గురువారం 26 నవంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 01:57:59

మీ భూములు 100% భద్రం

మీ భూములు 100% భద్రం

  • ధరణి పోర్టల్‌ దేశానికే ట్రెండ్‌ సెట్టర్‌ 
  • వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు రక్షణ
  • కొత్తచట్టంతో అధికార్ల విచక్షణాధికారాలు రద్దు
  • దొంగ డాక్యుమెంట్లు, అవినీతికి చరమగీతం బ్యాంకు లావాదేవీల్లా భూ క్రయవిక్రయాలు దరఖాస్తు నుంచి హక్కుమార్పిడి దాకా ఆన్‌లైన్‌లో
  • త్వరలో రాష్ట్రవ్యాప్తంగా భూముల డిజిటల్‌ సర్వే
  • ‘నమస్తే తెలంగాణ’తో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నూతన రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం అందులో భాగంగా ధరణి పోర్టల్‌తో రికార్డులన్నింటినీ డిజిటలైజ్‌ చేయనుంది. ఈ వెబ్‌సైట్‌తో భూ లావాదేవీలు కూడా బ్యాంకుల్లో డబ్బులు తీసుకున్నంత సులభంగా మారనున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ చెప్పారు. నూతన రెవెన్యూ చట్టం దేశంలోనే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలువనున్నదని అన్నారు. ధరణి వెబ్‌సైట్‌ దసరా పర్వదినం తర్వాత అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ కొత్త చట్టం రూపకల్పనలో కీలకంగా వ్యవహరించి, చట్టం అమలుకు, ‘ధరణి’ నిర్వహణకు కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..భూ వివాదాల్లేని తెలంగాణ రావాలన్న 

సీఎం కేసీఆర్‌ కలను కొత్త రెవెన్యూ చట్టం, ధరణి సాకారంచేస్తాయా? 

విప్లవాత్మకమైన చట్టం ఇది. రైతులందరికీ న్యాయం జరుగుతుంది. స్వయంగా సీఎం కేసీఆర్‌ ఈ చట్టం ఎలా ఉండాలో వివరించారు. రైతులకు ఉపయోగపడేలా ఎలా ఉండాలో ఒక్కో క్లాజ్‌పై స్వయంగా సూచనలు చేశారు. ఆయన ఇన్వాల్వ్‌మెంట్‌తో చట్టం అద్భుతంగా వచ్చింది. ఈ చట్టం మన దేశానికే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుంది. ఆర్వోఆర్‌ చట్టం చాలా సింపుల్‌గా, ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా ఉన్నది. గతంలో పట్టాదార్‌ పాస్‌పుస్తకం ఉన్నప్పటికీ క్రయవిక్రయాలు చేసినా, భూ యజమాని చనిపోతే వారసులకు పట్టా చేయటం చాలా కష్టంగా ఉండేది. అధికారుల చుట్టూ తిరుగాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి ఉండదు. రైతులు ఒక మాట అనుకొని అదే విషయాన్ని దరఖాస్తు చేసుకొని, తాసిల్దార్‌ ఇచ్చిన సమయానికి కార్యాలయానికి వెళ్లి సంతకం చేస్తే చాలు. అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతాయి.

కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌ అమలవుతుందా?

భూముల క్రయవిక్రయాల్లో కోర్‌ బ్యాంకింగ్‌ తరహా సిస్టమ్‌ అమలవుతుంది. ‘ధరణి’లో రిజిస్ట్రేషన్‌ చాలా సులువవుతుంది. ఒక రైతు తనకున్న ఒక సర్వే నంబర్‌లో కొంత భూమిని విక్రయిస్తే, రిజిస్ట్రేషన్‌ కాగానే ఆ మేరకు భూమి విక్రయించిన రైతు ఖాతాలో తగ్గిపోతుంది.  కొనుగోలు చేసిన వ్యక్తికి అప్పటికే పట్టాదార్‌ పాస్‌పుస్తకం ఉంటే ఆ ఖాతాలోకి భూమి చేరుతుంది. లేకుంటే అప్పటికప్పుడు కొత్త ఖాతా నంబర్‌తో ఈ పాస్‌పుస్తకం ఇస్తారు. భూమి క్రయవిక్రయాలు చేయాలనుకున్న వ్యక్తి రిజిస్ట్రేషన్‌ కోసం ఇంటి వద్ద నుంచే తన కంప్యూటర్‌ లేదా మొబైల్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. అందులో ఇచ్చిన సమయానికి అమ్మే వ్యక్తి, కొనే వ్యక్తి వెళ్లగానే 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం బ్యాంకులో డబ్బులు దాచుకోవడం, తీసుకోవడం మాదిరిగానే ఉంటుంది. ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండదు.  భూమి వివరాలు, లావాదేవీలు మొత్తం బయోమెట్రిక్‌పై ఆధారపడి ఉంటాయి. కాబట్టి భూమిని ఇంకొకరు విక్రయించలేరు. ధరణిలోని డాటాను తాసిల్దార్‌ కూడా ఏమీ చేయలేరు. ప్రతిదీ డిజిటల్‌ సంతకం ద్వారా జరుగాల్సిందే. దరఖాస్తులు కూడా ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌లోనే వెళ్తాయి. ఒక రైతు తన భూమిని వేరేవాళ్లు ఆక్రమించారని, దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని చెప్పడానికి ఆస్కారం ఉండదు. భూములకు వందకు వంద శాతం ‘ధరణి’ ద్వారా భద్రత ఉంటుంది.

పేర్లు తప్పు పడటం, విస్తీర్ణం నమోదులో తేడాలు, వారసుల పేర్ల మీద పట్టాలు రాకపోవడం వంటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? 

ఇలాంటి సమస్యలన్నింటిపై ఏమి చేయాలో విస్తృతంగా చర్చలు జరిగాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వం సాదాబైనామాకు మరోసారి అవకాశం ఇచ్చింది. ప్రతి సమస్యకు ఈ చట్టంలో పరిష్కారం ఉంటుంది. అర్జీలు పెట్టుకుంటే.. దానికి సంబంధించిన వాళ్లను పిలిచి చర్చించి సరిచేస్తాం. ఇక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా తయారుచేస్తాం. ఈ స్థాయిలో పరిష్కారం కాకుంటే కోర్టుకు వెళ్లాల్సిందే.

రిజిస్ట్రేషన్‌ జరిగి మ్యుటేషన్‌ కాని భూములను ఏం చేస్తారు?

ఈ చట్టం రావడానికి ముందు కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాంటి వాటికి మ్యుటేషన్‌ అవకాశం ఇస్తాం. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించి నాన్‌ డిస్కషన్‌ పద్ధతిలో (విచారణ లేకుండా) క్లియర్‌ చేస్తారు. మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతున్నది. 

22(ఏ) కింద ఉన్న భూముల పరిస్థితి ఏమిటి? 

డిజిటల్‌ సర్వే చేయగలిగితే భూమి సంబంధ సమస్యలు మొత్తం పరిష్కారం అవుతాయని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు. పైన పేర్కొన్న సందర్భాల్లో వాటికి బై నంబర్లు ఇచ్చి 22(ఏ) నుంచి మినహాయించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటన్నింటినీ  పరిష్కరిస్తాం. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు డిజిటల్‌ సర్వే చేస్తాం. 

వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదులో యజమానులు ఇచ్చిన సమాచారాన్ని ఎలా ధ్రువీకరిస్తారు?

‘ధరణి’లో ఖాళీ ప్లాట్ల నమోదు ఆప్షన్‌ ఇవ్వలేదు. నిర్మాణం ఉంటేనే నమోదవుతుంది. లేఅవుట్‌ అప్రూవల్‌ లేనివాళ్లు ఎఆర్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంటారు. రాష్ట్రంలో 1.08 కోట్ల ఆస్తులుంటే ఇప్పటికి 81 లక్షల ఆస్తుల సర్వే జరిగింది. ‘ధరణి’లో ఎంట్రీ చేసిన వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. అభ్యంతరాలొస్తే వాటిపై ఎంక్వైరీ చేస్తాం. వివాదాస్పద ఆస్తులుంటే పార్ట్‌(బీ)లో పెడతాం. అన్నీ సరిగ్గా ఉండి, వివాదం లేనివాటిని ధరణిలో పొందుపరిచి వ్యవసాయేతర పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు ఇస్తాం. 

ధరణి డాటా భద్రతకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి?

‘ధరణి’ డాటా చాలా విలువైనది. ఈ డాటాకు ఎలాంటి సమస్యలు రాకుండా రెండు లొకేషన్లలో ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. అలాగే మరోచోట కూడా ఏర్పాటుచేయాలని భావిస్తున్నాం. ఈ డాటాకు హై సెక్యూరిటీ, హై క్వాలిటీ ఉంటాయి.

ధరణి రూపకల్పనకు ఎలాంటి అధ్యయనం చేశారు? ధరణి బృందం ఎక్కడైనా పర్యటించిందా?

కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీల తీరును అధ్యయనం చేశాం. కాళేశ్వరం నిర్మాణ సమయంలో మహారాష్ట్రలోని కొన్ని భూములు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు అక్కడి రిజిస్ట్రేషన్‌ విధానం అర్థమైంది. అలాగే మన రైతుల సమస్యలు తెలుసుకున్నాం. పాత పద్ధతిలో అవినీతికి ఆస్కారం ఉన్నదని గుర్తించాం. లంచాలకు తావులేని నూతన విధానంపై లోతుగా అధ్యయనం చేసి, సాంకేతిక సహాయంతో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని భావించాం. ఈ మేరకు మొత్తం భూముల డాటాను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. ఈ సమాచారం మొత్తం సురక్షితంగా ఉన్నది. విదేశాల్లో ఉన్న వ్యక్తి కూడా ధరణి పోర్టల్‌ ద్వారా తన భూమి భద్రంగా ఉన్నదో లేదో తెలుసుకోవచ్చు. మార్కెట్‌ విలువను బట్టి రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఎక్కడా మనుషుల ప్రత్యక్ష ప్రమేయం ఉండదు. 

రాష్ట్ర ప్రభుత్వం టైటిల్‌ గ్యారెంటీ దిశగా అడుగులు వేస్తున్నదా?

భూమి వివరాలతో పట్టాదార్‌ పాస్‌పుస్తకం ఉన్నదంటేనే టైటిల్‌ గ్యారెంటీ ఉన్నట్టు. మీ భూమిని ఎవ్వరూ టచ్‌ చేయలేరు. మనం పూర్తిగా టైటిల్‌ గ్యారెంటీకి వెళ్లకపోయినా అంతవరకు చేరుకున్నాం. మీ భూమి వివరాలన్నీ ‘ధరణి’ పోర్టల్‌లో ఉన్నప్పుడు.. మీ ప్రమేయం లేకుండా ఆ భూమిని ఎవ్వరూ ఆమ్మలేరు, కొనలేరు. మీ పేరుతో ఇంకొకరిని తీసుకువెళ్లి దొంగ రిజిస్ట్రేషన్‌ చేయలేరు. మీ వివరాలన్నీ పూర్తిగా ఆధార్‌తో లింక్‌ అయి ఉంటాయి. మీ డిజిటల్‌ సంతకం కూడా ఉంటుంది. మీ భూమిని తాసిల్దార్‌ కూడా అవినీతికి పాల్పడి ఇంకొకరికి రిజిస్టర్‌ చేయలేడు. తాసిల్దార్‌ డిజిటల్‌ కీ ద్వారానే రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుంది. తప్పుడు పనిచేయాలని చూస్తే తాసిల్దార్‌ వెంటనే దొరికిపోతాడు. ఎవరికీ విచక్షణాధికారాలు ఇవ్వలేదు. రికార్డుల ఆధారంగానే పనిచేయాలి.