గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 03:01:48

రైతు మెడకు కరెంటు తీగ

రైతు మెడకు కరెంటు తీగ

  • ప్రతి మోటర్‌కూ తప్పని మీటర్‌.. క్రాస్‌ సబ్సిడీలకు చెల్లుచీటీ

ఒగప్పుడు ఊళ్లల్లె బిల్లు కలెక్టరుండేటోడు. ఆయన్ని చూస్తే.. జిల్లా కలెక్టర్‌ కంటే ఎక్కువగా రైతులు గజ్జున వణికి సచ్చేది. బిల్లు తక్కువెయ్యమని ఆయన్ని బతిమాలుడు.. బామాలుడు.. దావత్‌లు ఇచ్చుడు.. ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు సొంతరాష్ట్రమొచ్చింది. తెలంగాణల పొద్దుగాల, పొద్దుమీకి అనకుండ కరెంటు వస్తున్నది. రెప్పపాటు కూడా కరెంటు పోతలేదు.  కేసీఆర్‌ సారు మంచి కరెంటును ఫ్రీగ ఇస్తున్నడు. మోటర్‌కు మీటర్‌ లేదు.. వాడిన కరెంటుకు బిల్లు అడిగెటోడు లేడు.ఇప్పుడు మోదీ పుణ్యమా అని మోటర్‌కు మీటర్‌ వస్తది. మీటర్‌తోపాటే బిల్‌ కలెక్టరూ వస్తడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. రెండుమూడు వేల మంది వస్తరు. ఇంక ఆయన దయ.. అన్నదాత ప్రాప్తి.. రైతు పెనం మించి పడకుండానే నేరుగా పొయ్యిలో పోయి పడతారు. ఇది నిజం.. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రతిపాదించిన విద్యుత్‌ చట్ట సవరణ ముసాయిదా బిల్లులోని అంశాలు చూస్తే గుండె పగిలిపోతుందా అన్నట్టున్నది.  

గెయిల్‌ వంటి ఇంధన సంస్థల్ని ప్రైవేటుపరం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం జెట్‌ స్పీడులో దూసుకుపోతున్నది. రక్షణరంగంలోనూ ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించి.. మోదీ ప్రభుత్వం దేశ భద్రత విషయంలో పెద్ద దుస్సాహసానికే ఒడిగట్టింది. 

 రైల్వే స్టేషన్‌లో తాను చాయ్‌ అమ్మానని గొప్పలు చెప్పిన ప్రధాని.. ఇప్పుడు గరీబోళ్ల గాడీని ప్రైవేటు చేతిలో పెట్టారు. రైల్వే రూట్లను ఒక్కో కార్పొరేట్‌ కంపెనీకి అప్పగించి.. పేదోడి ప్రయాణభారాన్ని పెంచారు. 

వైమానిక రంగానికే తలమానికమైన ఎయిరిండియాను అంగట్లో పెట్టారు. రేపో, మాపో రేటొస్తే దాన్ని అమ్మేందుకు బలిపీఠం ఎక్కించారు. ఒకవేళ దాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రాకపోయినా, నిబంధనలు సడలించి మరీ ప్రైవేట్‌పరంచేయడానికి కుట్రచేస్తున్నది. 

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో దేదీప్యమానంగా వెలుగుతున్న బొగ్గు గనుల బ్లాకులను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు మోడీ సర్కారు ఇప్పటికే ముసాయిదాను సిద్ధం చేసింది. వేలం పాటలకు కూడా రంగం రెడీ అవుతున్నది. రాత్రికి రాత్రి ఇవి కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోవడం ఖాయమైంది.  

దిగ్గజ కార్పొరేట్‌ సంస్థలు రిలయన్స్‌, జియోకు లాభం చేకూర్చేందుకు ప్రజాసంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ గొంతు నులిమేందుకు మోడీ ప్రభుత్వం ఇప్పటికే దాని మెడ చుట్టూ ఉచ్చు బిగించింది. ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకొనేందుకు వేగంగా పావులు కదుపుతున్నది. ఈ విధాన నిర్ణయం వల్ల ఇప్పటికే లక్షల మంది ఉద్యోగులను వీఆర్‌ఎస్‌ పేరుమీద రోడ్డున పడేశారు.  


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్రవిద్యుత్‌ సవరణల ముసాయిదా బిల్లు సెక్షన్‌ 62 ప్రకారం.. ఇకపై వంట గ్యాస్‌ సబ్సిడీ మాదిరిగా (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌-డీబీటీ) పద్ధతిలో విద్యుత్‌ సబ్సిడీలనుకూడా ప్రభుత్వం నేరుగా వినియోగదారులకే చెల్లిస్తుంది. ఇది రైతాంగానికి శరాఘాతం. ఈ ముసాయిదా చట్టరూపం దాల్చితే.. ప్రతి వ్యవసాయ కనెక్షన్‌కు త్రీ ఫేజ్‌ మీటరు పెట్టాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 24.5 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికీ మీటర్లు అమర్చి.. నెలనెలా ఎన్ని యూనిట్లు విద్యుత్‌ కాల్చారో.. లెక్కలు తీయాలి. సాధారణంగా వ్యవసాయ బోరుకు 5 హెచ్‌పీ మోటర్‌ బిగిస్తారు. ఉదాహరణకు వానకాలం, యాసంగి పంటల కాలాన్ని పరిగణనలోకి తీసుకొంటే.. ఏడాదిలో 8-9నెలలపాటు మోటర్‌ను రైతు ఉపయోగిస్తాడు. రోజుకు 8గంటలపాటు మోటర్‌ నడిపినా గంటకు 3.7 యూనిట్ల చొప్పున రోజుకు 30 యూనిట్లు వాడుకొంటారు. ఈ లెక్కన 9 నెలలకు (270 రోజులు) సుమారు 8 వేల యూనిట్లను ఒక మోటర్‌కు వినియోగిస్తాడు. ఇక్కడ ఇంకో కిరికిరి ఉంది. వినియోగదారులకు ఏ ధరకు విద్యుత్‌ను ఇవ్వాలన్నదాంట్లో కేంద్రం జోక్యం చేసుకొంటుంది. ఉత్పత్తికి అయిన ఖర్చు, ట్రాన్స్‌మిషన్‌ నష్టాలు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి యూనిట్‌ ధరను నిర్ణయిస్తారు.

ఈ లెక్కన ఒక యూనిట్‌కు కనీసం రూ.6 అనుకున్నా.. సుమారు రూ.48 వేలు అవుతాయి. అంటే రైతు నెలకు సుమారు రూ.4 వేల వరకు విద్యుత్‌ బిల్లును ముందుగా కట్టాలి. ఒకవేళ రెండు, మూడు మోటర్లు ఉంటే.. బిల్లుకూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆపై సబ్సిడీని డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) పద్ధతిలో రైతు బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. అది ఎంత అనేది తెలియదు. పూర్తిగా సబ్సిడీ ఇవ్వదనేది మాత్రం ఖాయం. ఇకపై ఉచిత విద్యుత్‌ ఉండదు.. 24 గంటలపాటు సరఫరా కూడా ఉండదు. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా.. ఇవ్వకున్నా.. వినియోగదారుడైన రైతు మాత్రం ఠంచనుగా బిల్లును కట్టాల్సిందే. దీని పర్యవసానం వ్యవసాయం ఛిన్నాభిన్నమవడమే.

రైతులు ఆత్మహత్యల బాటపట్టే పరిస్థితులను మళ్లీ ఆహ్వానించడమే. వ్యవసాయ మోటర్‌కు మీటర్‌ పెట్టడం వెనుక కేంద్రం ఇంతగా కుట్ర పన్నింది. వాస్తవానికి సాగుకు అవసరమైన నీళ్లకోసం రైతులు విద్యుత్‌ను వినియోగిస్తారు. కాల్వలు, చెరువుల ద్వారా నీళ్లు పొందే రైతులకు అయ్యే ఖర్చుతో పోలిస్తే.. అదే నీటిని బోర్లద్వారా తోడితే అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. కాల్వల కింద పండించినా.. మోటర్‌తో పండించినా.. ఒకే దిగుబడి వచ్చినప్పటికీ.. మోటర్‌ కింద వాడే విద్యుత్‌కు అయ్యే చార్జీలు తడిసి మోపెడవుతాయి. ఈ దృష్టితోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నది. కానీ కేంద్రం మాత్రం రైతు మెడకు కరెంటు ఉచ్చు బిగిస్తున్నది. 

నిరంతర విద్యుత్‌ కీలకం

విద్యుత్‌ మన జీవితంలో ఒక ప్రాథమిక అవసరంగా మారింది పొద్దున లేచినప్పటినుంచి విద్య, వైద్యం, రవాణా, వంట, వ్యవసాయం, పరిశ్రమలు, వినోదం.. ఇలా అన్ని రంగాలూ విద్యుత్‌తో ముడిపడి ఉన్నవే. దేశం గానీ, రాష్ట్రంగానీ పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నిరంతర విద్యుత్‌ ఇవ్వడమనేది ప్రధానాంశం. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును తీసుకొస్తున్నది. ముసాయిదా బిల్లులోని సెక్షన్‌ 2, క్లాజ్‌ 17 ప్రకారం.. డిస్కంల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ పంపిణీని ఫ్రాంచైజీలకు, సబ్‌ లైసెన్సీలకు అప్పగించేలా సవరణ చేశారు. లాభదాయక ప్రాంతాలను సబ్‌ లైసెన్సీలు, ఫ్రాంచైజీల చేతిలో పెడితే.. డిస్కంలకు ఆదాయం తగ్గుతుంది. నష్టాలొచ్చే ప్రాంతాలను వాటికి ఇచ్చినా.. వినియోగదారుల నుంచి బిల్లులను ముక్కుపిండి వసూలు చేస్తారు. 

ఈఆర్సీపై కేంద్రం పెత్తనం

ప్రస్తుతం విద్యుత్‌ నియంత్రణ మండలిలో సభ్యులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. కేంద్రబిల్లు ఆమోదం పొందితే.. ఈ అధికారం కేంద్రం ఎంపిక చేసిన కమిటీకి సంక్రమిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ ఉండదు. స్థానికంగా మన రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి.. వినియోగదారుల పరిస్థితిని సానుభూతితో సమీక్షించే పరిస్థితి ఉండదు. ఈఆర్‌సీ ఉండదు.. పీఆర్‌సీ (ప్రైవేట్‌ నియంత్రణ మండలి) ఉండదు. ప్రైవేట్‌ వ్యక్తుల ప్రాబల్యం పెరిగిపోతుంది. వ్యవసాయ రంగానికి మళ్లీ గోస తప్పదు.  

రెన్యూవబుల్‌ ఎనర్జీ పాలసీ


కేంద్ర బిల్లులోని సెక్షన్‌ 3లో పేర్కొన్న అంశాలు డిస్కంలకు ఉరివేసేవిగా ఉన్నవని నిపుణులు ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రతి డిస్కం ఏటా వినియోగించే విద్యుత్‌ మొత్తంలో తప్పనిసరిగా కొంత మొత్తంలో పునరుత్పాదక ఇంధనం ఉండాలి. ఆ మొత్తం ఎంత అనేది కేంద్ర సంస్థలే నిర్ణయిస్తాయి. దీనితో స్థానికంగా ఉన్న హైడల్‌, థర్మల్‌ ప్రాజెక్టులు ప్రభావితం అవుతాయి. ఒకవేళ కేంద్రం నిర్ణయించినంతమేర రెన్యూవబుల్‌ ఎనర్జీని ఉపయోగించుకోకపోతే జరిమానాలను డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఏటేటా రెట్టింపు అవుతుంది. దీనివల్ల మన థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులను మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఉత్తర భారతంలో నిర్మిస్తున్న హైడ్రో పవర్‌ స్టేషన్ల నుంచి తక్కువ ధరకు లభించే విద్యుత్‌ను మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కానీ అదే స్థాయిలో చవకకు లభించే మన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ హైడ్రో పవర్‌ను ఆ జాబితాలో చేర్చకపోవడంతో దానిని మనం కోల్పోవాల్సి ఉంటుంది. తద్వారా డిస్కంలపై పెను భారం పడి.. అవి ఆర్థికంగా కోలుకోలేని విధంగా తయారవుతాయి.


క్రాస్‌ సబ్సిడీలు రద్దు 

కేంద్ర బిల్లులోని సెక్షన్‌ 42 ప్రకారం.. ఎలాంటి వినియోగదారునికైనా ఒకే ధరకు విద్యుత్‌ను అమ్మాలి. ప్రస్తుతం తెలంగాణ ఈఆర్‌సీ అనుమతితో ఇటు రైతులకు, అటు గృహ, పారిశ్రామిక రంగాల్లో వివిధ శ్లాబుల ద్వారా సబ్సిడీని అందిస్తున్నది. ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న పరిశ్రమలు, వాణిజ్య సంస్థల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఇతర శ్లాబుల్లో ఉన్న వినియోగదారులకు మళ్ళించి (క్రాస్‌ సబ్సిడీ) తక్కువ ధరకు విద్యుత్‌ను అందిస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 1.15 కోట్ల మంది గృహ విద్యుత్‌ వినియోగదారులున్నారు. ఇందులో కాస్ట్‌ ఆఫ్‌ సర్వీసు కంటే తక్కువ ధరకు విద్యుత్‌ను పొందుతున్నవారు, లేదా సబ్సిడీని పొందుతున్నవారు సుమారు 97.60 లక్షల మంది(86%). రాష్ట్రంలో 100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3.30, 101 నుంచి 200 యూనిట్ల వరకు రూ.4.30 చొప్పున వసూలు చేస్తున్నారు. ఒక యూనిట్‌ వాస్తవ ధర రూ.6.87 పైసలు. కానీ రాష్ట్రంలోని 97.60 లక్షల మంది గృహ వినియోగదారులు వాస్తవ ధర కంటే తక్కువకే విద్యుత్‌ను పొందుతున్నారు. ఇదంతా క్రాస్‌ సబ్సిడీ. ఇకపై ఇలాంటి క్రాస్‌ సబ్సిడీ ఉండదు. 

ఉదాహరణకు.. గృహవినియోగదారుడు ఒక నెలలో 190 యూనిట్లు విద్యుత్‌ను వినియోగిస్తే.. 100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3.30 పైసల చొప్పున ఆపై.. 101 నుంచి 200 యూనిట్ల వరకు రూ.4.30 పైసల చొప్పున 190 యూనిట్లకు మొత్తం రూ.717 అవుతుంది. దీనికి సర్వీస్‌, ఇతర చార్జీలు కలుపుకుంటే.. రూ.778.41 పైసలు అవుతుంది. ఇక కేంద్రం రూపొందించిన కొత్త ముసాయిదా ప్రకారం చూసుకుంటే.. యూనిట్‌కు రూ.6.87 పైసల చొప్పున సర్వీస్‌, ఇతర చార్జీలు కలుపుకొని ఇదే బిల్లు రూ.1366.70 పైసలు అవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో కడుతున్న బిల్లుకు.. కేంద్రం ప్రతిపాదించిన చట్టం ప్రకారం వచ్చే బిల్లుకు మధ్య తేడా.. రూ.588.29 పైసలు.