హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు పార్టీ పొలిట్‌బ్యూరో పదవికి రాజీనామా చేశారు. పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐలో చేరి క్రమేణా పార్టీలో ఎదిగిన రాఘవులు.. అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వరుస ఫిర్యాదులే రాఘవులు రాజీనామాకు కారణంగా తెలుస్తున్నది.
ప్రాథమిక సభ్యత్వం మినహా అన్ని పదవులకు రాఘవులు రాజీనామా చేశారు. కానీ, ఆయన రాజీనామాను పార్టీ పొలిట్ బ్యూరో ఆమోదించలేదు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ నాయకులు కోరుతున్నట్టుసమాచారం. శనివారం ఢిల్లీలో జరిగే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో రాఘవులు రాజీనామాపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నిర్మాణం, క్యాడర్ నియామకం విషయంలో పొలిట్‌బ్యూరో సభ్యులకు, రాఘవులుకు మధ్య భిన్నాభిప్రాయాలు రావడమే ఆయన రాజీనామాకు కారణమని తెలుస్తున్నది.