మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 01:56:55

కొత్త చట్టంపై సంపూర్ణ విశ్వాసం

కొత్త చట్టంపై సంపూర్ణ విశ్వాసం

  • సమగ్ర భూసర్వే అభినందనీయం
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు

చిగురుమామిడి: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టంపై పూర్తి విశ్వాసం ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం సమగ్ర భూసర్వేకు పూనుకోవడం అభినందనీయమని అన్నారు. శాసనసభలో రెవెన్యూ బిల్లుపై చర్చ సందర్భంగా కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలంలోని తన స్వగ్రామం రేకొండలో నెలకొన్న భూ సమస్యను సీఎం కేసీఆర్‌ ప్రస్తావించిన నేపథ్యంలో చాడ ‘నమస్తే తెలంగాణ’కు ఫోన్‌చేసి మాట్లాడారు. రెవెన్యూ చట్టం గురించి చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ తనను ఆహ్వానించారని తెలిపారు. పలు అంశాలపై చర్చించారని చెప్పారు. తన స్వగ్రామం రేకొండలో 70 మంది రైతులకు చెందిన 146 ఎకరాల అసైన్డ్‌ వ్యవసాయ భూమి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం సంతోషకరమని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

సీఎంతో ఎన్నికలపై మాట్లాడలేదు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలపై మాట్లాడలేదని, కేవలం రెవెన్యూ బిల్లుపైనే చర్చించామని చాడ హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక, దుబ్బాక ఉపఎన్నికపై చర్చ జరిగిందనడం సరికాదన్నారు. 


logo