శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 01:55:02

పెట్రోల్‌.. గోల్‌మాల్‌

పెట్రోల్‌.. గోల్‌మాల్‌

  • బంకుల్లో ఇంటిగ్రేటెడ్‌ చిప్స్‌ 
  • లీటర్‌కు 30 మిల్లిలీటర్లు తక్కువ
  • 30 బంక్‌లు సీజ్‌..15 మంది అరెస్టు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పెట్రోల్‌ బంక్‌లలో ఇంటిగ్రేటెడ్‌ చిప్‌లు అమర్చి, మోసంచేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టయింది. ఈ ముఠా తెలంగాణ, ఏపీలోని దాదాపు 30 బంక్‌లలో చిప్‌లు ఏర్పాటుచేసి, వాహనదారుల జేబులు కొల్లగొడుతున్నది. లీటరులో 30 మిల్లీలీటర్లు తక్కువ వచ్చేలా చిప్‌లలో సాఫ్ట్‌వేర్‌ పొందుపర్చి గోల్‌మాల్‌కు పాల్పడుతున్నది. పలువురు మోసగాళ్లను సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం, లీగల్‌ మెట్రోలజీ విభాగం అధికారులు శనివారం అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇటీవల సైబరాబాద్‌ పరిధిలోని నందిగామ వద్ద ఓ పెట్రోల్‌ బంక్‌లో ఇంటిగ్రేటెడ్‌ చిప్‌ ఏర్పాటుచేసేందుకు వచ్చిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దాని ఆధారంగా దాడులుచేసి తెలంగాణలో 11 బంకులను జప్తుచేశారు. ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చి 19 బంక్‌లను సీజ్‌ చేసేలా సహకరించారు. షేక్‌ సుభాని ముఠాలోని నలుగురితోపాటు 11 మంది బంక్‌ యజమానులను అరెస్టు చేశారు. వారినుంచి 14 ఇంటిగ్రేటెడ్‌ చిప్‌లు, 8 మదర్‌బోర్డులు, కేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఠాపై పీడీ యాక్ట్‌ విధిస్తున్నామని సీపీ చెప్పారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు. 

ముంబయి నుంచి చిప్‌ కొనుగోలు

ఏపీలోని పశ్చిమగోదావరికి చెందిన షేక్‌ సుభాని పదేండ్లుగా పెట్రోల్‌ బంక్‌లలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. పెట్రోల్‌ పంప్‌ మెషిన్లలో ఇంటిగ్రేటెడ్‌ చిప్స్‌ అమర్చడం నేర్చుకున్నాడు. స్నేహితులు షేక్‌ బాజీబాబా, మాదసుగురి శంకర్‌, ఇప్పిలి మల్లేశ్వర్‌రావుతో కలిసి బంక్‌ల యజమానులతో కుమ్మక్కై చిప్‌ ఏర్పాటుతో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. చిప్‌లను ముంబయికి చెందిన జోసెఫ్‌, షిబు థామస్‌ నుంచి రూ.50 వేలలోపు ధరలో కొని, బంక్‌ల యజమానులకు రూ.80 వేల నుంచి రూ.1.20 లక్షలకు విక్రయిస్తున్నాడు. బంక్‌ యజమానులు ప్రతి రెండు పెట్రోల్‌ మెషిన్లలో ఒక దాంట్లో ఈ చిప్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఖాళీ బాటిళ్లతో వచ్చేవారికి చిప్‌లేని మెషిన్‌నుంచి, వాహనదారులకు చిప్‌ ఉన్న మెషిన్‌ నుంచి పెట్రోల్‌ పోస్తారు. తెలంగాణలో సీజ్‌చేసిన బంకులు: మాతా ఫిల్లింగ్‌ స్టేషన్‌ (బీపీసీఎల్‌) నందిగామ, గాయత్రి ఫిల్‌ పాయింట్‌ (ఐఓసీఎల్‌) అల్లాదుర్గ్‌, తిరుమల ఫిల్లింగ్‌ స్టేషన్‌ (ఐవోసీఎల్‌) దోమకొండ, శ్రీ విజయదుర్గ ఫిల్లింగ్‌ స్టేషన్‌ (బీపీసీఎల్‌) దోమకొండ, తాజ్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ (బీపీసీఎల్‌) కోటపల్లి, సాయి గణేష్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ (బీపీసీఎల్‌) మేళచెరువు, పరశురాం ఫిల్లింగ్‌ స్టేషన్‌ (హెపీసీఎల్‌) చిలుకూరు, దత్తసాయి కేఎస్కే (ఐవోసీఎల్‌) మోటకొండూరు, వినాయక ఫిల్లింగ్‌ స్టేషన్‌ (ఐవోసీఎల్‌) బీబీనగర్‌, షిరిడీసాయి ఆటో సర్వీసు (ఐవోసీఎల్‌) రాంచంద్రపురం, దుర్గా ఫిల్లింగ్‌ స్టేషన్‌ (హెపీసీఎల్‌) బీడీఎల్‌ భానూర్‌ పీఎస్‌ పరిధిలో ఉన్నాయి. 


logo