శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 02:11:48

డర్నా మనాహై

డర్నా మనాహై
  • భేషుగ్గా విధుల నిర్వహణ
  • ‘ఐటీ’కి సెలవులు ప్రకటించలేదు
  • అనుమానిత మహిళకు నిర్ధారణ కాని వైరస్‌
  • ఐటీ కారిడార్‌ నోడల్‌ అధికారిగా సీపీ సజ్జనార్‌
  • ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 కారణంగా హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ ఖాళీ అయిందంటూ సోషల్‌మీ డియాలో వచ్చిన వదంతులను నమ్మొద్దని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు అన్నారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన పనిలేదన్నారు. బుధవారం రహేజా మైండ్‌స్పేస్‌లోని ఓ ఐటీ కంపెనీ ఉద్యోగికి కొవిడ్‌-19 నిర్ధారణ అయినట్టు వచ్చిన వదంతులపై సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో నిర్వహించిన మీడియాసమావేశంలో ఆరోగ్య, ఐటీ, సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అధికారులు మాట్లాడారు. 


మైడ్‌స్పేస్‌లోని 20వ బిల్డింగ్‌లోని ఓ కంపెనీకి చెందిన మహిళా ఉద్యోగికి కొవిడ్‌ -19 సోకిందని వచ్చిన వార్తల్లో నిజంలేదని తెలిపారు. అయినా, ఆమెకు ఉన్న లక్షణాలను గమనించి గాంధీదవాఖానలోని ఐసొలేషన్‌ వార్డులో ఉంచామన్నారు. ఆమె రిపోర్టులను పుణెకు పంపించామని.. ఆ రిపోర్డ్‌ వచ్చాకే స్పష్టత లభిస్తుందని చెప్పారు. గాంధీ దవాఖానలో కరోనా బాధితుడు కోలుకొంటున్నారన్నారు. రెండునెలలపాటు విదేశీ ప్రయాణాలను రద్దుచేసుకోవాలని, ఈ విషయంలో ఐటీ కంపెనీలు సహకరించాలని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ సూచించారు. విదేశాల నుంచి వచ్చేవారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని, కొంతమందిని వెనక్కి పంపించామన్నారు.


నిర్భయంగా విధులు: జయేశ్‌రంజన్‌ 

ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు రావొద్దంటూ ఏ సంస్థ కూడా ఆదేశాలివ్వలేదని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ చెప్పారు. కరోనాకు సంబంధించి రాష్ట్రంలో ఒకే ఒక్క కేసు నమోదైందని, అదికూడా సద రు వ్యక్తి విదేశాలకు వెళ్లడం వల్లే జరిగిందన్నారు. మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్‌లోని బిల్డింగ్‌ 20లోని డీఎస్‌ఎం కంపెనీలో 350 మంది ఉద్యోగులున్నారని.. అందులో వైరస్‌ వచ్చినట్టు అనుమానిస్తున్న మహిళతోపాటు 23 మంది వ్యక్తిగతంగా ఐసొలేషన్‌ తీసుకున్నారని చెప్పా రు. ఆమే భర్త మరో కంపెనీలో పనిచేస్తున్నాడని.. అతడు కూడా ఐసొలేషన్‌లో ఉన్నారని తెలిపారు. ఐటీ కంపెనీలు వదంతులను నమ్మి ఇష్టానుసారంగా ఆదేశాలు జారీచేయకూడదని సూచించారు. ఐటీ కంపెనీలు మూసివేస్తున్నట్టు వచ్చిన వార్తలు అసత్యమన్నారు. ఐటీ ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకోవచ్చన్నారు.


నోడల్‌ అధికారిగా సజ్జనార్‌

సోషల్‌మీడియాలో కరోనాపై వస్తున్న అసత్య ప్రచారాల కట్టడితోపాటు ఐటీ కంపెనీలు పోలీసులతో సమన్వయం చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలని జయేశ్‌రంజన్‌ కోరారు. ఐటీ కారిడార్‌కు నోడల్‌అధికారిగా సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఉంటారని తెలిపారు. ఐటీ కంపెనీల యాజమాన్యాలకు ఏవైనా సందేహాలుంటే సీపీని అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. కరోనా వల్ల ఏదైనా కంపెనీ సెలవు ప్రకటించాలనుకుంటే నోడల్‌ అధికారి అనుమతి తప్పనిసరి అన్నారు.


వదంతులు ప్రచారం చేస్తే చర్యలు

ఐటీ కారిడార్‌లో ఉద్యోగులకు కరోన సోకినట్టు సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. అసత్య ప్రచారాలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. తప్పుదోవ పట్టించేవారిపై నిఘా పెట్టామన్నారు. ఐటీ ఉద్యోగులు యథాతథంగా విధు లు నిర్వహించుకోవచ్చని తెలిపారు. బాధితుల వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించొద్దని సూచించారు.


logo