శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 02:20:29

కోటి టన్నుల గోదాంలు

కోటి టన్నుల గోదాంలు

  • సామర్థ్యం పెంపు దిశగా ప్రభుత్వం చర్యలు
  • త్వరలో ప్రభుత్వానికి డీపీఆర్‌ల అందజేత
  • పెరుగుతున్న సాగు విస్తీర్ణం.. పంట దిగుబడి

కాళేశ్వరం ప్రాజెక్టు, భూగర్భజలాల పెరుగుదలతో రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు విస్తారంగా అందుబాటులోకి వచ్చి వ్యవసాయం పండుగలా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడిని అందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేయడం, పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో రైతులు వ్యవసాయం చేసేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. 

పంట ఉత్పత్తులను నిల్వ చేసుకొనేందుకు సరిపడా గోదాములు అందుబాటులో లేకుండాపోయాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పాదకతల ఆధారంగా ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని భావిస్తున్నది. ఈ పరిశ్రమల కోసం కూడా గోదాములు, కోల్డ్‌స్టోరేజీల అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గోదాముల సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

హైదరాబాద్‌, జనవరి 11 (నమస్తే తెలంగాణ): సాగునీటి ప్రాజెక్టులు ఒకవైపు.. చెరువులు, కుంటలు మరోవైపు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది కురిసిన విస్తారమైన వర్షాలతో భూగర్భ జలాలు కూడా పైకి ఉబికివస్తున్నాయి. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వ రైతు సన్నిహిత విధానాలతో రాష్ట్రంలో ఏటికేడు సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నది. ఇందుకు అనుగుణంగా పంటల దిగుబడి కూడా అధికమవుతున్నది. దీంతో పండిన పంటను నిల్వ చేయడానికి గోదాములకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో 63.13 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల  1,493 గోడౌన్లు ఉన్నాయి. మరో 40 లక్షల టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు అవసరమని మార్కెటింగ్‌శాఖ అంచనా వేసింది. వీటి నిర్మాణానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధంచేసిన అధికారులు త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఇవి నిర్మాణం పూర్తిచేసుకొని అందుబాటులోకి వస్తే నిల్వ సామర్థ్యం కోటి టన్నులకు చేరనున్నది.


నిర్మాణంలో 10 లక్షల టన్నుల సామర్థ్యం గోడౌన్లు

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో 2.42 లక్షల టన్నుల సామర్థ్యం, ప్రైవేటు ఆధ్వర్యంలో 4.50 లక్షల టన్నుల సామర్థ్యం, మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో సుమారు 3 లక్షల టన్నుల సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణం జరుగుతున్నది.

పెరిగిన సాగు.. దిగుబడి

రాష్ట్రం ఏర్పడిన నాటితో పోల్చితే ప్రస్తుతం తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఇందుకు అనుగుణంగానే పంటల దిగుబడులు కూడా పెద్ద ఎత్తున పెరిగాయి. వరి పంట 2014-15లో 34.96 లక్షల ఎకరాల్లో సాగు కాగా, 2019-20లో ఏకంగా 79.58 లక్షల ఎకరాల్లో సాగైంది. ధాన్యం ఉత్పత్తి 2014-15లో 24.25 లక్షల టన్నులు కాగా, 2019-20లో ఏకంగా 1.12 కోట్ల టన్నులకు పెరిగింది. మక్కజొన్నలు 2014-15లో 17.10 లక్షల ఎకరాల్లో సాగు కాగా, 2019-20లో 15.92 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి 2014-15లో 41.83 లక్షల ఎకరాల్లో సాగు కాగా, 2019-20లో 52.56 లక్షల ఎకరాల్లో సాగు కావడం గమనార్హం. ఇలా సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పత్తి కూడా పెరిగింది. దీంతో పంట నిల్వలకు గోడౌన్ల సామర్థ్యం సరిపోవడం లేదు.


logo