e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home తెలంగాణ రైతులకు త్వరలో లక్షలోపు రుణమాఫీ

రైతులకు త్వరలో లక్షలోపు రుణమాఫీ

  • మాఫీ పైసలు బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు సన్నాహం
  • సొంత స్థలంలో డబుల్‌ బెడ్రూం ఇండ్లు
  • నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు
  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

హుస్నాబాద్‌/హుజూరాబాద్‌, సెప్టెంబర్‌ 15: రుణమాఫీలో భాగంగా రూ.50 వేల నుంచి లక్షలోపు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. రూ.50 వేలలోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తికావచ్చిందని, లక్షలోపు రుణమాఫీ కోసం వచ్చే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేసేలా సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని కిషన్‌నగర్‌ వద్ద డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. సొంత స్థలం ఉన్న నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించినట్టు స్పష్టంచేశారు. మెట్ట ప్రాంత వరప్రదాయినీ గౌరవెల్లి రిజర్వాయర్‌ మిగులు పనులను పూర్తి చేసేందుకు రూ.58 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమంపై దృష్టిసారించిన సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.42 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు. కరోనా కష్టకాలంలో వైద్యులు, పోలీసులతోపాటు జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పనిచేశారని కొనియాడారు. కరోనా సోకిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ ద్వారా రూ.20 వేలు, మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షలతోపాటు మూడేండ్లపాటు రూ.3 వేల చొప్పున పింఛన్‌ ఇస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత పాల్గొన్నారు.

బీజేపీకి ఓటు.. అభివృద్ధికి చేటు
బీజేపీకి ఓటు వేస్తే చేజేతులా అభివృద్ధికి చేటు చేసినవారవుతారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, జమ్మికుంట మండలాల్లో బుధవారం మంత్రి పర్యటించారు. ముందుగా జమ్మికుంటలో 307 సంఘాలకు రుణాల వడ్డీమాఫీ (రిటర్న్స్‌) రూ.2.13 కోట్ల చెక్కులను అందజేశారు. తర్వాత హుజూరాబాద్‌ విద్యానగర్‌లో కాలనీవాసులు నిర్వహించిన కృతజ్ఞతా సభకు హాజరయ్యారు. అనంతరం ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఎరుకల కులసంఘ నాయకులతో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీజేపీకి ఓటేసినందుకు గ్యాస్‌ ధర రూ.వెయ్యికి పెంచిందని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రూ.100 దాటించిందని ఆరోపించారు. దొడ్డు వడ్లు కొననంటుందని, మార్కెట్లు వద్దంటుందని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అప్పజెప్పుతూ ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నదని దుయ్యబట్టారు. కేంద్రం నిర్ణయంతో ఎల్‌ఐసీ ఏజెంట్లకు భద్రత కరువైందన్నారు. గతంలో ఆంధ్రా ప్రాంతంలో ఎకరం అమ్మితే ఇక్కడ మూడెకరాలు వచ్చేదని, ఇప్పుడు తెలంగాణలో ఎకరం ఆంధ్రాలో మూడెకరాల భూమితో సమానమైందని.. దీనికి కారణం సీఎం కేసీఆర్‌ చేపట్టిన చర్యలేనని స్పష్టంచేశారు. గడిచిన ఏడేండ్లలో సాధించిన వృద్ధితో తెలంగాణ దక్షిణ భారత దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. ఈటల రాజేందర్‌ పదవికి ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేవలం ఆయన స్వార్థం వల్లనే ఈ ఉపఎన్నిక వచ్చిందని ఆరోపించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్‌, కోరుకంటి చందర్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్లు తక్కెళ్లపల్లి రాజేశ్వర్‌రావు, గందె రాధిక తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana