్లు భవనాలశాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, రీజినల్‌ ఆఫీసర్‌ రవిప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo