శనివారం 04 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 01:27:40

కూలీలకు విధిగా పని కల్పన

కూలీలకు విధిగా పని కల్పన

  • ఉపాధి హామీపై అధికారులకు సీఎస్‌ ఆదేశం
  • రేపు మంత్రులు, కలెక్టర్లతో సీఎం భేటీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉపాధిహామీ పథకం కింద కూలీలకు విధిగా పని కల్పించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బీఆర్కే భవన్‌లో  ఆదివారం ఆయన నీటిపారుదల, పం చాయతీరాజ్‌శాఖల పనులను ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేయడంపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ వానకాలం సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో వచ్చే 30రోజుల్లో కూలీలందరికీ పనులు కల్పించాలని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద పనులు కల్పించడం ద్వారా గ్రామీణప్రాంతాల్లో పేదలకు సకాలంలో డబ్బులు చేతికి అందుతాయన్నారు. 

ప్రజల కొనుగోలుశక్తి పెరుగుతుందని తెలిపారు. కాలువల నిర్మాణం, ఫీడర్‌ చానల్‌ పనులు ఈ పథకం కింద చేపట్టాలని సూచించారు. నరేగా, వ్యవసాయ పనులపై ఈ నెల 16న సీఎం కేసీఆర్‌.. మంత్రులు, జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమవుతున్న నేపథ్యంలో సీఎస్‌ ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం రూపొందించిన ముసాయిదాతోపాటు మంత్రులు, కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌, సలహాలు, సూచనలతోపాటు క్షేత్రస్థాయి పరిస్థితులను సీఎం కేసీఆర్‌ బేరీజు వేసి తుది కార్యాచరణ ప్రణాళికను ప్రకటించనున్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


logo