గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 17:23:44

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం

మేడ్చల్‌ మల్కాజిగిరి ‌: ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించడానికి సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి 1వ డివిజన్‌ కార్పొరేటర్‌ బింగి జంగయ్యయాదవ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీసీ కెమరాల ఏర్పాటుతో రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు.

కేసులను చేధించడానికి ఇవి ఏంతో దోహదపడుతాయని తెలిపారు. రూ. 5లక్షల సొంత నిధులతో సీసీ కెమరాలను ఏర్పాటు చేసిన కార్పొరేటర్‌ జంగయ్యయాదవ్‌ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో కార్పొరేటర్లు విధిగా వారివారి డివిజన్లతో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

అనంతరం మేడిపల్లి ఠాణాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుటంలో కీలకపాత్ర పోషించిన స్థానిక సీఐ అంజిరెడ్డిని మంత్రి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, జిల్లాపరిషత్‌ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మేయర్లు సామల బుచ్చిరెడ్డి, జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ కొత్త లక్ష్మి‌, కుర్ర శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.