సోమవారం 25 మే 2020
Telangana - Mar 29, 2020 , 01:26:10

ఫేక్‌న్యూస్‌ సహించం

ఫేక్‌న్యూస్‌ సహించం

  • నకిలీ వాయిస్‌ మెసేజ్‌లపై సీపీఎస్‌లో కేసు
  • ప్రజలను భయాందోళనకు గురిచేయొద్దు
  • హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ హెచ్చరిక

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/సైదాబాద్‌: కొవిడ్‌-19పై సోషల్‌మీడియాలో ఫేక్‌న్యూస్‌లు, నకిలీ వాయిస్‌ మెసేజ్‌లు, వదంతుల ప్రచారాన్ని సహించబోమని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ హెచ్చరించారు. వాట్సాప్‌ అడ్మిన్లు.. ఏదీ నిజం.. ఏదీ అబద్ధం అని నిర్ధారించుకొని మాత్రమే ఫార్వర్డ్‌ చేయాలని సూచించారు. ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా నకిలీ ఆడియోలు, వీడియోలను సర్క్యులేట్‌చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. తన నకిలీ వాయిస్‌తోపాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నకిలీ వాయిస్‌తో ప్రచారం, శుక్రవారం మక్కామసీద్‌ వద్ద ప్రార్థనల్లో భారీగా జనాలున్నారని పాత వీడియోలతో మరో ఫేక్‌వీడియోను సోషల్‌మీడియాలో వైరల్‌చేయడంపై సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సుమోటోగా కేసులు నమోదుచేసినట్టు తెలిపారు. జర్నలిస్ట్‌, అపోలో వైద్యుడి సంభాషణ అంటూ ప్రచారమైన ఆడియోపై అపోలో ప్రతినిధుల ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసినట్టు పేర్కొన్నారు.

తప్పుడు ప్రచారంచేసిన యువకుడిపై కేసు 

కరోనా వైరస్‌ సోకిందని సోషల్‌మీడియాలో నకిలీ వార్త పోస్ట్‌చేసిన యువకుడిపై సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐఎస్‌సదన్‌ డివిజన్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డినగర్‌కు చెందిన ఓ కుటుంబసభ్యులు (దంపతులు, కుమార్తె) అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన వివాహానికి హాజరై వచ్చారు. విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ పరీక్షచేసిన వైద్యులు కొవిడ్‌-19 లక్షణాలు లేకపోయినా.. స్వీయనిర్బంధంలో ఉండాలని సూచించారు. ఇంట్లోనే ఉంటున్నవారిని నిత్యం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వారి మూడేండ్ల కుమార్తెకు జ్వరం, జలుబురావటంతో వారు 108 అంబులెన్స్‌ ద్వారా నల్లకుంటలోని ఫీవర్‌ హాస్పిటల్‌కు తరలించే సమయంలో కొందరు వీడియాతీసి చిన్నారికి కరోనా అంటూ సోషల్‌మీడియాల్లో పోస్టుచేశారు. తప్పుడు వార్త ప్రచారంచేసిన నిందితులపై బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. స్థానిక యువకుడిని సైదాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని, అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనపర్చుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీస్‌ టెలిగ్రామ్‌లో వాస్తవాలు

కరోనావ్యా ప్తిపై ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవాలను చేరవేసేందుకు పోలీస్‌శాఖ తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ పేరిట టెలిగ్రామ్‌ యాప్‌ను ప్రారంభించినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాచారం కోసం ప్రజలకు తమ సెల్‌ఫోన్లలో టెలిగ్రామ్‌ మెసెంజర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.  సోషల్‌మీడియాలో వస్తు న్న వదంతులు, తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరారు. 

వైన్స్‌ మూసేఉంటాయ్‌

నకిలీ జీవో వైరల్‌పై ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ ఆగ్రహం


లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూసే ఉంటాయని ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ స్పష్టంచేశారు. ఈ నెల 29 నుంచి కొన్నిగంటలపాటు వైన్‌షాపులు తెరుస్తారని సోషల్‌ మీడియాలో నకిలీ జీవోతో వార్తప్రచారం కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు జీవో సృష్టించి సోషల్‌ మీడియాలో వైరల్‌చేసిన బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌శాఖ టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ రాజేంద్రకులకర్ణి శనివారం హైదరాబార్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కాగా, వైన్స్‌షాపుల వద్ద పెట్రోలింగ్‌ వ్యవస్థతో నిఘా ఏర్పాటుచేయాలని తెలంగాణ వైన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

పది పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదు

వదంతులు నమ్మొద్దన్న విద్యాశాఖ 

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పాఠశాల విద్యాశాఖ శనివారం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకే పరీక్షలను రీషెడ్యూల్‌ చేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఇప్పటివరకు రెండు సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఏ సత్యనారాయణరెడ్డి తెలిపారు. మరో నాలుగు సబ్జెక్టులకు కలిపి ఎనిమిది పేపర్లకు పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నదన్నారు. 


logo