గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 01:38:41

అఖిలప్రియ అరెస్ట్‌

అఖిలప్రియ అరెస్ట్‌

  • బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో పోలీసుల అదుపులోకి
  • ఏ-1 ఏవీ సుబ్బారెడ్డి కూడా.. పరారీలో అఖిల భర్త
  • గాంధీలో హైడ్రామా.. అఖిలప్రియకు వైద్య పరీక్షలు
  • 14 రోజుల రిమాండ్‌.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
  • రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్యలకు తావు లేదు: సీపీ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ)/కంటోన్మెంట్‌: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను, ఆమెకు సహకరించిన ఏవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. అఖిలప్రియను వైద్యపరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించగా ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. సీపీ అంజనీకుమార్‌ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నగరంలోని హఫీజ్‌పేట్‌లో 25 ఎకరాల భూమిని బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి ప్రవీణ్‌ కొనుగోలు చేశారు. ఈ భూమి విషయంలో సమస్యలు రావడంతో భూమా నాగిరెడ్డికి దగ్గరగా ఉండే ఏవీ సుబ్బారెడ్డి మధ్యవర్తిత్వం వహించారు. 

ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన ఒప్పం దం మేరకు నడుచుకోకపోవడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో ఆ స్థలం విషయంలో ఆ యన కుమార్తె అఖిలప్రియ జోక్యం చేసుకొని తన వాటా ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారమంతా సుబ్బారెడ్డి నిర్వహించారని, దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా అతడిని సంప్రదించాలని  ప్రవీణ్‌ సూచించారు. అనంతరం అఖిలప్రియ.. ప్రవీణ్‌ను బెదిరించడం, అప్పట్లో జరిగిన పరిణామాలతో తమ పొలంలోకి చొరబడి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రవీణ్‌ గత ఏడాది ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదులో ఏవీ సుబ్బారెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో ఈ విషయంపై వివాదం కొనసాగుతున్నది.

ఐటీ అధికారులమంటూ..

మంగళవారం రాత్రి 7.20 గంటలకు దాదాపు 15 మంది పోలీసు డ్రెస్‌లు ధరించి, చేతిలో కర్రలు పట్టుకొని తెలుగు, ఇంగ్లిష్‌ మాట్లాడుతూ బోయిన్‌పల్లిలోని మనోవికాస్‌నగర్‌లో ఉంటున్న ప్రవీణ్‌, నవీన్‌, సునీల్‌ సోదరుల ఇంట్లోకి చొరబడ్డారు. ఐటీ అధికారులమంటూ నకిలీ ఐడీ కార్డులు చూపించారు. నకిలీ సెర్చ్‌ వారెంట్‌తో ఇల్లంతా సోదాచేశారు. అందరినీ మొదటి అంతస్తులోని ఒక గదిలో బంధించి, ప్రవీణ్‌, నవీన్‌, సునీల్‌ను కిడ్నాప్‌చేశారు. అంతకుముందే పక్కింటికి వెళ్లిన సునీల్‌ భార్య 8.20 గంటలకు వచ్చి చూడగా అందరూ ఒక గదిలో బంధించి ఉన్నారు. వాళ్లను విడిపించి డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. పోలీసులు 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీపీ అంజనీకుమార్‌తోపాటు టాస్క్‌ఫోర్స్‌, ఎస్బీ విభాగాల అధికారులు సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు.. కిడ్నాపర్లు నగరం బయటకు వెళ్లకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. 

బాధితులకు అల్లుడు అయిన కటకనేని మనీశ్‌ ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదుచేశారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో ఇన్నోవా, స్విఫ్ట్‌ డిజైర్‌, ఎక్స్‌యూవీ కార్లలో కిడ్నాపర్లు పరారయ్యారని, వాటి నంబర్లను ట్రై కమిషనరేట్లతోపాటు రాష్ట్ర ప్రధాన కంట్రోల్‌ సెంటర్‌ నుంచి అన్ని జిల్లాలకు చేరవేశారు. దీంతో స్థలం విషయంలో ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరాం వాళ్ల అనుచరులు ఈ కిడ్నాప్‌నకు పాల్పడ్డారని బాధిత కుటుంబీకులు అనుమానం వ్యక్తంచేయడంతో ఆ దిశగా దర్యాప్తుచేశారు. ఏపీ డీజీపీ, కర్నూలు ఎస్పీతోను హైదరాబాద్‌ సీపీ మాట్లాడారు. నగరం నుంచి బయటకు వెళ్లే ప్రధాన రూట్లల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు అప్రమత్తమయ్యారనే సమాచారంతో కిడ్నాపర్లు ముందుకు వెళ్లలేక తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ప్రవీణ్‌, నవీన్‌, సునీల్‌ను కోకాపేట వద్ద వదిలేసి పరారయ్యారు. కిడ్నాపర్లు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా, బాధితులను సురక్షితంగా వదిలిపెట్టాలనే లక్ష్యంతో రాత్రంతా మూడు కమిషనరేట్ల పోలీసులు రోడ్లపైనే ఉన్నారని సీపీ వివరించారు. 

తెలంగాణలో ఇలాంటి కిడ్నాప్‌లు, వ్యవస్థీకృత నేరాలకు తావులేదని, ఎంతటి వారైనా చట్టం ముందు సమానులేనని హెచ్చరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఏవీ సుబ్బారెడ్డిని, రెండో నిందితురాలిగా అఖిలప్రియ, మూడో నిందితుడిగా ఆమె భర్త భార్గవరాంను చేర్చామని చెప్పారు. కిడ్నాప్‌చేసినవారిలో శ్రీనివాస్‌ చౌదరీ అలియాస్‌ గుంటూరు శ్రీను, సాయి, చంటి, ప్రకాశ్‌ను గుర్తించామని, మరింత మందిని గుర్తించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా బుధవారం ఉదయం అఖిలప్రియను కూకట్‌పల్లిలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకొన్నామని, సుబ్బారెడ్డిని కూడా ఆయన నివాసంలో అరెస్టు చేసినట్టు వివరించారు. సమావేశంలో నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి, నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు, బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.


అఖిలకు మహిళా వైద్యుల చికిత్స

అఖిలప్రియను అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచే ముందు బోయిన్‌పల్లి పోలీసులు వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. అమె అక్కడ స్పృహ తప్పి పడిపోగా, మహిళా డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించారు. రిపోర్టులన్నీ సాధారణంగా ఉండటంతో రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించగా, పోలీసులు ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. అఖిలప్రియ గర్భవతి కావడం వల్ల దవాఖానలో నీరసంతో స్పృహ కోల్పోయినట్టు సమాచారం.

కిడ్నాపర్లకు భారీ నజరానా.. ఫోన్‌లో వాకబు

ఈ కిడ్నాప్‌లో పాల్గొన్న వారంతా జీవితంలో స్థిరపడిపోయేలా భారీ నజరానాలు ఇస్తానని అఖిలప్రియ హామీ ఇచ్చినట్టు సమాచారం. కిడ్నాప్‌లో ప్రధాన సూత్రదారిగా ఉన్న శ్రీనివాస్‌ చౌదరీ, సాయి, చంటి, ప్రకాశ్‌లు అఖిలప్రియ కుటుంబంతో కొన్నేండ్లుగా ప్రధాన అనుచరులుగా ఉంటున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్‌ వ్యవహారానికి పది రోజుల నుంచి రెక్కీ జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్‌ అనంతరం దర్యాప్తును దారి మళ్లించేలా నగరంలో వివిధ రూట్లలో తిరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. కిడ్నాప్‌ జరిగేవరకు బంజారాహిల్స్‌లో ఉన్న అఖిలప్రియ, కిడ్నాప్‌ జరిగిందని నిర్ధారించుకొని కూకట్‌పల్లిలోని తన నివాసానికి వెళ్లి, అక్కడి నుంచి కొత్త ఫోన్‌ నంబర్లతో కిడ్నాపర్లతో మాట్లాడారు.

పత్రాలపై సంతకాలు: బాధితుల బంధువు, న్యాయవాది ప్రతాప్‌రావు

కిడ్నాపర్లు ప్రవీణ్‌, సునీల్‌, నవీన్‌తో పలు పత్రాలపై సంతకాలు చేయించుకొన్నారని బాధితుల సమీప బంధువు, న్యాయవాది ప్రతాప్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహబూబ్‌నగర్‌లో ఉన్న తనకు రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ప్రవీణ్‌ కుటుంబసభ్యులు ఫోన్‌చేసి విషయం చెప్పారని, ఈ విషయాన్ని తాను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మాలోతు కవితకు ఫోన్‌చేసి వివరించానని పేర్కొన్నారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఘటనాస్థలానికి వారు చేరుకున్నారని, అప్పటికే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారని తెలిపారు. కిడ్నాపర్లు కార్లలో ముగ్గురిని తిప్పుతూ చివరికి చిలుకూరులోని ఓ ఫాంహౌస్‌కు తీసుకెళ్లి వారితో పలు పత్రాలపై సంతకాలను చేయించుకొన్నారని చెప్పారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రతాప్‌రావు పేర్కొన్నారు.


logo