గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 02:15:33

మరిన్ని కరోనా పరీక్షలు

మరిన్ని కరోనా పరీక్షలు

  • 4 లక్షల ఆర్‌ఏటీ కిట్లకు ఆర్డర్‌.. 
  • దవాఖానల్లో చేరే ప్రక్రియ సరళం
  •  నాచారం ఈఎస్‌ఐలో చికిత్స..
  • ఎమ్మారై, సీటీ స్కాన్‌ ధరలు త్వరలో ఖరారు
  • ఆదేశాల అమలుకు రెండువారాలు..
  • అధికారుల పరిస్థితినీ అర్థంచేసుకోవాలి
  •  హైకోర్టును కోరిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కొవిడ్‌-19 పరీక్షల సంఖ్యను పెంచుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ హైకోర్టుకు నివేదించారు. ప్రస్తుతం రెండు లక్షల ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టు కిట్లు అందుబాటులో ఉన్నాయని, మరో నాలుగు లక్షల కిట్లకు ఆర్డరిచ్చామని వెల్లడించారు. కొవిడ్‌ -19 పరీక్షలకు సంబంధించి దాఖలైన 17 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ విచారణకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తోపాటు ఆరోగ్య, మున్సిపల్‌శాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, ప్రజారోగ్యం, వైద్య విద్య డైరెక్టర్లు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సచివాలయం నుంచి హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాలమేరకు ఆరోగ్యశాఖ బులెటిన్‌ స్వరూపాన్ని మార్చి అన్ని రకాల వివరాలు పొందుపరిచి, ప్రజలకు అన్ని అంశాలు తెలియజేస్తున్నామని సీఎస్‌ వివరించారు. వైద్యులను, కరోనారోగులను ఒకే వేదికపైకి తెచ్చి వైద్య సలహాలు అందించడానికి హితం అనే యాప్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, ఇప్పటికే ఐదు జిల్లాల్లో దీన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలుచేస్తున్నామన్నారు. ఈ యాప్‌ ద్వారా ఒక్కో డాక్టర్‌ కనీసం 50 మంది రోగులకు వైద్యసలహాలు అందజేస్తారని తెలిపారు. 173 మంది వైద్య సిబ్బంది ఈ పైలట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే ఎన్‌రోల్‌ చేసుకున్నారని, దీనిని రాష్ట్రం మొత్తం విస్తరించడానికి ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. ఈ యాప్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. 

ఐసొలేషన్‌ వార్డులుగా 867 హోటల్‌ గదులు

కొవిడ్‌-19 అనుమానితులను ఐసొలేషన్‌లో ఉంచడానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానలకు సమీపంలో ఉన్న 867 హోటల్‌ గదులను అందుబాటులోకి తెచ్చామని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ హైకోర్టుకు తెలిపారు. తగినన్ని గదులు కేటాయించాలని 1,2,3 స్టార్‌ హోటళ్లను అధికారులు కోరినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 248 గదుల్లో బాధితులు ఉన్నారని, మిగతావి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిలో 87 శాతం మందికి హోం ఐసొలేషన్‌ సరిపోతుందని పేర్కొన్నారు. పేదవారు హోటల్‌ గదుల ఖర్చును భరించలేరని పిటిషనర్‌ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొనిరాగా, ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్‌హాళ్లు, సంక్షేమ భవనాలను ఐసొలేషన్‌ కేంద్రాలుగా మార్చే అంశాన్ని పరిశీలించాలను ధర్మాసనం సీఎస్‌కు సూచించింది. 

నాచారం ఈఎస్‌ఐలో చికిత్స 

నాచారం ఈఎస్‌ఐలో ఇప్పటివరకు స్వల్ప లక్షణాలున్నవారికే చికిత్స అందించామని, ఇకపై మధ్యస్థ లక్షణాలున్నవారికి కూడా చికిత్స చేస్తామని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. అక్సిజన్‌ సౌకర్యం కల పడకలను కూడా ఏర్పాటుచేస్తామన్నారు. ప్రైవేట్‌ దవాఖానల్లో రోగులను చేర్చుకొనేందుకు యాజమాన్యాలు నిరాకరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రోగులను చేర్చుకొనే ప్రక్రియను సులభతరంచేస్తామని పేర్కొన్నారు. ఏయే దవాఖానల్లో ఏయేరకమైన బెడ్లు అందుబాటులో ఉన్నాయో హెల్త్‌ బులెటిన్‌ ద్వారా ప్రకటిస్తామని చెప్పారు. ఎమ్మారై, సీటీస్కాన్‌, ఇతర పరీక్షల ధరలను కూడా త్వరలోనే నిర్ణయిస్తామని, ఈ మేరకు ప్రైవేట్‌ దవాఖానల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. కొవిడ్‌ బాధితుల ఫిర్యాదుల కోసం 85 టెలిఫోన్‌లైన్లు 24 గంటలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు హాస్పిటళ్లపై 726 ఫిర్యాదులు అందాయని తెలిపారు. 

కేంద్ర మార్గదర్శకాలు పాటిస్తున్నాం

ప్రైవేట్‌ హాస్పిటళ్లను నియంత్రించడానికి కేంద్ర మార్గదర్శకాలను తప్పకుండా అమలుచేస్తామని, బీమా కంపెనీలు కూడా నిబంధనలకు అమలుచేస్తున్నాయని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1,085 కంటైన్‌మెంట్‌ జోన్లలో 2,941 బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఆరోగ్యబీమా కలిగిన రోగులకు పాలసీని రూపొందించాలని ఈ సందర్భంగా హైకోర్టు సూచించింది. మీడియా బులెటిన్‌లో పొరపాట్లను సరిచేయాలని ధర్మాసనం కోరింది. 21-50 ఏండ్ల మధ్య వయసువారు ఎక్కువగా కరోనాబారిన పడుతున్న విషయాన్ని ప్రచారంచేయాలని పేర్కొన్నది. ఈ వైరస్‌కు సంబంధించిన సంక్లిష్ట సమాచారం ఆంగ్ల, ప్రాంతీయ భాషా పత్రికల్లో వచ్చేలా సమాచార కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మీడియా బులెటిన్‌ను తెలుగులో కూడా ఇవ్వాలని ఆదేశించింది. టెస్టుల సంఖ్యను పెంచాలని, అన్ని దవాఖానల వద్ద డిస్లే బోర్డులను పెట్టాలని సూచించింది. 

4 లక్షల కిట్లకు ఆర్డర్‌

రాష్ట్రంలో రెండులక్షల ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని, మరో 4 లక్షల కిట్లుకు ఆర్డర్‌ ఇచ్చామని సీఎస్‌ పేర్కొన్నారు. ప్రతి మిలియన్‌ జనాభాకు వీలైనంత ఎక్కువ టెస్ట్‌లు చేసేలా చర్యలు తీసుకుంటున్నామనిన్నారు. రాపిడ్‌ టెస్ట్‌లపై నిపుణులతో చర్చించాలని సీఎస్‌కు హైకోర్టు సూచించగా, చర్చించి వివరాలు తెలియజేస్తామని సీఎస్‌ తెలిపారు. హైకోర్టు జారీచేసిన అన్ని ఆదేశాలను తుచా తప్పకుండా పాటిస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో కొన్ని పరిమితులకు లోబడి పనిచేస్తున్న అధికారుల ఇబ్బందులను కూడా ధర్మాసనం దృష్టిలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ఆదేశాల అమలుకు రెండు వారాల గడువు ఇవ్వాలని కోరారు. ఆ మేరకు రెండు వారాల గడువు ఇచ్చిన ధర్మాసనం విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. 


logo