శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 02:00:59

మురుగునీటిలో వైరస్‌పై మరో సర్వే

మురుగునీటిలో వైరస్‌పై మరో సర్వే

  • రెండోదశకు సీసీఎంబీ సిద్ధం!
  • రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరిన డైరెక్టర్‌
  • వైరస్‌ తీవ్రతపై అంచనాకు రావొచ్చని వెల్లడి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో కరోనా తీవ్రతను కచ్చితంగా అంచనా వేయడానికి మరోసారి మురుగునీటి సర్వేకు సీసీఎంబీ శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. రెండోదశ సర్వేకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీసీఎంబీ విన్నవించింది. ఈ మేరకు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా సోమవారం లేఖ రాసినట్టు ఆ సంస్థ అధికారవర్గాలు తెలిపాయి. వైరస్‌ తీవ్రత పెరుగుతున్నదా? తగ్గే అవకాశమున్నదా? కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి? అనే విషయంపై కచ్చితమైన అంచనాకు రావచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వైరస్‌ ప్రబలే తీరును పరిశీలించడానికి హైదరాబాద్‌లో మురుగునీటి నమూనాలను ఇటీవల సీసీఎంబీ సేకరించి ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే. దాదాపు 2.6 లక్షల మంది విసర్జితాలలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారించారు. 

40 శాతం మురుగునీటి ఆధారంగా చేసిన పరిశోధనలో సుమారు 6.6 లక్షల మంది కరోనా సోకి గత 35 రోజుల్లో సాధారణ స్థితికి వచ్చి ఉంటారని అంచనా వేశారు. 6 శాతం మందికి కరోనా వచ్చిపోయిన విషయం కూడా తెలియకపోవచ్చని పేర్కొన్నది. దీనిప్రకారం 2.6 లక్షల మందిలో కరోనా లక్షణాలుండవచ్చని అంచనా వేసింది. నగర ప్రజల్లో హెర్డ్‌ఇమ్యూనిటీ (సమూహ రోగనిరోధక శక్తి) పెరిగి ఉంటుందని, రెండోదశ విస్తృత సర్వేతో కరోనా వ్యాప్తిపై కచ్చితమైన అంచనాకు రావచ్చని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. మొదటిదశ సర్వేకు స్పందన వచ్చిందని, ఇతరరాష్ర్టాలు తమ వద్ద సర్వేచేయాలని కోరాయని తెలిపారు. logo