సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 18:59:19

డిసెంబ‌ర్ 1 నుంచి సీపీజీఈటీ పరీక్షలు

డిసెంబ‌ర్ 1 నుంచి సీపీజీఈటీ పరీక్షలు

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్స్‌ (సీపీజీఈటీ) - 2020 పరీక్షలను వాయిదా వేసినట్లు సీపీజీఈటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌ కిషన్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అన్ని యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సుల రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు తిరిగి నిర్వహించే తేదీల్లోనే సీపీజీఈటీ పరీక్షలు ఉన్నందున ఆయా వర్సిటీల రిజిస్ట్రార్‌లు, కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన అధికారులు, ఈ మేరకు సీపీజీఈటీ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించారు.

ఈ పరీక్షలను తిరిగి వచ్చే నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. పరీక్షలు వాయిదా పడడంతో సీపీజీఈటీకి దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 17వ తేదీ వరకు, రూ.2000 అపరాధ రుసుముతో ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఇప్పటికే రూ.2000 అపరాధ రుసుముతో దరఖాస్తు దాఖలు చేసిన దాదాపు 50 మంది అభ్యర్థులకు రూ.1500 తిరిగి చెల్లిస్తామన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.